Monsoon Telangana | తెలంగాణలో మూడు రోజులు వానలు.. ఆ జిల్లాల్లో భారీగా!

Monsoon Telangana | ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశలో కదిలి ఉత్తర ఒడిశా దాని సమీపంలోని ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. వాయవ్య అరేబియన్ సముద్ర తీర ప్రాంతం నుంచి ద్రోణి ఒకటి దక్షిణ గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా వాయవ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 – 7.6 కి.మీ మధ్యలో ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురు, శుక్ర, శనివారాల్లో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.