Allu Arjun | అల్లు అర్జున్‌పై ఏపీ పోలీసుల కేసు

పుష్పా రాజ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు నంద్యాల పోలీసులు షాకివ్వగా, ఆ జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డికి సీఈసీ షాక్ ఇచ్చారు.

Allu Arjun | అల్లు అర్జున్‌పై ఏపీ పోలీసుల కేసు

నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు సీఈసీ ఆదేశాలు

విధాత హైదరాబాద్‌: పుష్పా రాజ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు నంద్యాల పోలీసులు షాకివ్వగా, ఆ జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డికి సీఈసీ షాక్ ఇచ్చారు. ఎలాంటి అనుమతి లేకుండా జనసమీకరణ చేశారని అల్లు అర్జున్‌తో పాటు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్ప రవిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్‌ అనుమతి లేకుండానే జనసమీకరణ చేశారని నంద్యాల పోలీసులకు స్థానిక ఆర్వో ఫిర్యాదు చేశారు. దీంతో బన్నీపై ఐపీసీ 188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన స్నేహితుడు శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డితో నంద్యాలకు వచ్చారు.

ఈ సందర్భంగా బన్నీ దంపతులకు శిల్పా రవి, అభిమానులు ఘనంగా స్వాగతించారు. వేలాది మంది అభిమానులతో వాహనాలతో భారీ ర్యాలీగా అల్లు అర్జున్‌ శిల్పా రవి ఇంటికి వెళ్లారు. అనుమతి లేకుండా జన సమీకరణ చేసినందునా అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లుగా నంద్యాల పోలీసులు ప్రకటించారు. మరోవైపు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసిన అల్లు అర్జున్‌, అటు మామయ్య జనసేన అధ్యక్షుడు, పిఠాపురం అభ్యర్థి పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా ట్వీట్ ప్రచారానికే పరిమితమవ్వడం చర్చనీయాంశమైంది. తన బాబాయ్ పవన్ కోసం రాంచరణ్ మాత్రం పిఠాపురంలో స్వయంగా ప్రచారం నిర్వహించారు.

ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు ఈసీ ఆదేశాలు

నంద్యాలలో 144సెక్షన్ అమలులో ఉన్న అనుమతి లేకుండా అల్లు అర్జున్ కార్యక్రమంలో జన సమీకరణ చేయడంపై సీఈసీ సీరియస్ అయ్యింది. జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు సీఈసీ ఆదేశాలిచ్చింది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుగా అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం కాస్తా ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు కారణమైంది.