South West Monsoon | రాష్ట్రవ్యాప్తంగా మూడ్రోజులు మోస్తరు వానలు.. అక్కడక్కడ భారీ వర్షాలు

South West Monsoon | ఎండల వేడిని తట్టుకోలేక పోతున్న సాధారణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుభవార్త చెప్పింది. అదే సమయంలో కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం నిల్వలు పెట్టుకున్న రైతులకు హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై శనివారం ఒక నివేదికను విడుదల చేసింది. శనివారం (17/5/2025) ఉదయానికి ఉన్న సమాచారం మేరకు ఈ వాతావరణ విశ్లేషణను (Meteorological Analysis) అందించింది. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమిస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రంలో మిగిలిన ప్రాంతాల్లోకి, మధ్యబంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నదని వెల్లడించింది. దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో శనివారం ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం శనివారం నాడు.. సగటు సముద్ర మట్టం నుండి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. ఈ ఆవర్తనం నుండి ద్రోణి ఒకటి మధ్య కోస్తా ఆంధ్ర తీరం వరకు సగటు సముద్రమట్టం నుండి 1.5 & 5.8 కి. మీ ఎత్తులో ఏర్పడిందని పేర్కొన్నది. ఈ ద్రోణి ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకు వాలి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast):
శని, ఆదివారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాలలో చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings):
శనివారం, ఆదివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. సోమవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలతో వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
హానీ ట్రాప్ వలలో విద్యార్థి..పాక్ కు భారత మిలటరీ రహస్యాల చేరవేత!
అల్ట్రా గ్లామర్ లుక్‌లో నేహా శెట్టి ఫొటోలు!
బ్యాంకుల్లో కొలువుల జాతర .. 4640 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల
‘శని’ మిమ్మల్ని వెంటాడుతుందా..? వేప చెట్టుతో ఉపశమనం పొందండిలా..!