Telangana cabinet expansion | క్యాబినెట్‌లోకి రాములమ్మ? స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కూడా!

  • By: TAAZ    news    Jun 07, 2025 8:47 PM IST
Telangana cabinet expansion | క్యాబినెట్‌లోకి రాములమ్మ? స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కూడా!

Telangana cabinet expansion | తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు మహూర్తం కుదిరిందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులతో గవర్నర్‌ ప్రమాణం చేయించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా 12 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరు ఖాళీలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణలో ఇద్దరు మంత్రులను తప్పించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ రెండూ కూడా కలుపుకొంటే మొత్తం ఎనిమిది మందికి మంత్రులుగా అవకాశం ఉంది. అయితే.. ఈ ఎనిమిదీ భర్తీ చేస్తారా? లేక కొన్ని ఆపుతారా? అన్న విషయాన్ని పార్టీ నాయకత్వం రహస్యంగానే ఉంచింది. ఎమ్మెల్సీ విజయశాంతిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ ఉన్నారు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

సమీకరణాలే పెద్ద చిక్కు!

హైదరాబాద్ నగరంతోపాటు రంగారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మొదట్లో చోటు లభించలేదు. ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం ఇప్పటికైనా కల్పిస్తారా? లేదా? అనేది సస్పెన్స్‌గానే ఉన్నది. మాదిగ, లంబాడాలకు కూడా క్యాబినెట్‌లో ప్లేస్‌ ఇవ్వలేదు. తాజా విస్తరణలో ఈ రెండు కులాలను పరిగణనలోకి తీసుకుంటారనే వాదనలు ఉన్నాయి. వాస్తవానికి కుల సమీకరణాలే మంత్రివర్గ విస్తరణకు ప్రధాన ఆటంకంగా మారిందని తెలుస్తున్నది. గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ ఢిల్లీ వెళ్లి.. మంత్రివర్గ విస్తరణతో పాటు, పీసీసీ కార్యవర్గం కూర్పుపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కేసీ వేణుగోపాల్‌తో చర్చించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బిజీ షెడ్యూల్‌ కారణంగా కలవలేకపోయారు. ఈ సమావేశాల కొనసాగింపుగా రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ శుక్రవారం రేవంత్‌రెడ్డితో సుదీర్ఘ భేటీ నిర్వహించారు. పార్టీ వ్యవహారాలతోపాటు.. విస్తరణపైనా చర్చించారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తలు లీక్‌ అయ్యాయి.

కేసీఆర్ లక్ష్యంగా విజయశాంతికి పదవి

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నాలుగైదు రోజుల క్రితం ఒక ఎమ్మెల్యేకు ఫోన్ చేసి సంభాషించారని, జూన్ 8వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని, సిద్ధంగా ఉండాలని సూచించారని విశ్వసనీయంగా తెలిసింది. ఈయన పేరు విస్తరణ వార్తలు వచ్చిన ప్రతిసారీ ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ఇక.. ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎం విజయశాంతిని మంత్రిమండలిలోకి తీసుకోవాలని అధిష్ఠానం పెద్దలు నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది. గడచిన పాతిక సంవత్సరాలు గా ఆమె ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన విషయం తెలిసిందే. ఆమెకు మంత్రి పదవి అప్పగించి బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు కుటుంబాన్ని టార్గెట్ చేయాలనే లక్ష్యంతో పార్టీ హైకమాండ్‌ ఉందని చెబుతున్నారు.

ప్రముఖంగా విన్పిస్తున్న సుదర్శన్ రెడ్డి పేరు

నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్ఠానం వద్ద ప్రతిపాదించగా గ్రీన్‌ సిగ్నల్‌ లభించిందని సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నీటి పారుదల మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా సుదర్శన్‌రెడ్డికి ఉన్నది. ఇదే జిల్లా నుంచి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు కే మదన్ మోహన్ రావు రాహుల్ గాంధీ కోటరీ వ్యక్తుల ద్వారా పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే వెలమ కులం నుంచి జూపల్లి కృష్ణారావు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మదన్‌ మోహన్‌ అవకాశాలు ఎంత మేర ఉంటాయనే చర్చలు జరుగుతున్నాయి.

ఆదిలాబాద్‌లో రేసులో ఇద్దరు ఎమ్మెల్యేలు

అదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే కే ప్రేమ్ సాగర్ రావు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జిల్లాలో కార్యకర్తలు, నాయకులకు అండగా ఉన్నానని, బీఆర్ఎస్ దాష్టీకాలను ఎదుర్కొన్నందున తనకే పదవి ఇవ్వాలని ప్రేమ్ సాగర్ ఒత్తిడి తెస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వేరే పార్టీలో ఉండి, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం వస్తుందని గ్రహించి పార్టీలో చేరిన వివేక్‌కు ఎలా మంత్రి పదవి ఇస్తారని పార్టీ సమావేశాల్లో అభ్యంతరాలు కూడా ఆయన లేవనెత్తారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీజేపీలో కొనసాగిన వివేక్.. ఆ పార్టీ వైఖరి నచ్చక కాంగ్రెస్ గూటికి చేరారు. రేవంత్ రెడ్డి కూడా ఆయనను పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా మంత్రి పదవితో పాటు కుమారుడికి ఎంపీ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు గడ్డం కుటుంబం ప్రచారం చేసుకుంటున్నది. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో చేరానని, ఇచ్చిన మాట ప్రకారం తనకు పదవి ఇవ్వాలని ఢిల్లీ పెద్దల వద్ద ప్రస్తావిస్తున్నారు. ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం ఇచ్చిన పక్షంలో జూపల్లి కృష్ణారావును పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్టు చర్చించుకుంటున్నారు.

రంగారెడ్డి నుంచి ప్రసాద్, పాలమూరు నుంచి శ్రీహరి

సీనియర్‌ ఎమ్మెల్యే అయిన తనకు రంగారెడ్డి జిల్లా నుంచి అవకాశం కల్పించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కోరుతున్నారు. అయితే ఈ జిల్లా నుంచి వికారాబాద్ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను మంత్రి మండలిలోకి తీసుకోవాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని తెలిసింది. ఈ నిర్ణయంతో వివేక్ వెంకటస్వామిని తప్పించడంతోపాటు, డిప్యూటీ సీఎం దూకుడు చెక్ పడుతుందని రేవంత్‌ వర్గీయులు చర్చించుకుంటున్నారు. ప్రసాద్‌ను మంత్రి మండలిలోకి తీసుకుంటే స్పీకర్‌ స్థానం దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్‌ను వరిస్తుందని అంటున్నారు. అయితే ఆ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉండటమే కాకుండా సీనియర్ నాయకుడు కే జానారెడ్డి ఒప్పుకుంటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు ఉన్నప్పటికీ, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవిని ఇవ్వాలని అధిష్ఠానం పెద్దలు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

హైదరాబాద్ జిల్లాకు మొండి చెయ్యి?

హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరితే మంత్రి పదవి ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేరారనే వాదనలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఒత్తిడితోనే తీర్థం పుచ్చుకున్నారని, చేరిన తరువాత మాట మార్చారని ఆయన అనుచరులు అంతర్మథనం చెందుతున్నారు.

మాదిగ, లంబాడా నేతల ఒత్తిడి

రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మాదిగ, లంబాడా కులాలకు ప్రాతినిధ్యమే లేదని ఆ కులాలకు చెందిన నాయకులు కొన్ని నెలలుగా బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి తమ కులం ఓటు బ్యాంకు బాగా ఉపయోగపడిందని, అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించారని కుల సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగినందున మాదిగ కులం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తే సముచితంగా ఉంటుందని, గౌరవించినట్లు అవుతుందని వారు అంటున్నారు.

తప్పించే ఇద్దరు మంత్రులు ఎవరో

రేవంత్‌ మంత్రిమండలి నుంచి ఇద్దరిని తప్పించే అవకాశాలు ఉన్నాయని గాంధీభవన్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కనీసం వారి శాఖలైన మార్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఆ ఇద్దరు ఎవరనే దానిపై కార్యకర్తలు పెద్దల వద్ద ఆరా తీస్తున్నారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను తప్పించవచ్చని, లేదా శాఖ మార్చవచ్చనే ప్రచారం సాగుతున్నది. అధిష్ఠానం ఆమె విషయంలో అంత సుముఖంగా లేనప్పటికీ.. రేవంత్‌ రెడ్డి పట్టుబట్టి ఆమె శాఖలను మార్చి కొనసాగించవచ్చనే వాదన కూడా ఉంది. ఈ విషయం కూడా విస్తరణతో తేలిపోనున్నది.

చీఫ్‌విప్‌, డిప్యూటీ స్పీకర్‌ పోస్టుల భర్తీ?

చీఫ్ విప్ పదవితో పాటు డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా ఈ సందర్భంగానే భర్తీ చేయవచ్చని అంటున్నారు. ప్రస్తుతం నలుగురు విప్‌లు ఉన్నారు. అందులో వేములవాడ ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్‌కు పదోన్నతి ఇస్తూ చీఫ్ విప్‌గా నియమించే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. మున్నూరు కాపు కులం పెద్దలు ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తమ కులం వారు కాదని, ఆమె భర్త మురళీధర్ రావు మున్నూరు కాపు అని చెబుతున్నారు. అదే విధంగా డిప్యూటీ స్పీకర్ పదవిని ఎవరికి కట్టబెడతారనేది తెలియడం లేదు.