సీఎం రేవంత్ రెడ్డిపై కవిత ఆగ్రహం

ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గింపుపై సీఎం రేవంత్ రెడ్డిని కవిత తీవ్రంగా విమర్శించారు. విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత మరోసారి ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను 27 వేల నుండి 4 వేలకు కుదిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతూ కవిత మండిపడ్డారు. ప్రతి చిన్న ఊరిలో కూడా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ఉండటంతో పేదలు, బలహీన వర్గాలు, ఆడ పిల్లలు చదువుకోగలుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ బడులను మూసివేస్తే ముఖ్యంగా ఆడపిల్లల చదువులపై ఎఫెక్ట్ పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి నేను హిట్లర్ అంటూ చెప్పుకుంటున్నారని, ఆయన నిజంగా హిట్లరే అని, అంతేకాదు తాలిబన్ కూడా అని కవిత విమర్శించారు. ఎందుకంటే తాలిబన్లు ఆడపిల్లల చదువును వ్యతిరేకించారని, అందుకే సీఎం రేవంత్ రెడ్డిని తాలిబన్ అంటున్నానని కవిత తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను 27 వేల నుండి 4 వేలకు కుదించిన పక్షంలో వాటిటో పనిచేస్తున్న 3లక్షల పైచిలుకు ఉపాధ్యాయులను ఏం చేస్తారో సీఎం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.

విద్యాశాఖ సీఎం వద్ద ఉందంటే అంతా విద్యారంగం బాగుపడుతుందనుకున్నారని, కాని రేవంత్ రెడ్డికి ఆ శాఖపై పట్టులేక సర్కస్ మాదిరిగా విద్యాశాఖను నడుపుతున్నారని కవిత విమర్శించారు. గురుకులాల సమస్యలు పట్టించుకోవడం లేదని, గురుకుల ఉపాధ్యాయులకు సమ్మె కాలం జీతాలు ఇవ్వలేదని, ఇంటర్మీడియట్ బోర్డు విలీనం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట మార్చారని, డిగ్రీ సిలబస్ పై గందరగోళం నెలకొందని, యూనివర్సిటీల పాలక మండలుల మీటింగ్ లు జరుగక సిలబస్ ఫైనల్ కాలేదని దీంతో విద్యాశాఖ సర్కస్ మాదిరిగా నడుస్తుందన్నారు.

విద్యార్ధులకు రూ.11వేల ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిపుల బకాయిలతో విద్యార్ధులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని, ఈ వ్యవహరంలో జీవో 7 రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాసంస్థలు పున ప్రారంభం కానుండగా..ఇప్పటిదాక ఫీజుల నియంత్రణ చట్టంపై చర్యలు ప్రకటించలేదన్నారు. ఆయా సమస్యల పరిష్కరించకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, దీంతో భవిష్యత్తు తెలంగాణ తరం తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు.

Latest News