Reservoirs Level | జలాశయాల్లో పెరుతున్న నీరు.. వర్షాలతో రైతన్నల్లో ఆనందం
తెలంగాణ రిజర్వాయర్లలో చేరిన నీటిని విడుదల చేస్తున్నందున వరి సాగుకు సంబంధించి వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. నిన్నటి వరకు వర్షాభావ పరిస్థితుల్లో ఆశలుసన్నగిల్లిన అన్నదాతల్లో నీటి విడుదలతో కొత్త ఆశలు చిగురించాయి.

Reservoirs Level | విధాత ప్రత్యేక ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని జలాశయాల్లో నీరు పెరుగుతోంది. కురుస్తున్న మోస్తరు నుంచి భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరుతోంది. క్రమంగా నీటి వనరులు జలకళను సంతరించుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లోని జలాపాతాలు నీటితో నిండి దూకుతున్నాయి. గోదావరి నది పరివాహాక ప్రాంతంలో వర్షాలతో నీటి మట్టం పెరిగింది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 21 అడుగులకు చేరింది. నిన్నమొన్నటి వరకు వరిసాగుకు పరిస్థితులు సానుకూలంగా ఉంటాయో? లేదో? అనే అనుమానంతో నారు పోసి నాట్ల కోసం ఎదురుచూస్తున్న రైతులు నాట్లకు సిద్ధమవుతున్నారు. దీంతో వరి సాగు విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నారు. అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వర్షాలకు తోడు, ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు, పాలేరు తదితర రిజర్వాయర్లలో చేరిన వర్షం నీటిని విడుదల చేయడంతో పాటు దేవాదుల తదితర వాటి నుంచి నీటిని పంపింగ్ ప్రారంభించడంతో దేవన్నపేటలాంటి పంప్ హౌజుల వద్ద సందడి నెలకొంది. ధర్మసాగర్, అశ్వరావుపల్లి తదితర రిజర్వాయర్లలోకి నీళ్ళు చేరాయి. రిజర్వాయర్లలో చేరిన నీటిని విడుదల చేస్తున్నందున వరి సాగుకు సంబంధించి వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. నిన్నటి వరకు వర్షాభావ పరిస్థితుల్లో ఆశలుసన్నగిల్లిన అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురించాయి.
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
గత వారం రోజులుగా రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మూడు రోజులుగా మంచి వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో సగటున 25 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా వర్షపాతం మిల్లీమీటర్లలో వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ లో 27, కొమురం భీం ఆసిఫాబాద్ లో 63.8, మంచిర్యాల 23.6, నిర్మల్ 29.1, నిజామాబాద్ 37.7, జగిత్యాల 22.8, పెద్దపల్లి 25.5, జయశంకర్ భూపాలపల్లి 46.4, భద్రాద్రి కొత్తగూడెం 35, మహబూబాబాద్ 23.4, వరంగల్ 35.4, హనుమకొండ 39.3, కరీంనగర్ 58.8, రాజన్నసిరిసిల్ల 30.1, కామారెడ్డి 29, సంగారెడ్డి 23.7, మెదక్ 24.2, సిద్దిపేట 39.8, జనగామ 14.1, యాదాద్రి భువనగిరి 5.2, మేడ్చల్ మల్కాజిగిరి 19.8, హైదరాబాద్ 21.4, రంగారెడ్డి 10.7, వికారాబాద్ 13.3, మహబూబ్ నగర్ 14.4, జోగులాంబ గద్వాల 4, వనపర్తి 7.7, నాగర్ కర్నూల్ 8.9, నల్లగొండ 4.1, సూర్యాపేట 2.5, ఖమ్మం 11.5, ములుగు 82.7, నారాయణపేట 22.5 మిల్లీమీటర్లుగా నమోదైంది.
రిజర్వాయర్లలో పెరిగిన నీరు
రాష్ట్రంలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి మట్టాలు ఫీట్లలో ఇలా ఉన్నాయి. శ్రీశైలం జలాశయంలో పూర్తి నీటిమట్టం 885 ఫీట్లు ప్రస్తుతం 837 ఫీట్ల నీరు చేరింది. నాగార్జున సాగర్ 590 కాగా 503కు చేరింది. పులిచింతల 175 కాగా 101, జైక్వాడి 1522 కాగా 1496 ఫీట్లు, సింగూరు 1717 ఫీట్లకు 1704 ఫీట్లకు, నిజాంసాగర్ 1405 ఫీట్లకు 1389 ఫీట్లకు, శ్రీరాంసాగర్ 1091 ఫీట్లకు 1069 ఫీట్లు, మిడ్ మానేరు 1043.31 ఫీట్లకు 1002 ఫీట్లు, లోయర్ మానేరులో 920 ఫీట్లకు 887.80, కడెంలో 700 ఫీట్లకు 691.33 ఫీట్లకు, శ్రీపాద ఎల్లంపల్లి 485.56 ఫీట్లకు 473.92 ఫీట్లు, వలిగొండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో 868.50 ఫీట్లకు 881.11 ఫీట్లు, సోమశిలలో 330 ఫీట్లకు 274.21 ఫీట్లు, కండలేరులో 278.89 ఫీట్లకు 202 ఫీట్లకు నీరు చేరింది.