ఏ విడుతలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎన్డీయేకు, ప్రత్యేకించి బీజేపీకి మింగుడుపడేవి కావు.

ప్రతి దశలోనూ సీట్లు కోల్పోయిన బీజేపీ
మైనస్ 0.77 శాతం ఓట్ల తేడా 63 సీట్లు గాయబ్
న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎన్డీయేకు, ప్రత్యేకించి బీజేపీకి మింగుడుపడేవి కావు. 2014లో 282, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. చాలా తక్కువ మంది అంచనా వేసిన విధంగా 240 సీట్లకు పడిపోయింది. మరోవైపు 2014లో 44 సీట్లకు పరిమితమై, 2019లో 52 సీట్లకు మాత్రమే పెరిగిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో తన సత్తా చాటి.. 99 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షం సమాజ్‌వాది పార్టీ గత ఎన్నికల్లో ఐదు సీట్ల నుంచి ఇప్పుడు ఏకంగా 37 స్థానాలకు తన బలాన్ని పెంచుకున్నది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీడీపీ 16 సీట్లు గెలుచుకున్నది. ఇదే పార్టీకి 2014లో కూడా ఇదే సంఖ్యలో సీట్లు వచ్చాయి.
కానీ.. 2019లో మూడింటికి పరిమితమైంది. మొత్తంగా బీజేపీ 63 సీట్లను చేజార్చుకున్నది. అంటే గతంలో పోల్చితే 21 శాతం సీట్లు కోల్పోయింది. ఇది కూడా కేవలం -0.77 శాతం తేడాతో కావడం గమనార్హం. కాంగ్రెస్ 1.72 శాతం ఓట్లు పెంచుకుని.. 90శాతం పురోగతితో 47 సీట్లను అదనంగా పొందింది. ఏపీలో అత్యధిక స్థానాలు గెలుచుకుని, ఒడిశాలో ఐదు పర్యాయాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్‌ను ఓడించింది. కానీ.. పశ్చిమబెంగాల్‌లో పుంజుకోలేక పోయింది. అటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో భారీగా ఎదురుదెబ్బలు తిన్నది. తమిళనాడులో బీజేపీకి ఒక్క స్థానం కూడా లభించలేదు. అటు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే.
మొత్తంగా ఏ దశలో ఏ పార్టీ గెలిచిందో చూస్తే..
తొలి దశ.
తొలి దశలో 102 సీట్లకు పోలింగ్ నిర్వహించగా.. బీజేపీ 30 సీట్లు గెలుచుకున్నది. ఇదే తొలి దశలో బీజేపీ 40 సీట్లు గెలుచుకున్నది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో 15 సీట్లు గెలిస్తే.. ఈసారి 27 సీట్లకు పెరిగింది.
రెండో దశ
రెండో దశలో బీజేపీ గత ఎన్నికల్లో 52 సీట్లు గెల్చుకోగా, 2024 ఎన్నికల్లో 47కు పరిమితమైంది. కాంగ్రెస్‌కు గతంలో 18 సీట్లు ఉండగా.. ఇప్పుడు అవి 23కు పెరిగాయి.
మూడో దశ
మూడో దశలో బీజేపీ గణనీయంగా దెబ్బతిన్నది. ఈ దశలో గతంలో 72 సీట్లు గెలిచిన బీజేపీ.. ఈసారి 58 సీట్లకు పరిమితమైంది. మరోవైపు కాంగ్రెస్ తన సంఖ్యాబలాన్ని నాలుగు నుంచి 15కు పెంచుకోగా, కాంగ్రెస్ మిత్రపక్షం సమాజ్‌వాది పార్టీ 2 సీట్ల నుంచి ఆరు సీట్లకు పెరిగింది.
నాలుగో దశ
నాలుగో దశ ఎన్నికల్లో గతంలో 42 సీట్లు ఉన్న బీజేపీ.. 2024 ఎన్నికల్లో 39 సీట్లకు తగ్గింది. కాంగ్రెస్ గతంలో ఆరు సీట్లు ఉంటే.. ఈసారి 14 సీట్లలో గెలుపొందింది.
ఐదో దశ ..
ఐదో దశలోనూ బీజేపీకి భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. 2019లో ఆ పార్టీ ఈ దశలో 32 సీట్లు గెలిస్తే.. ఇప్పుడు 18 సీట్లకు తగ్గిపోయింది. కాంగ్రెస్ ఒక్క స్థానం నుంచి నాలుగు సీట్లకు పెరిగింది. సమాజ్‌వాది పార్టీకి గతంలో ఈ దశలో ఒక్క సీటు కూడా లభించని పరిస్థితిలో ఇప్పుడు ఏకంగా ఏడు సీట్లలో జయకేతనం ఎగురవేసింది.
ఆరో దశ..
2019లో ఆరో దశ పోలింగ్‌లో 40 సీట్లలో విజయం సాధించిన బీజేపీ.. 2024కు వచ్చేసరికి 31 సీట్లకు తగ్గిపోయింది. మరోవైపు ఒక్క సీటు కూడా లేని కాంగ్రెస్ ఆరు సీట్లో గెలిచింది. సమాజ్‌వాది పార్టీ ఒక సీటు నుంచి పది సీట్లకు పెరిగింది.
ఏడో దశ
ఈ దశలో కూడా బీజేపీ గణనీయంగా ఎదురుదెబ్బలు తిన్నది. 2019లో ఆ పార్టీకి 25 సీట్లు ఉంటే.. ఇప్పుడు 17కు పడిపోయాయి. కాంగ్రెస్‌కు గతంలో ఈ దశలో 8 సీట్లు ఉంటే.. ఈసారి అదనంగా ఒకటి గెలిచింది. సమాజ్‌వాది పార్టీకి గతంలో ఈ దశలో ఒక్క సీటు కూడా లేదు. కానీ.. ఈసారి ఏకంగా ఆరు సీట్లలో విజయం సాధించింది.