KTR | సీన్ రివర్స్.. హైకోర్టులో కేటీఆర్‌కు షాక్! వరుస సెలవులు.. అరెస్ట్ తప్పదా?

- విచారణకు హజరు కావాలన్న హైకోర్టు
- సర్వశక్తులు ఒడ్డుతున్న కేటీఆర్
- మూసుకుపోయిన అన్ని దారులు
- సుప్రీంకోర్టుకు పయనం
- అడ్డొస్తున్న వరుస సెలవులు
విధాత, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ విచారణను ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఉన్నాయి. చట్టపరంగా విచారణ నుంచి మినహాయింపు పొందేందుకు ముందున్న అన్ని దారులు దాదాపు మూసుకుపోయినట్టే పరిస్థితులు కన్పిస్తున్నాయి. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు గురువారం (జనవరి 9వ తేదీ) నాడు హాజరు కావాల్సిందేనని బుధవారం తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తన వ్యక్తిగత అడ్వకేట్ సమక్షంలో ఏసీబీ విచారణ జరగాలని హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అందుకు కోర్టు సమ్మతించలేదు. విచారణలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే హైకోర్టు తలుపు తట్టవచ్చని, అడ్వకేట్ దూరంగా ఉండి మీ విచారణను చూస్తారని స్పష్టం చేసింది.
విచారణ ఆడియో, వీడియో రికార్డులు కావాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరినా హైకోర్టు సున్నితంగా తిరస్కరించింది. తెలంగాణ హైకోర్టు తీర్పు అనుకూలంగా రాకపోవడంతో ఏసీబీ విచారణ నుంచి మినహాయింపు పొందేందుకు కే.టీ.రామారావు సర్వశక్తులు ఒడ్డుతున్న విషయం తెలిసిందే. చివరగా ఆయన సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టారు. గురువారం లేదా శుక్రవారం నాడు ఒకవేళ లిస్టింగ్ అయితే విచారణకు ఏ తేదీ కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. అయితే బుధవారం సాయంత్రం వరకు పిటీషన్ లిస్టింగ్ కాలేదు. వరుస సెలవులు, సంక్రాంతి పండుగ కూడా రావడం మైనస్ గా మారింది. ఒకవేళ లిస్టింగ్ అయినా ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభిస్తుందా లేదా అనేది బీఆర్ఎస్ పార్టీలో సస్పెన్స్ గా మారింది.
కే.టీ.రామారావు పిటీషన్ విచారించే ముందు తమ వాదనలు కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. నెక్లెస్ రోడ్డులో నిర్వహంచిన ఫార్ములా ఈ రేసు కోసం అప్పటి మున్సిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆదేశాల మేరకు రూ.54.88 కోట్లు విదేశాల్లోని ప్రైవేటు కంపెనీకి చెల్లించిన విషయం విధితమే. బుధవారం నాడు రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ బంజారాహిల్స్ లోని తెలంగాణ ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి ఆయనకు పలు ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టారు.
ఇదిలా ఉండగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్.రెడ్డి బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి విచారణకు వెళ్లారు. సాయంత్రం వరకు కూడా ఆయన విచారణ కొనసాగుతూనే ఉన్నది. మరోవైపు బీసీ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు రాచర్ల యుగంధర్ గౌడ్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ లీజుపై ఈడీకి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విచారణ జరపాలని, బీఆర్ఎస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ పై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని డిమాండ్ చేశారు.