ఒక నీలం రంగ ట్రాలీ సూట్‌కేసు.. ఎప్పటి నుంచి అక్కడ ఉన్నదో తెలియదు. పైగా దాని నుంచి దుర్వాసన. అక్కడక్కడా నెత్తుటి మరకలు. దాని సమీపం నుంచి వెళ్లే అందరిలో అనుమానాలు. లోపల ఏముందో తెలియదు. చివరికి పోలీసులు వచ్చి దాన్ని తెరిచి చూస్తే.. అందులో ఒక పురుషుడి మొండెం. ఇది ఉత్తర చెన్నైలోని పెరంబూర్‌ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం కనిపించిన దృశ్యం.

చనిపోయిన వ్యక్తి ఎవరో తెలియదు. రంగంలోకి దిగిన ప్రభుత్వ రైల్వే పోలీసులు ముందు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు. హత్య కేసు నమోదు చేసి, హంతకుల కోసం గాలిస్తున్నారు. ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం.. పెరంబూర్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాం నంబర్‌ 4లో శుక్రవారం ఉదయం 7.15 గంటలకు వదిలేసి ఉన్నట్టు కనిపించింది. ఈ సూట్‌కేసు నుంచి దుర్వాసన వస్తుండటంతో ఒక పోర్టర్‌.. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆ సూట్‌కేసుపై రక్తపు చారికలు ఉన్న విషయాన్ని గమనించారు.

వాస్తవానికి ఈ రైల్వేస్టేషన్‌ను అమృత్‌ భారత్‌ పథకం కింద్‌ అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. దీంతో తాత్కాలికంగా ఈ స్టేషన్‌లో సీసీటీవీ కెమెరాలను నిలిపివేసినట్టు రైల్వే పోలీసులు తెలిపారని న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొన్నది. ఫలితంగా రైల్వే స్టేషన్‌లో ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్‌ అందుబాటులో లేకపోవడ సవాలుగా మారింది. స్టేషన్‌ వెలుపలి దుకాణాలకు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను తాము పరిశీలిస్తున్నామని రైల్వే పోలీసులు చెప్పారు. ఒకరికంటే ఎక్కువ మంది ఈ నేరంలో భాగస్వాములయి ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు. ఇంతటి బరువైన సూట్‌కేసును ఒక వ్యక్తి మోసుకుని రావడం కష్టమని అన్నారు.

స్టేషన్‌ బయటి దుకాణాల సీసీటీవీ కెమరాల ఫుటేజ్‌ను గమనించిన పోలీసులు.. ఇద్దరు వ్యక్తులు నీలం రంగు సూట్‌కేసును ఆటోలో తీసుకొని స్టేషన్‌లోకి వెళుతున్నట్టు గుర్తించారు. దీని ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సూట్‌కేసులోని మొండెం పూర్తిగా కుళ్లిపోయి ఉందని రైల్వే పోలీసులు తెలిపారు. హతుడి వయసు 35 ఏళ్లు ఉండొచ్చనిఅంచనా వేస్తున్నారు.

సూట్‌కేసులో లభించిన మృతదేహానికి తల లేదు. రెండు కాళ్లు, రెండు చేతులు కూడా లేవు. ఎర్రటి ప్లాస్టిక్‌ షీటులో మృతదేహాన్ని చుట్టి.. సూట్‌కేసులో పెట్టి.. బయటి నుంచి లాక్‌వేశారు. తదుపరి పరీక్షలు, పోస్ట్‌మార్టం కోసం మొండేన్ని కిల్‌పాక్‌ మెడికల్‌ కాలేజీకి పంపించారు. ఇటీవలి కాలంలో పోలీస్‌ స్టేషన్‌లలో నమోదైన మిస్సింగ్‌ కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు.