Rupee Declined 15 Paise | కుదేలైన రూపాయి.. డాలర్‌తో పోల్చితో చారిత్రాత్మక కనిష్ఠ స్థాయికి!

డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ శనివారం నాడు భారీగా పతనమైంది. రికార్డు స్థాయి కనిష్ఠాన్ని చవిచూసింది. 15 పైసలు కోల్పోయింది. దీనికి నిపుణులు ఏమంటున్నారు?

  • By: TAAZ |    news |    Published on : Sep 05, 2025 6:38 PM IST
Rupee Declined 15 Paise | కుదేలైన రూపాయి.. డాలర్‌తో పోల్చితో చారిత్రాత్మక కనిష్ఠ స్థాయికి!

Rupee Declined 15 Paise | అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ శుక్రవారం నాడు మరో దఫా బలహీనపడింది. విదేశీ నిధులు తరలిపోవడం, భారత్‌పై అమెరికా అదనపు టారిఫ్‌ల విధింపు నేపథ్యంలో శుక్రవారం 88.27 రూపాయల కనిష్ఠానికి పడిపోయింది ఏకంగా 15 పైసలు కోల్పోయింది. డాలర్‌ బలహీనత, క్రూడాయిల్ ధరలు పడిపోవడం వంటి అంశాలు రూపాయి పతనాన్ని అడ్డుకోలేక పోయాయని ఫారెక్స్‌ ట్రేడర్లు చెబుతున్నారు.

ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్ వివరాలు

  • శుక్రవారం రూపాయి ట్రేడింగ్‌ రూ.88.11 వద్ద మొదలైంది.
  • ఇంట్రాడేలో మునుపెన్నడూ లేని కనిష్ఠాన్ని.. రూ.88.38 చూసింది.
  • చివరకు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి రూ.88.27 వద్ద నిలిచింది.
  • గురువారం రూపాయి రూ.88.12 వద్ద ముగిసింది.

కొంప ముంచిన వదంతులు

ట్రంప్‌ సర్కార్‌ భారత ఐటీ రంగంపై టారిఫ్‌లు విధిస్తుందన్న వదంతులతో రూపాయి విలువ రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోయిందని ఫిన్‌రెక్స్‌ ట్రజరీ అడ్వయిజర్స్‌ ఎల్‌ఎల్‌పీ ఈడీ అనిల్‌ కుమార్‌ భన్సాలీ అన్నారు. అయితే.. ఆ వార్తలను తర్వాత వార్తా సంస్థలు ఖండించడంతో కొంత పుంజుకున్నప్పటికీ.. డాలర్‌ డిమాండ్‌ మాత్రం బలంగానే కొనసాగిందని చెప్పారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోక్యం చేసుకుని రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిందని కానీ.. ట్రంప్‌ టారిఫ్‌ ప్రకటనల ప్రభావంతోపాటు.. ఎఫ్‌పీఐల అమ్మకాల ఒత్తిడి రూపాయిని మరింత బలహీనం చేసిందని భన్సాలీ వ్యఖ్‌యానించారు.

ఇతర మార్కెట్ అంశాలు

డాలర్ సూచీ (Dollar Index) – 0.31 శాతం పడిపోయి 98.03 వద్ద నిలిచింది.
బ్రెంట్ క్రూడ్ (Brent Crude) – 0.25 శాతం తగ్గి 66.82 డాలర్లు/బ్యారెల్ వద్ద ట్రేడైంది.
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో – సెన్సెక్స్ 7.25 పాయింట్లు పడి 80,710.76 వద్ద ముగిసింది. నిఫ్టీ 6.70 పాయింట్లు పెరిగి 24,741 వద్ద స్థిరపడింది.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) గురువారం ₹106.34 కోట్లు విలువైన షేర్లు విక్రయించారు.