మెజార్టీలో కొత్త రికార్డులు నమోదు చేసిన లోక్‌సభ ఎన్నికలు
2024 సార్వత్రిక ఎన్నికలు దేశ లోక్‌సభ ఎన్నికల చరిత్రలో మెజార్టీ విజయాల నమోదులో కొత్త రికార్డు సృష్టించాయి.

ఇండోర్‌లో బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వాణీ 11లక్షల 75వేల 092 ఓట్ల రికార్డు మెజార్టీ
నల్లగొండలో రఘువీర్‌రెడ్డి 5లక్షల 59వేల 906 ఓట్లతో భారీ విజయం
తెలుగు వారిలో పీవీ తర్వాత రెండో అత్యధిక మెజార్టీ
తెలంగాణలో అత్యధిక మెజార్టీ
విధాత: 2024 సార్వత్రిక ఎన్నికలు దేశ లోక్‌సభ ఎన్నికల చరిత్రలో మెజార్టీ విజయాల నమోదులో కొత్త రికార్డు సృష్టించాయి. ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండోర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వాణీ 11 లక్షల 75వేల 092 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. లాల్వాణీ తర్వాత రెండో స్థానంలో నోటాకు 2లక్షల 18వేల 674ఓట్లు పోలవ్వడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇదే లోక్‌సభ ఎన్నికల్లో మరో ఆరుగురు అభ్యర్థులు 5నుంచి 7లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచినట్లుగా సమాచారం. అందులో నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఆయన 5లక్షల 59,906ఓట్లతో గెలుపొందారు.
కాగా 1952నుంచి మొదలుకుని దేశ లోక్‌సభ ఎన్నికల చరిత్రలో లల్వాణీ సాధించినదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. అంతకుముందు వరకు అత్యధిక మెజార్టీ రికార్డు మహారాష్ట్రకు చెందిన ప్రీతమ్ ముండే పేరిట ఉంది. తన తండ్రి దివంగత కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మహారాష్ట్రలోని బీడ్ లోక్‌సభ స్థానానికి 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కూతురు ప్రీతం ముండే ఈ ఎన్నికల్లో 6,96,321 ఓట్ల ఆధిక్యతతో గెలిచి లోక్‌సభ ఎన్నికల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఆమె సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంకర్ రావు పాటిల్ 2,24,678 ఓట్లు మాత్రమే పొందారు.
2004లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ అరమ్‌బాగ్ లోక్ సభ సీటు నుంచి సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ బసు 5లక్షల 92,502 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రాజీవ్‌గాంధీ హత్యానంతరం కాంగ్రెస్ మైనార్టీ ప్రభుత్వానికి ప్రధానిగా ఎంపికైన పీవీ నరసింహరావు లోక్‌సభకు ఎన్నిక కావాల్సివున్న నేపథ్యంలో 1991లో నంద్యాల లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి 5లక్షల 80వేల 297ఓట్లతో సమీప బీజేపీ ప్రత్యర్థి బంగారు లక్ష్మణ్‌పై గెలుపొందారు. పీవీ కోసం నంద్యాల ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి గెలిచిన కొన్ని రోజులకే తన పదవిని త్యాగం చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా వడదోరా నుంచి పోటీ చేసిన నరేంద్రమోదీ 5లక్షల 70వేల 128ఓట్లతో గెలుపొందారు. అనంతరం తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణలో అతి పెద్ద మెజార్టీ రఘువీర్‌రెడ్డిదే
నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి 2024లోక్‌సభ ఎన్నికల్లో 5లక్షల 59వేల 906 ఓట్లతో విజయం సాధించడం ద్వారా ఈ ఎన్నికల్లో ఐదు లక్షలకు పైగా మెజార్టీ సాధించిన ఆరుగురు అభ్యర్థుల్లో ఒకరుగా నిలిచారు. కుందూరుకు 7లక్షల 84వేల 337 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 2లక్షల 24వేల 431ఓట్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల వారిగా చూస్తే పీవీ నరసింహరావు తర్వాతా అత్యధిక మెజార్టీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన కుందూరు రఘువీర్‌రెడ్డిదే కావడం విశేషం.
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్‌రెడ్డి 2011లో కడప పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో 5,45,672 ఓట్ల ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డి మీద గెలుపొందారు. 1989ఎన్నికల్లో రాంవిలాస్ పాశ్వాన్ ఉత్తరప్రదేశ్‌లోని హజీపూర్ నుంచి జనతా దళ్ అభ్యర్థిగా పోటీ చేసి 5లక్షల 4వేల 448ఓట్లతో మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రంకు సంబంధించి నిన్నటిదాక అత్యధిక మెజార్టీ విజేతగా పసునూరి దయాకర్ ఉన్నారు. 2015లో వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4లక్షల 59వేల 88ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
దయాకర్ రికార్డును చెరిపివేసిన రఘువీర్‌రెడ్డి తెలంగాణ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీగా సరికొత్త రికార్డు సాధించారు. అటు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కూడా రఘువీర్‌రెడ్డినే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీగా నిలిచారు. అంతకుముందు 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి నుంచి రావి నారాయణరెడ్డి 2లక్షల 22,280ఓట్లతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో దేశ ప్రధాని నెహ్రు 1,73,929ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, రావి నెహ్రు కంటే అధిక మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. ఆ రికార్డును కూడా రఘువీర్‌రెడ్డి బద్దలు కొట్టారు.