TGSRTC | హైదరాబాద్‌లో 2026 నాటికి 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్‌లో 2026 నాటికి 2,000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. TSRTC చార్జింగ్ డిపోలు, స్టేషన్ల కోసం రూ.392 కోట్లు, 100 ఎకరాల భూమి కోరింది. ORRలో కేవలం ఎలక్ట్రిక్ బస్సులే నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

City Desk / Hyderabad / Telangana / 21st August 2025
TGSRTC | హైదరాబాద్ నగర రవాణా రంగంలో భారీ మార్పులు రాబోతున్నాయి. పాత డీజిల్ బస్సుల స్థానంలో పర్యావరణహితమైన విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కసరత్తులు ప్రారంభించింది.
2,000 ఎలక్ట్రిక్ బస్సులు ఆమోదం
ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణకు 2,000 ఎలక్ట్రిక్ బస్సులకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో వీటిని సాఫీగా నడిపించేందుకు అవసరమైన వసతులపై TGSRTC దృష్టి సారించింది.
రూ.392 కోట్ల అవసరం
ఈ ఈ–బస్ ప్రాజెక్ట్ కోసం ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది. హైటెన్షన్ విద్యుత్ కనెక్షన్ల కోసం రూ.292 కోట్లు, కొత్తగా 10 విద్యుత్ బస్ డిపోలు నిర్మాణానికి మరో రూ.100 కోట్లు – మొత్తంగా రూ.392 కోట్లు అవసరమని తెలిపింది. అంతేకాకుండా, ప్రతి ఈ–బస్ డిపోకు సుమారు 10 ఎకరాలు చొప్పున, మొత్తం 100 ఎకరాల భూమి కేటాయించాలని కోరింది. ఇందుకోసం ప్రభుత్వమే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
హైదరాబాద్‌లో డీజిల్ బస్సులకు చెక్
ప్రస్తుతం నగరంలో దాదాపు 2,800 డీజిల్ బస్సులు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కేంద్రం ఇచ్చిన 2,000 బస్సులతో పాటు, మిగతా 800 బస్సులను కూడా పొందేందుకు TGSRTC కొత్త ప్రతిపాదనలు కూడా పంపనుంది.
టెండర్లు, చార్జింగ్ సెంటర్లు
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2,000 ఎలక్ట్రిక్ బస్సుల కోసం టెండర్లు విడుదల చేసింది. ఫైనాన్షియల్ బిడ్స్ ఆగస్టు 12న తెరవాల్సిఉండగా, సెప్టెంబర్‌కు వాయిదా పడ్డాయి. ఒకసారి కంపెనీ ఎంపికైతే, ఉత్పత్తి ప్రారంభమవుతుందని, కొత్త బస్సులు 2026 ప్రథమార్థంలో నగరానికి చేరుకుంటాయని అధికారులు తెలిపారు. ఇక చార్జింగ్ వసతుల కోసం నగరవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న 19 డిపోలతో పాటు 10 కొత్త డిపోలలో హైటెన్షన్ విద్యుత్ కనెక్షన్లు కల్పించనున్నారు. అదనంగా, బస్సులు చార్జింగ్ కోసం డిపోలకు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేకుండా నగరంలో 10 ప్రత్యేక చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో స్టేషన్‌కి 2,000 చదరపు మీటర్ల భూమి అవసరమని RTC ప్రభుత్వం సహకారం కోరింది.
ఇవి కూడా చదవండి..
టీవీకే మధురై సభలో తొక్కిసలాటతో ఒకరి మృతి..12మంది పరిస్థితి విషమం
Godavari Floods | భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం..కృష్ణా ప్రాజెక్టుల గేట్ల ఎత్తివేత
Facebook Love | 100 కి.మీ. ప్రయాణం.. 13 గంటల దెబ్బలు.. ఓ యువకుడి ప్రేమ కథ ఇదీ..!