Palamuru-Rangareddy Lift Irrigation | నాగం.. పిటిషన్ కొట్టివేత

Palamuru-Rangareddy Lift Irrigation | నాగం.. పిటిషన్ కొట్టివేత
  • ‘పాలమూరు’ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ నాగం పిటిషన్
  • హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమన్న అత్యున్నత న్యాయస్థానం

Palamuru-Rangareddy Lift Irrigation Scheme |

విధాత, హైదరాబాద్ః పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

నాగం తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ వాదనలు వినిపించారు. ఈ ప్రాజెక్టుతో ప్రభుత్వానికి రూ. 2,426 కోట్లు నష్టం వాటిల్లిందంటూ ఆయన వాదించారు. ప్రభుత్వం ఆమోదించిన ప్రకారం 65 శాతం పంపులు, మోటార్ల కోసం బీహెచ్ఈఎల్ కు.. 35 శాతం సివిల్ వర్క్స్ కు మేఘాకు చెల్లింపులు చేయాల్సి ఉండగా అంతర్గత ఒప్పందం ప్రకారం బీహెచ్ఈఎల్ కు 65 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారని పేర్కొన్నారు. మేఘా సంస్థకు 80 శాతం చెల్లింపులు జరిగాయంటూ కోర్టుకు వివరించారు.

భారీగా అవకతవకలు జరిగాయంటూ ఆయన పేర్కొన్నారు. మేఘా సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదించారు. తెలంగాణ హైకోర్టులో దీనికి సంబందించిన 5 పిటిషన్లు కొట్టేసిందని పేర్కొన్నారు. ఎటువంటి అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారని పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ కూడా ఇందులో ఫిర్యాదు చేయలేదని గుర్తు చేశారు. ఏదో ఒక డాక్యుమెంట్ ఆధారంగా కేసు నడుపుతున్నారని గుర్తు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.