మీ పదేళ్ల పాలన.. మా పాలనపై చర్చకు సిద్దమా: PCC మహేష్ గౌడ్ సవాల్

విధాత: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ సీఎం కేసీఆర్ పై పీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 420 హామీలంటూ విమర్శిస్తున్న కేసీఆర్ కు దమ్ముంటే మీ పదేళ్ల బీఆర్ఎస్ పాలనపైన..మా 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపైన చర్చకు సిద్దమా అని మహేష్ కుమార్ సవాల్ విసిరారు. టైం, వేదిక మీరే డిసైడ్ చేయండి చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా? ఫాం హౌస్ దాటి వచ్చే దమ్ము కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణకు ఫస్ట్ అండ్ లాస్ట్ విలన్ కేసీఆర్ అని..కాంగ్రెస్ బిక్షతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి కేసీఆర్ కి గుండెల్లో గుబులు మొదలైందన్నారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్ చట్టంపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదన్నారు. బీఆర్ఎస్ హయంలో కేసీఆర్ కుటుంబం రైజింగ్ అయిందని జన్వాడలో ఉన్న ఫాం హౌస్ లు ఎవరివని ప్రశ్నించారు. కేసీఆర్ అరాచక పాలనను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. వరంగల్ సభ లో కేసీఆర్ ప్రసంగంలో పసలేదని ఇక తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసిందన్నారు. రజతోత్సవ సభలో జనాల కంటే విస్కీలు ఎక్కువ ఉన్నాయని అసలు ఆ సభలో అసలు మహిళలే కనిపించలేదన్నారు.
గాంధీ కుటుంబం పెట్టిన రాజకీయ భిక్షతో దొంగ పాస్ పోర్టుల బిజినెస్ చేసుకునే మీ కుటుంబం లక్షల కోట్లకు పడగలెత్తారని ధ్వజమెత్తారు. దొంగ పాస్ పోర్టుల బ్రోకర్ గాంధీ కుంటుబం గురించి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కేసిఆర్ కుటుంబం దోపిడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు. దేశ చరిత్రలో అతి తక్కువ కాలంలో ఎక్కువ దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం అన్నారు. కేసీఆర్ ప్రసంగంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని మరోసారి రుజువైందన్నారు. తెలంగాణ సెంటి మెంటును వాడుకోవడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఆడుతున్న మూడు ముక్క లాటతో వేగలేకపోతున్న కేసీఆర్ పార్టీ రజతోత్సవ సభ పేరుతో డ్రామా వేసిన ఫలితం దక్కలేదని ఎద్దేవా చేశారు.