ఆ ఆరు హత్యలు ఎందుకు చేశానంటే.. షాబాద్‌ కిరాతకుడి సెల్ఫీ వీడియో

షాబాద్‌ను కుదిపేసిన 6 హత్యల కేసులో కొత్త ట్విస్ట్. హత్యలకు ముందు రాజ్‌కుమార్ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో పోలీసులకు దొరికింది. అందులో అప్పులు, నమ్మకద్రోహం గురించి ఏమన్నాడు? దర్యాప్తులో బయటపడిన కీలక వివరాలు చదవండి.

తెలంగాణలో సంచలనం రేపిన షాబాద్‌ ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్‌కుమార్‌ హత్యలకు ముందు స్వయంగా రికార్డ్‌ చేసుకున్న వీడియోను పోలీసులు గుర్తించారు. నిందితుడి మృతదేహం వద్ద మొబైల్‌ ఫోన్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాన్ని పరిశీలించగా.. అందులో తాను ఈ ఘాతుకాలకు ఎందుకు పాల్పడుతున్నదీ వివరిస్తూ సెల్ఫీ వీడియో చేశాడని ఫ్యూచర్‌ సిటీ సీపీ తరుణ్‌ జోషి వెల్లడించారు. ఈ వీడియోను ఆయన మీడియాకు చూపారు. మృతురాలి కుటుంబం వల్ల తాను అప్పులపాలయ్యానని, తనను నమ్మించి ద్రోహం చేశారని రాజ్‌కుమార్‌ ఆ వీడియోలో ఆరోపించాడు.

ఈ వీడియోను ఘాతుకాలకు కొద్దిగా ముందు.. జూలై 10వ తేదీ సాయంత్రం 4.55 గంటల సమయంలో రికార్డు చేసినట్టుగా ఉంది. తన సంపాదనలో సగం వాళ్లకోసమే ఖర్చు పెట్టానని, తన వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని, తనను రోడ్డున పడేశారని తెలిపాడు. అప్పులపాలయ్యానని, పిల్లలకు రూపాయి విలువ చేసే భూమి కూడా లేకుండా అయిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇంత చేసీ చివరకు తనపైనే కేసు పెట్టి జైలుకు పంపారని తెలిపాడు. నమ్మి ద్రోహం చేసినందుకే వాళ్లను చంపాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.

ఇదే కేసులో మరో కీలకాంశం కూడా వెల్లడైంది. హత్యల సమయంలో బాలికను రాజ్‌కుమార్‌ ఒక కారులో తీసుకువెళ్లినట్టు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయింది. బాలిక కారులో ఉండగానే తన ఇద్దరు పిల్లలను, భార్యను కూడా చంపినట్టు తెలుస్తున్నది. చివరకు బాలికను అఖిల్‌ సాగర్‌ చెరువు వద్దకు తీసుకెళ్లి గొంతుకోసి చంపేశాడు. ఈ హత్యలన్నీ కొన్ని గంటల వ్యవధిలోనే వేరువేరు ప్రాంతాల్లో చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ వీడియోతో పాటు ఇతర డిజిటల్ ఆధారాలను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. దర్యాప్తును వేగవంతం చేశారు.

 

Latest News