Arunachalam Tour: అరుణాచలం యాత్రకు వెళ్తున్నారా… ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Arunachalam Tour: ఇటీవల తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై (అరుణాచలం) వెళ్తున్నారు. దేశంలోనే ప్రముఖ శైవ క్షేత్రం కావడం.. ఇక్కడ శివుడు అగ్ని లింగ స్వరూపంలో ఉండటంతో ఈ క్షేత్రానికి అత్యంత ప్రాముఖ్యత వచ్చింది. ఇక్కడ గిరి ప్రదర్శన ప్రసిద్ధి చెందింది. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు 14 కిలోమీటర్లు గిరి ప్రదర్శన చేసుకుంటారు. ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో, మరిన్ని మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు.
గిరిప్రదక్షిణం చేయడం ద్వారా మహాపుణ్యం వస్తుందని.. మంచి జరుగుతుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు. పౌర్ణమి రోజున ఈ ప్రదక్షిణ చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. రమణ మహర్షి, శేషాద్రి స్వామి వంటి అనేక మంది స్వామీజీల ఆశ్రమాలు కూడా ఇక్కడ ఉన్నాయి.
అరుణాచలం వెళ్లిన తర్వాత భక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.. ఇక్కడ గిరి ప్రదక్షణ చేసేటప్పుడు పాదరక్షలు ధరించకూడదు. దీన్ని భక్తులు నియమంగా భావిస్తారు. ప్రదక్షిణ సమయంలో ఎలాంటి కోరికలు కోరకుండా, ‘అరుణాచల శివ’ నామస్మరణతో నిష్కామ భక్తితో నడవాలని అధ్యాత్మక వేత్తలు సూచిస్తున్నారు. ఉదయం 9 గంటల లోపు లేదా సాయంత్రం సూర్యతాపం తక్కువగా ఉండే సమయంలో ప్రదక్షిణం ప్రారంభించడం మంచిది, ఎందుకంటే 14 కి.మీ. దూరం నడవడం శారీరకంగా శ్రమతో కూడుకున్నది.
తక్కువ బరువున్న తేలికైన బట్టలు ధరించాలి. భారీ సంచులు, బ్యాగులు తీసుకెళ్లకుండా తేలికైన దుస్తులు ధరించి, నీటి బాటిల్, కొన్ని పండ్లు తీసుకెళ్లవచ్చు. గుండె జబ్బులు, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు 14 కిలోమీటర్లు నడవడం మంచిది కాదని చెబుతున్నారు. అయితే అటువంటి వారు ఆటోలో ప్రదక్షణ చేసే అవకాశం ఉంది.
చూడదగ్గ ప్రదేశాలు ఇవి..
అరుణాచలం చేరుకునే భక్తులు ముందుగా రమణాశ్రమం, శేషాద్రి స్వామి ఆశ్రమం, అష్టలింగాలు, కాలభైరవ ఆలయం వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. ఆలయ దర్శనానికి ముందు గిరిప్రదక్షిణం పూర్తి చేయడం ఆచారం. రాజగోపురం, వేయి స్తంభాల మండపం, శివగంగ తీర్థం వంటి స్థల విశేషాలను దర్శించడం మర్చిపోవద్దు. హైదరాబాద్ నుంచి తెలంగాణ టూరిజం ద్వారా ప్రత్యేక బస్సు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. బుకింగ్ కోసం https://tourism.telangana.gov.in/ సందర్శించవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram