అమెరికా బుట్టలో ఉక్రెయిన్ – అరుదైన లోహాలపై ఒప్పందం

అమెరికా బుట్టలో ఉక్రెయిన్ – అరుదైన లోహాలపై ఒప్పందం
ఇప్పటిదాకా చైనాపై ఆధారపడిన అమెరికా — వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఉక్రెయిన్‌ను ఎన్నుకుంది
వాషింగ్టన్:
అరుదైన లోహాలను తవ్వుకోవడానికి అమెరికాకు అవకాశం ఇచ్చే ఒప్పందంపై అమెరికా ఆర్థిక మంత్రి బిసెంట్, ఉక్రెయిన్ ప్రథమ ఉపప్రధాని యూలియా సిరియెంకో గత బుధవారం సంతకాలు చేశారు.
ఈ అరుదైన లోహాలు చాలా విలువైనవిగా గుర్తింపు పొందాయి. పది హెడు రకాల అరుదైన లోహాలు కలిసి అయస్కాంతం తయారవుతుంది. ఆ అయస్కాంతం విద్యుచ్ఛక్తికి చలనశీలతను ఇస్తుంది. విద్యుత్‌తో నడిచే వాహనాలు, సెల్‌ఫోన్లు, క్షిపణులు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఈ అయస్కాంతమే కీలకం.
ఇప్పటి వరకు చైనాపై ఆధారపడిన అమెరికా
ఈ అరుదైన లోహాలకోసం ఇప్పటిదాకా అమెరికా ఎక్కువగా చైనాపై ఆధారపడుతోంది. ఈ లోహాలకు ప్రత్యామ్నాయం లేదు.
50 రకాల సహజ వనరులు కీలకం
అమెరికాకు లిథియం, నికెల్ వంటి అరుదైన లోహాలతో పాటు 50 రకాల సహజ వనరులు చాలా కీలకమని అమెరికా జియాలజికల్ సర్వే పేర్కొంది. రక్షణ, హైటెక్ పరికరాలు, ఎరోస్పేస్ వంటి రంగాల్లో ఈ లోహాలు అత్యవసరం.
ఉక్రెయిన్‌లో కీలక లోహాల నిల్వలు
యూరోపియన్ యూనియన్ గుర్తించిన అత్యంత కీలకమైన 34 లోహాల్లో 22 రకాల అరుదైన లోహాల నిల్వలు ఉక్రెయిన్‌లో ఉన్నాయి.
ఉక్రెయిన్‌లో లిథియం, బెరిలియం, మాంగనీస్, గాలియం, జిర్కోనియం, గ్రాఫైట్, అపటైట్, ఫ్లోరైట్, నికెల్ లభిస్తాయని ప్రపంచ ఆర్థిక వేదిక ప్రకటించింది.
దేశంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్టు స్టేట్ జియాలజికల్ సర్వీస్ తెలిపింది. ప్రపంచంలోని గ్రాఫైట్ నిల్వల్లో 20 శాతం ఉక్రెయిన్‌లోనే ఉన్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం
ఈ లోహాలను ఉపయోగించుకున్నందుకుగాను ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి అమెరికా ఆర్థిక సహాయం చేస్తుందని అధికారులు వెల్లడించారు.