యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు

– 19లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించిన న్యాయస్థానం
– ఫెమా నిబంధనలకు విరుద్ధంగా భూమి కొనుగోలు !
– సీసీఎల్ఏ కమిషనర్, కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు కూడా..
విధాత, హైదరాబాద్
కాంగ్రెస్ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి, ఆమె భర్త రాజేందర్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫెమా నిబంధనలకు విరుద్ధంగా వాళ్లు భూములు కొనుగోలు చేసినట్టు మీద ఆమె పిటిషన్ దాఖలైంది. దీంతో ఈ నెల 19లోగా వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఝాన్సీ రెడ్డితోపాటు సీఎల్ఏ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో ఝాన్సీ రెడ్డి దంపతులు 2017లో సుమారు 75 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అయితే, ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్థలంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడంతో ఈ భూవ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో, దామోదర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. విదేశీ పౌరసత్వం కలిగిన ఝాన్సీ రెడ్డి ఇక్కడ వ్యవసాయ భూమి ఎలా కొనుగోలు చేస్తారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
తప్పుడు పత్రాలు సమర్పించి ఈ భూమిని దక్కించుకున్నారని.. నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకం కూడా జారీ చేశారని పిటిషన్‌లో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పిటిషన్‌పై మే 1వ తేదీన జస్టిస్ సీవీ భాస్కరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తాజా విచారణలో… ఝాన్సీ రెడ్డి ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో, భూమి కొనుగోలు వ్యవహారంపై జూన్ 19వ తేదీలోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆమెకు, ఆమె భర్తకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.