Telangana | పెన్షనర్లకు.. మొండి చెయ్యి? లబ్ధిదారులు లబోదిబో

Telangana | Congress | CM Revanth Reddy
- పెన్షన్ పెంచుతామని ఎన్నికల్లో హామీ
- ఇప్పుడు పెంచకుండా దాటవేత వైఖరి
- 43,96,667 మంది లబ్ధిదారులు లబోదిబో
- ప్రస్తుతం సాధారణ పింఛన్ నెలకు 2,016
- దివ్యాంగుల నెలవారీ పింఛన్ రూ.4,016
- ప్రతి నెలా పింఛన్ ఖర్చు రూ.988 కోట్లు
- పెంచితే అదనపు కలిపి రూ.1859 కోట్లు
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విధాత): తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పింఛన్ దారులకు ఇచ్చే మొత్తాన్ని పెంచుతామని పీఠమెక్కిన కాంగ్రెస్ సర్కార్ ఏడాదిన్నర అవుతున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. అయితే కొత్తవారికి మంజూరు చేసేందుకు వీలుగా దరఖాస్తులు సమర్పించేందుకు మాత్రం అవకాశం కల్పించారు. ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం పాత వారికి పింఛన్ మొత్తాన్ని పెంచకుండా, కొత్తవారికి మంజూరు చేయకుండా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులను కాంగ్రెస్ సర్కార్ సతాయిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సామాజిక పెన్షనర్లు 43,96,667 మంది
తెలంగాణలో ప్రస్తుతం 43,96,667 మంది ప్రతి నెలా పింఛన్లు తీసుకుంటున్నారు. వీరికి పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) ప్రతి నెలా రూ.988 కోట్ల వరకు వివిధ వర్గాల వారీగా పెన్షన్లు మంజూరు చేస్తున్నది. సెర్ప్ లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధులు 15,98,729 మంది, వితంతువులు 15,60,707 మంది, బీడీ కార్మికులు 4,24,585 మంది, ఒంటరి మహిళలు 1,42,394 మంది, గీత కార్మికులు 65,307, చేనేత కార్మికులు 37,145 మంది, హెచ్ఐవీ బాధితులు 35,998 మందితో పాటు దివ్యాంగులు 5,03,613 మంది లబ్ధి పొందుతున్నారు. పోస్టాఫీసులు, బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షనర్లకు ప్రతి నెలా వేయి కోట్ల వరకు అందచేస్తున్నారు. దివ్యాంగులకు ప్రతి నెలా రూ.4,016 ఇస్తుండగా మిగతా పింఛన్ దారులకు మాత్రం రూ.2,016 చెల్లిస్తున్నారు.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఏటా 881 కోట్లు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు పది జిల్లాల పరిధిలో రూ.881 కోట్లు ప్రతి ఏడాది పంపిణీ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 24.21 లక్షల మంది లబ్ధిదారులకు 2014 సంవత్సరంలో రూ.3,350 ఖర్చు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 నవంబర్ నెల నుంచి 2022 జనవరి నెల వరకు రూ.45,882 కోట్లు పంపిణీ చేశారు.
పెన్షన్లు పెంచుతామన్న కాంగ్రెస్
తాము అధికారంలోకి వస్తే సాధారణ పింఛన్ మొత్తం (ప్రతి నెలా) రూ.2,016 నుంచి రూ.4వేలకు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. అదే విధంగా దివ్యాంగుల పింఛన్ రూ.4,016 నుంచి రూ.6 వేలకు పెంచుతామని వేదికల మీద ప్రకటించారు. కాంగ్రెస్ గెలుపొంది, 2023 డిసెంబర్ నెలలో అధికారంలోకి రావడంతో పింఛన్ దారులు ఆనందపడ్డారు. తమకు ఇచ్చే పింఛన్ మొత్తం పెరుగుతుందని ఆశపడ్డారు. ఆ మరుసటి సంవత్సరం (2024) జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో అయినా పెంచకపోతారా ఎదురు చూశారు. అప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఎప్పుడెప్పుడు పెంచుతారా అని లబ్ధిదారులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.
గ్రామాల్లో నిలదీస్తున్న పెన్షనర్లు
ఇప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించిన సందర్భంలో పింఛన్లు ఇంకెప్పుడు పెంచుతారో చెప్పాలని లబ్ధిదారులు నిలదీసినంత పనిచేస్తున్నారు. ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో ఓటు వేసి నిండా మోసపోయామని వారి ముందే వాపోతున్నారు. ఎమ్మెల్యేలు సముదాయించినప్పటికీ వృద్ధ మహిళలు, వికలాంగులు, ఒంటరి మహిళలు విన్పించుకోవడం లేదు. గ్రామాల్లో చోటా మోటా కాంగ్రెస్ నాయకులు కన్పిస్తే దూషిస్తున్నారు.
బదలాయింపు దరఖాస్తుల సంగతేంటి?
కుటుంబంలో భర్త లేదా భార్య చనిపోతే ఆ పింఛన్‌ను బతికి ఉన్నవారికి బదలాయిస్తామని ప్రకటించారు. అలాంటివారు కొందారు తమ పేర్లకు బదలాయించాలని దరఖాస్తు చేసుకున్నా వాటిని పరిష్కరించడం లేదని తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. మీ సేవా కేంద్రాలు, మండల కార్యాలయాల్లో 5.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులకు ఇంత వరకు మోక్షం లభించలేదు. మంజూరు చేస్తున్నది లేదా తిరస్కరిస్తున్నది కూడా చెప్పకుండా దరఖాస్తుదారులను అయోమయంలో పెట్టారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. మంజూరు చేశారా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రజలు మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వీరికి సమాధానం చెప్పలేక అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.
ఇదీ లెక్క
రాష్ట్రంలో 38,93,054 మంది సామాజిక పెన్షన్లు అందుకునేవారు ఉన్నారు. వీరికి ఇప్పుడు చెల్లిస్తున్న ప్రకారం ఇవ్వాలంటే రూ.784,83,96,864 అవసరమవుతాయి. అదే పెంచుతామని చెప్పిన దాని ప్రకారం ఏటా రూ.1557,22,16,000 అవుతాయి. వీరికితోడు దివ్యాంగులు 5,03,613 మందికి ఇప్పుడు ఇస్తున్న ప్రకారం రూ.202,25,09,808 ఇవ్వాలి. అదే పెంచినది కూడా కలిపితే.. ఏటా రూ.302,16,78,000 అవుతాయి. మొత్తంగా పాత పద్దతిని కొనసాగిస్తే ఏటా రూ.987,09,06,672, ఇచ్చిన మాట ప్రకారం పెంచి ఇవ్వాలంటే రూ.1859,38,94,000 అవుతుంది. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే ఇంత మొత్తంలో సర్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడుతుందా? అనేది వేచి చూడాలి. |