Southwest Monsoon | ముందే వస్తున్న నైరుతి.. మే 27 నాటికే కేరళ తీరానికి..

Southwest Monsoon | అనుకున్నదాని కంటే ఐదు రోజులు ముందుగానే అంటే మే 27వ తేదీకే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. వాస్తవానికి జూన్ 1న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని తొలుత అంచనా వేసినా.. రుతుపవనాల పురోగతిలో వేగంగా ఉండటంతో ముందేగానే వస్తున్నాయని ఐఎండీ ప్రకటించింది. ముందుగానే రుతుపవనాలు వస్తున్నాయంటే వ్యవసాయ రంగానికి మంచి వార్తగా చెబుతున్నారు. ముందుగా రుతుపవనాల రావడంతో వర్షాలు సమృద్ధిగా పడతాయి. ఈ ఏడాది వర్షపాతం కూడా సాధారణంగా ఉంటుందని చెప్పడంతో రైతాంగం సంతోషంలో మునిగిపోయింది. రుతుపవనాలు సమీపించడానికి ముందే అంటే మే 23 నుంచే కేరళలో భారీ వర్షాలు పడనుండటంతో అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు కూడా ముందుగానే రుతురాగం వినిపించనుంది.
మరోవైపు తమిళనాడు సైతం ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమవుతున్నది. రాష్ట్రంలో కీలకమైన మెట్టూరు డ్యామ్ నుంచి నీటిని జూన్ 12న వదిలేందుకు కూడా సమాయత్తమైంది. వర్షాల రాక నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం (మే 19, 2025) సమీక్షా సమావేశం నిర్వహించారు. నీలగిరి, కోయంబత్తూర్, తిరుప్పూర్, థేని, దుండిగల్, ఈరోడ్, కృష్ణగిరి, ధర్మపురి ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
మహారాష్ట్ర అధికారులు సైతం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మహారాష్ట్రకు కూడా నైరుతి రుతుపవనాలు ఊహించిన దానికంటే ముందుగానే రానున్నాయి. ప్రత్యేకించి పుణె, ముంబై, కొంకణ్ బెల్ట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణంగా కొంకణ్ ప్రాంతానికి జూన్ ఐదు నాటికి రుతుపవనాలు వస్తుంటాయి.