TTD EO Anil Kumar Singhal : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
సెప్టెంబరు 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టీటీడీ ఈవో తెలిపారు.

విధాత : సెప్టెంబరు 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే తిరులమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. శుక్రవారం బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో ఈ రోజు శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించాం అని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని..బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి 60 మెట్రిక్ టన్నుల పుష్పాలు వినియోగిస్తాం అని తెలిపారు. ప్రతిరోజూ 8 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంటాయన్నారు. బ్రహ్మోత్సవాల వేళ సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఉంటుందని..భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తాం అని స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు అకామిడేషన్ కల్పించేందుకు ఆన్‌లైన్ కోటా తగ్గిస్తాం అన్నారు. స్వయంగా వచ్చే ప్రముఖులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని చెప్పారు. సిఫారసు లేఖలు బ్రహ్మోత్సవాల సమయంలో అనుమతించబోమన్నారు. సాంకేతికతను వినియోగిస్తూ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. తలనీలాలు సమర్పించే భక్తుల కోసం కళ్యాణకట్టలో 1,150 మంది క్షురకులు అందుబాటులో ఉంటారని తెలిపారు. భక్తులకు మెరుగైన సేవ కోసం 20 హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేస్తున్నాం అని వెల్లడించారు. గరుడ సేవను తిలకించేందుకు 7 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని..అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు.
బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు : ఎస్పీ సుబ్బారాయుడు
బ్రహ్మోత్సవాల కోసం తిరుమల, తిరుపతిలో కలిపి మొత్తం 4,000 మంది పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. వీరిలో 3,000 మంది తిరుమల కొండపై విధుల్లో ఉండగా, మరో 1,000 మంది తిరుపతి నగరంలో భద్రతను పర్యవేక్షిస్తారని చెప్పారు. పోలీసులతో పాటు టీటీడీకి చెందిన 1,500 మంది విజిలెన్స్ సిబ్బంది, ఆక్టోపస్ బృందాలు కూడా నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని టీటీడీ ముఖ్య భద్రతా అధికారి మురళీకృష్ణ తెలిపారు. కేవలం సిబ్బందిని మాత్రమే కాకుండా, ఆధునిక టెక్నాలజీని కూడా భద్రత కోసం వినియోగిస్తున్నామని, తిరుమల, తిరుపతి వ్యాప్తంగా వ్యూహాత్మక ప్రాంతాల్లో మొత్తం 4,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తామని వివరించారు. గరుడ సేవ రోజున భక్తుల రద్దీ అసాధారణంగా ఉంటుందని, ఆ రోజు భద్రతా కారణాల దృష్ట్యా తిరుమల ఘాట్ రోడ్లపై ద్విచక్ర వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు.