ఫ్యాక్షన్ మైండ్ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పాలన ఇలాగే ఉంటుందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ వారిపై అక్రమ కేసులు పెట్టడం రాజకీయాల్లో ఎప్పుడూ లేదన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కొత్త సంస్కృతి తీసుకువచ్చారని విమర్శించారు. ప్రజా సంక్షేమం గాలికి వదిలేసి.. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి పేరుతో రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని కొల్లు రవీంద్ర తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి జగన్ వారిపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఇంకా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ‘‘మాజీ మంత్రి దేవినేని ఉమా ఏం తప్పు చేశారు? తిరుపతిలో ఎవరు ఉంటారని జగన్ అనలేదా? తిరుపతి ఉప ఎన్నికల్లో మీరు ఎలా గెలిచారో అందరికి తెలుసు. ఒక ట్యాబ్‌లో ఉన్న వీడియో నిజమైందో కాదో తెలుసుకోవడానికి ఇన్ని రోజులా? ధూళిపాళ్ల నరేంద్రను కూడా అక్రమ కేసు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పుడు దేవినేని ఉమను సైతం విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు.
బలహీన వర్గాలైన నన్ను, అచ్చెన్నాయుడును కూడా అక్రమ కేసులతో జైలుకు పంపారు. సీఐడీ అధికారులు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవినేని ఉమను వేధించడం మీద పెట్టిన శ్రద్ధ వివేకానంద రెడ్డి హత్య కేసుపై పెట్టడం లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులను ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదు? రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అధికారులు ఆ సంగతి గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తే తరువాత తగిన మూల్యం చెల్లించుకుంటారు. దేవినేని ఉమను వేధించడం మానుకోవాలి’’ అని పేర్కొన్నారు.