Revanth Reddy: ఎస్సీ వర్గీకరణతో.. ఆత్మసంతృప్తి

  • By: sr    news    Feb 04, 2025 8:48 PM IST
Revanth Reddy: ఎస్సీ వర్గీకరణతో.. ఆత్మసంతృప్తి

విధాత, హైదరాబాద్‌: మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణకు పోరాటం చేస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ప్రకటన సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దళితులకు అన్ని రంగాల్లో అపార అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని నొక్కి చెప్పారు. నేను 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. నా రాజకీయ జీవితంలో నాకు ఆత్మసంతృప్తిని కలిగించిన రోజు ఇదేనన్నారు. ఇలాంటి అవకాశం నాకు రావడం సంతోషం చరిత్రపుటల్లో ఇది శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు.

వర్గీకరణకు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలుకు చర్యలు చేపట్టిందన్నారు. అతి తక్కువ సమయంలో సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలిపారు. ఆనాడు ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే నన్ను సభ నుంచి బయటకు పంపించారు. కానీ ఈనాడు సభా నాయకుడిగా వర్గీకరణ అమలుకుకు సభలో నిర్ణయం తీసుకుంటున్నాం. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే సాధ్యమైందన్నారు. రంగుల గోడలు.. అద్దాల మేడలు కాదు.. చివరి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించాలన్న అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందుకు సభ్యులందరి సహకారం ఉండాలని రేవంత్‌ రెడ్డి కోరారు.

గాంధీ భవన్‌లో సంబరాలు.

ఇదిలాఉండ‌గా.. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ, కౌన్సిల్‌ లో తీర్మానం చేయడంతో హర్షం వ్యక్తం చేసిన బీసీ, దళిత సంఘాలు గాంధీ భవన్‌ లో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.