Ys Sharmila: యోగా డే నిర్వహణలో దారుణం.. వెలుగులోకి వీడియోలు, ఫొటోలు

  • By: sr    news    Jun 21, 2025 10:46 PM IST
Ys Sharmila: యోగా డే నిర్వహణలో దారుణం.. వెలుగులోకి వీడియోలు, ఫొటోలు
  • పిల్లలను అనాథల్లా పడేసి..
  • తిండి లేదు.. సదుపాయాల్లేవు
  • మండిపడిన పీసీసీ చీఫ్‌ షర్మిల

యోగా డే నిర్వహణ కోసం ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులను రాత్రికి రాత్రి తరలించి, కనీసం వారి బాగోగులు కూడా పట్టించుకోని ఏపీ ప్రభుత్వ తీరు తీవ్ర విమర్శలపాలైంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లక్షల మందితో కార్యక్రమం ఏర్పాటు చేశామని ఏపీ ముఖ్యమంత్రి జబ్బలు చరుచుకున్నా.. దాని నిర్వహణలో ఎంత అమానుషంగా వ్యవహరించారన్నది ఈ వీడియోలను చూస్తే అర్థమవుతున్నది. సుమారు వంద కోట్లు వెచ్చించిన ఈ యోగాడేను చంద్రబాబు ప్రభుత్వం భారీ పీఆర్‌ సర్కస్‌గా మార్చేందన్న అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యోగా డే కోసం వేల మంది గిరిజన విద్యార్థులను మారుమూల ప్రాంతాల నుంచి రప్పించారు. కానీ.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను శరణార్థుల కంటే హీనంగా చూశారని విమర్శలు వినిపిస్తున్నాయి.

పిల్లలు పడుకోవడానికి కనీస సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. అందరినీ ఒక హాల్‌లోని ఫ్లోర్‌పై నిద్రపోమ్మని వదిలేశారు. పరిశుభ్రత లేదు. ఆహారం లేదు. కనీస వైద్య సదుపాయం కూడా కల్పించలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరిని తీసుకువచ్చిన అధికారులు సైతం వారి విషయంలో బాధ్యత తీసుకున్నట్టు కనిపించలేదని పలువురు అంటున్నారు. పిల్లల్లో కొందరికి ముందు రోజురాత్రి భోజనం కూడా పెట్టలేదని తెలుస్తున్నది. ఇది యోగా కాదని.. దోపిడీ అని రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి.

పరాకాష్టకు కూటమి ప్రభుత్వం పైత్యం

ఏపీలో కూటమి ప్రభుత్వం పైత్యం పరాకాష్టకు చేరిందని పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. ‘యోగాంధ్ర గిన్నిస్ రికార్డుల కోసం పసి బిడ్డలను అవస్థలు పెడతారా? తిండి తిప్పలు లేకుండా కడుపులు మార్చుతారా ? వేలమంది బిడ్డలను రూముల్లో వేసి కుక్కుతారా ? వాళ్లను పిల్లలు అనుకున్నారా.. గొర్రెలనుకున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ బిడ్డలు గిరిజన బిడ్డలనే ఈ ప్రభుత్వానికి చిన్నచూపు అని మండిపడ్డారు. మోదీ మెప్పు కోసం ఇంత దిగజారుడు తనమా? మోదీ యోగా కోసం బిడ్డల ప్రాణాలను ఫణంగా పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని పేర్కొన్నారు. గిన్నెస్‌ రికార్డు యోగాంధ్ర నిర్వహణకు కాదని, 27వేల మంది గిరిజన విద్యార్థులకు ఆకలితో మాడ్చినందుకు ఇవ్వాలని అన్నారు. హంతకులు శ్రీరంగ నీతులు చెప్తే ఎలా ఉంటుందో ఇవ్వాళ మోదీని చూస్తే అర్ధమవుతుందన్నారు.

ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాణం తీస్తూ, కార్మికుల పొట్ట కొడుతూ, మానసిక క్షోభకు గురి చేస్తూ, ఆరోగ్యం కోసం యోగా చేయాలని అదే విశాఖలో మోదీ చెప్పడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. ఆరు నెలల్లో రెండు సార్లు విశాఖలో పర్యటించిన ప్రధానికి స్టీల్‌ ప్లాంట్‌ సమస్య కనిపించదా? అని ప్రశ్నించారు. విభజన హామీలు నెరవేరక ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతున్నాయని చెప్పారు. రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో రూ.300 కోట్లు ఖర్చుపెట్టి యోగాంధ్ర చేయమని ఎవరడిగారని నిలదీశారు. చేసిన మోసాలు చాలవన్నట్లు ఏ మొహం పెటుకొని మోదీ రాష్ట్రానికి వచ్చారని అన్నారు. తిరుపతి వేదికగా హామీలు ఇచ్చి పదేళ్లయిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఏది? ఢిల్లీని తలదన్నే రాజధాని ఏది? అని ప్రశ్నించారు. అక్రమ పొత్తులు, దత్తపుత్రుల అండదండలు ఉన్నంత కాలం రాష్ట్రంలో మోడీ గారు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగిపోతుందని మండిపడ్డారు.