విధాత: ప్రాణ భయంతో పరాయి రాష్ట్రంలో తలదాచుకుంటున్న చంద్రబాబు నాయుడికి చేతనైతే, ఏపికి ఉపయోగపడే నాలుగు మంచి సలహాలు ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పినా.. కుక్క తోక వంకర అన్నట్లుగానే ఆయన మాటలు, చేష్టలు ఉన్నాయని సమాచార, రవాణ శాఖ మంత్రి శ్రీ పేర్ని ఆరోపించారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అనుభవం ఉందని పదే పదే చెప్పుకునే చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. కరోనా మహమ్మారి కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా చంద్రబాబు నైజం బయటపడుతోందన్నారు.
ప్రజల్లో చెక్కుచెదరని అభిమానాన్ని నింపుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్పైన పదే పదే దుష్ప్రచారం చేయటం, కరోనా కట్టడికి ప్రభుత్వ యంత్రాంగాన్నంతటినీ సమాయత్తం చేసి, అహర్నిశలు శక్తియుక్తుల్ని ఒడ్డి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వైద్య, ఆరోగ్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
మన రాష్ట్రం గురించి, పరాయి రాష్ట్రాల్లో, దేశాల్లో లేనిపోని నిందల్ని చంద్రబాబే ఆపాదిస్తూ, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు నుంచే ఎన్ 440 కె వైరస్ వ్యాప్తి చెందిందని నీచాతినీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో వైరస్ బలహీనమైనదని, వైరస్ జన్యు పరిణామ క్రమాన్ని విశ్లేషించినప్పుడు ఎన్ 440కె రకం బయటపడిందని, అది చాలా వేగంగా అంతర్థానమైందని.. చంద్రబాబు రాజ గురువు పత్రికలోనే కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణు స్వరూప్ చెప్పినట్లు రాశారని పేర్కొన్నారు. ఏపీలో కొత్త రకం వైరస్ లేదని ఆమె స్పష్టం చేశారు. కానీ, ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఎవరో మాట్లాడుతున్నారని చంద్రబాబు అబద్ధాలను పోగేసి ఆంధ్రప్రదేశ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఈరోజు రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందికి 3 లక్షల 17 వేలకు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించాం. కోవిడ్ నియంత్రణకు ఆసుపత్రుల్లో 44,542 బెడ్లు సిద్ధంగా ఉంచాం.
ప్రభుత్వ చర్యలన్నింటి వల్ల, 0.69 శాతం మోర్టాలిటీ రేటు ఉంటే, 7.2 శాతం పాజిటీవిటీ రేటు ఉంది. 85.16 శాతం రికవరీ రేటు ఉంది.
కోవిడ్ బారిన పడి, ఆసుపత్రుల్లో చేరిన అర్హులైన ప్రతి ఒక్కరికీ రెమెడ్ సివర్ ఇంజక్షన్లు కొరత లేకుండా అందుతున్నాయి. అలానే ఆక్సీజన్ కు ఇబ్బంది రాకుండా ఒరిస్సా నుంచి ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా, సింగపూర్ నుంచి తెప్పిస్తున్నాం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం. ప్రతిరోజూ ఉదయం మూడు గంటలపాటు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై సీఎం జగన్సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇన్ని చేస్తుంటే.. ఏమీ చేయలేదని మాట్లాడటానికి చంద్రబాబుకు నోరు ఎలా వస్తుందని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.