ఫోన్ ట్యాపింగ్ కేసు.. తుప్పుబట్టిన సెల్ ఫోన్! శ్రవణ్ రావు తీరుతో పోలీసుల విస్మయం

విధాత: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) నిందితుడు శ్రవణ్ రావును సిట్ బృందం బుధవారం మరోసారి విచారించారు. గత శనివారం శ్రవణ్‌రావును ఆరున్నర గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. అయితే ఆరోజు పోలీసుల విచారణకు శ్రవణ్ రావు సహకరించకపోవడం, పోలీసులు అడిగిన ప్రశ్నలకు దాటవేత ధోరణి అవలంభించడంతో మరోసారి విచారించాలని సిట్ బృందం భావించింది. అందులో భాగంగానే మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో బుధవారం మళ్లీ విచారించింది.
గత బీఆర్ఎస్ పాలకులతో ఉన్న సంబంధాలు..ప్రభాకర్ రావు తో పాటు ఫోన్ ట్యాపింగ్ బృందం జరిపిన ట్యాపింగ్ వ్యవహారాలపై సిట్ శ్రవణ్ రావును ప్రశ్నించింది. జడ్జిలు, మీడియా సంస్థల అధిపతులపైన, అప్పటి ప్రతిపక్ష నాయకులపైన, వారికి ఆర్థిక వనరులు సమకూర్చే వ్యక్తులపైన జరిగిన ట్యాపింగ్ లో శ్రవణ్ రావు పాత్రపై ప్రశ్నలు కురిపించారు. అయితే నాకు బీఆర్ఎస్ పాలకులతో సంబంధం లేదని..ప్రభాకర్ రావుతోనే సంబంధం ఉందని శ్రవణ్ రావు సమాధానమిచ్చినట్లుగా సమాచారం.
ముఖ్యంగా 2023అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శ్రవణ్ రావు వాడిన ఫోన్లను స్వాధీనం చేయాలని సిట్ కోరగా.. అతను ఓ పాత తుప్పు బట్టిన ఫోన్ ఇవ్వడంతో విచారణాధికారులు విస్మయానికి గురయ్యారు. సుప్రీంకోర్టు స్పష్టంగా సిట్ విచారణకు సంపూర్ణంగా సహకరించాలని ఆదేశించినా శ్రవణ్ రావు సహకరించకపోవడం వారిని అసంతృప్తికి గురి చేసింది. దీంతో తాము కోరిన రెండు సెల్ ఫోన్లతో పాటు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానంతో ఈనెల 8వ తేదీన మరోసారి విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి ఈ రోజుకు విచారణ ముగించారు.
అలాగే ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ప్రత్యేకంగా పరికరాలను తీసుకొచ్చి, వాటిని వివిధ ప్రాంతాల్లో సర్వర్ రూంలుగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా నడిపించారు. శ్రవణ్ రావుకు ఓ మీడియా సంస్థ ఉంది. ఆ మీడియా సంస్థ కార్యాలయంలోనే ప్రత్యేకంగా సర్వర్ రూంలను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచే ఈ వ్యవహారాన్ని నడిపారు. ఈ వ్యవహారంలో శ్రవణ్ రావుకు ప్రణీత్ రావు సహకరించారు. ప్రణీత్ రావు నేతృత్వంలోనే శ్రవణ్‌రావుకు చెందిన కార్యాలయాల్లో ఫోన్ ట్యాపింగ్ పరికరాలను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచే ఫోన్ ట్యాపింగ్‌కు తెరలేపారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించినందుకు శ్రవణ్ రావు ఏమైనా ఆర్థికంగా లబ్ధిపొందారా.. ఇదే నిజమైతే ఎవరు ఆయనకు ఆర్థికంగా మద్దతు ఇచ్చారు.. అన్న అంశాలపై సిట్ బృందం విచారించనుంది.