తెలంగాణ రాహు కేతువులు రేవంత్, కేసీఆర్ లు: బండి సంజయ్

రేవంత్ రెడ్డి, కేసీఆర్ తెలంగాణకు రాహు కేతువులని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ కోరారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణకు పట్టిన రాహువు, కేతువులు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లు అని, ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను చంపుకుతింటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్ లోని రేకుర్తి చెరువు సుందరీకరణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు.అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ కాళేశ్వరంసహా కేసీఆర్ కుటుంబం చేసిన అవినితిని కప్పిపుచ్చేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని గత ఎన్నికల్లో చెప్పిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రూ.9 వేల కోట్లకే పరిమితమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాయడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ అవినీతి బయటపడాలంటే రూ.లక్ష కోట్ల కాళేశ్వరం నిర్మాణంపై విచారణ జరపాల్సి ఉందన్నారు.రేవంత్ కు దమ్ముంటే లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం అవినీతిపై విచారణ కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని సవాల్ విసిరారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి వ్యవహారంపై కాళేశ్వరం విషయంలో వీళ్లు ఆడుతున్న డ్రామాలపై తెలంగాణ ప్రజలకు త్వరలోనే లేఖ రాస్తాం అని తెలిపారు.

పరస్పరం చావులు కోరుకుంటూ..ప్రజలను చంపుతున్నారు..

ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. నువ్వు చావాలని ఒకరు, నేను చావాలని కోరుకుంటావా? అని ఇంకొకరు చావుల గురించి మాట్లాడుకుంటున్నారు. నిజానికి తెలంగాణకు పట్టిన శని కేసీఆర్, రేవంత్ రెడ్డి. వీళ్లిద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను చంపుకుతింటున్నారని బండి సంజయ్ విమర్శించారు.

జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ఇష్టం లేక అలిగి హరీశ్ రావు ఢిల్లీ పోయారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు కోసం పోయారని అంటున్నారని అన్నీ అబద్దాలేనని సంజయ్ కొట్టిపారేశారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ దే. భవిష్యత్తులో జరిగేది కూడా అదేనని, బీజేపీ ఎన్నడూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలొస్తే బీజేపీ గెలుస్తదని, తన సీటు ఖాళీ అవుతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి ఏకంగా రాహుల్ గాంధీ సీటుకు ఎసరు పెట్టాడని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాల్లేవని జీవన్ రెడ్డి అన్నంత మాత్రాన నిజం కాబోదు. ఆ మాటకొస్తే నిజామాబాద్ లో ఎవరు గెలిచారు. తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలుచుకుందని సంజయ్ గుర్తు చేశారు.

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్, బీఆర్ఎస్ వక్రీకరించాయని, ఆనాడు సోనియాగాంధీని బలిదేవత అని రేవంత్ రెడ్డే చెప్పారు కదా అని, అట్లాంటి వ్యక్తి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న వాళ్లు బీజేపీని విమర్శించడం హాస్యాస్పదం అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి :

చంద్రబాబుకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ
 “మొదటి సంతకంతోనే హైడ్రాను పీకి పడేస్తాం”.. జగిత్యాలలో కేసీఆర్ గర్జన

Latest News