జీఎస్టీ పోస్టర్లపై మోదీ ఫొటో

అన్ని ఆటోమొబైల్‌ కంపెనీలు జీఎస్టీ రేట్లలో మార్పుల పట్టికను ప్రధాని మోదీ ఫొటోతో సహా ప్రదర్శిచడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేరళ పీసీసీ చురకలు వేసింది. ఈ మేరకు బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రికలో వచ్చిన ఒక కథనానం క్లిప్పింగ్‌ను తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది.

జీఎస్టీ పోస్టర్లపై మోదీ ఫొటో
  • ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి కేంద్రం ఆదేశం
  • పాత, కొత్త రేట్లు సూచించేలా పట్టిక
  • మోదీ ఫొటో ఎడమవైపు పెట్టండి
  • కార్ల కంపెనీలకు కాంగ్రెస్‌ సూచన
  • పాత అధిక జీఎస్టీకి మోదీ బాధ్యుడు

కేపీసీసీ వ్యాంగ్యాత్మక ట్వీట్‌

ముంబై : అన్ని ఆటోమొబైల్‌ కంపెనీలు జీఎస్టీ రేట్లలో మార్పుల పట్టికను ప్రధాని మోదీ ఫొటోతో సహా ప్రదర్శిచడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేరళ పీసీసీ చురకలు వేసింది. ఈ మేరకు బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రికలో వచ్చిన ఒక కథనానం క్లిప్పింగ్‌ను తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. ‘కార్ల కంపెనీలు తన ఫొటోతో పాటు పాత, కొత్త జీఎస్టీ రేట్ల పట్టికను ప్రదర్శించడాన్ని మోదీ తప్పనిసరి చేశారు. అన్ని కంపెనీలను మేం కోరుతున్నదేంటంటే.. మోదీ ఫొటోను ఎడమవైపు ఉంచండి. ఎందుకంటే.. పాత, అత్యధిక జీఎస్టీకి మోదీయే బాధ్యుడు. పాదరక్షల కంపెనీలు, లోదుస్తుల కంపెనీలు కూడా తదుపరి ఆదేశాలు వచ్చేలోపు తమ ఉత్పత్తులపై మోదీ ఫొటోను పెట్టేందుకు ప్రణాళికల్లో ఉన్నాయి’ అని ఆ క్లిప్పింగ్‌ కింద రాసింది.

ఎస్‌ఐఎఎం ద్వారా కేంద్రం ఆదేశాలు
జీఎస్టీ రేట్ల పోస్టర్లలో ప్రధాని ఫొటోను ఉంచాలని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (ఎస్‌ఐఏఎం) ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయించింది. ఈ మేరకు తాము పోస్టర్లను డిజైన్‌ చేయించి, భారీ పరిశ్రమల శాఖ ఆమోదానికి పంపుతున్నామని ఆటోమొబైల్‌ కంపెనీల ప్రతినిధులు ధృవీకరించారని బిజినెస్‌ స్టాండర్డ్‌ తెలిపింది.

ఇలా ముందెన్నడూ లేదు!
గతంలో ఇలాంటి సంప్రదాయం ఏమీ లేదని ఒక కంపెనీ ప్రతినిధి అన్నారు. ఇప్పుడు ఇంగ్లిష్‌లో సిద్ధం చేసే ప్రధాన పోస్టర్‌కు మాత్రమే అనుమతి పొందాలా? లేక ఇతర ప్రాంతీయ భాషల్లో తయారు చేసే పోస్టర్లకూ తీసుకోవాలా? అనేది వేచి చూడాల్సిందేనని ఆయన చెప్పారు.
ఈ పోస్టర్ల తయారీకి గాను ఇండస్ట్రీ రంగానికి సుమారు రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని ఇండస్ట్రీ వర్గాలను ఉటంకిస్తూ బిజినెస్‌ స్టాండర్డ్‌ పేర్కొన్నది. ఈ వారాంతానికల్లా పోస్టర్లు సిద్ధం అవుతాయని భావిస్తున్నారు. అయితే.. లగ్జరీ కార్ల కంపెనీలను మాత్రం ఈ పోస్టర్ల నుంచి మినహాయించారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో ఆ పూర్తి లాభాన్ని కస్టమర్లకే అందిస్తామని ఇప్పటికే మారుతి సుజికి, హ్యుందాయ్‌, మహింద్రా అండ్‌ మహింద్రా, టాటా మోటర్స్‌, టయోటా, కియా వంటి కంపెనీలు ధృవీకరించాయి.
ఇటీవల జీఎస్టీ కౌన్సిల్‌.. నాలుగు మీటర్ల లోపు ఉండే (పెట్రోల్‌ కార్లయితే 1200 సీసీ, డీజిల్‌ కార్లయితే 1500 సీసీ) జీఎస్టీని 29–31 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. అంతకు మించిన పెద్ద కార్లపై (నాలుగు మీటర్ల కంటే పొడవు, 1500 సీసీ మించిన ఇంజిన్‌, 170 మిల్లీ మీటర్ల గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉండే) 50 శాతం నుంచి 40 శాతానికి జీఎస్టీ తగ్గించింది. కాంపెన్సేషన్‌ సెస్‌ను పూర్తిగా తొలగించింది.