హైదరాబాద్ నగరంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతాం అని ఛాలెంజ్ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆ మాట నిలబెట్టుకునే దమ్ముందా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సవాళ్లు చేయడం, ఆపై పారిపోవడం నీతిలేని కాంగ్రెస్ నేతలకు అలవాటేనని, శపథాలు కాదు.. చేతనైతే చేసి చూపించండని సవాల్ విసిరారు. దమ్ముంటే మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తామని ప్రతిన బూనాలని సవాల్ చేశారు.
ఆత్మగౌరవ గృహాలు కట్టిన పార్టీ మాది
ఆత్మగౌరవ గృహాలు కట్టిన ఆత్మగౌరవ పార్టీ తమదని కేటీఆర్ ఉద్ఘాటించారు. స్వరాష్ట్రాన్ని సాధించామని, పేదల స్వగృహ స్వప్నాలను సాకారం చేశామన్నారు. డబ్బా ఇండ్లు కాకుండా, డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించామన్నారు. హైదరాబాద్ మహా నగరంలో ఏకంగా లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించిన ఘనత తమదేనని గుర్తుచేశారు. తాము 70 వేలతో అగ్గిపెట్టె ఇండ్లు కట్టలేదని, తాము కట్టిన ఒక్కో గృహం 7 ఇందిరమ్మ ఇండ్లతో సమానమన్నారు. చరిత్రలో ఎవరూ ఎప్పుడూ చేయని సాహసంతో, 60 ఏండ్లు ఏలిన పార్టీలకు ఎన్నడూ రాని ఆలోచనతో దేశానికి నమూనాగా అందమైన పొదరిల్లను నిర్మించి చూపించామని తెలిపారు. మీకు చిత్తశుద్ధి, సత్తా ఉంటే అంతకు మించి హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం గృహాలను కట్టాలని సవాల్ చేశారు.
తాము కట్టిన ఒక్కో గృహం 7 ఇందిరమ్మ ఇండ్లతో సమానమని, మీకు చిత్తశుద్ధి, సత్తా ఉంటే అంతకు మించి హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం గృహాలను కట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
ఇండ్లు కట్టింది మేం.. కూలగొడుతున్నది మీరు!
గత రెండున్నర ఏండ్లలో నగరంలో కట్టిన ఇండ్లు ఎన్ని? పడగొట్టిన ఇండ్లు ఎన్ని? అనే దానిపై శ్వేత పత్రం ప్రకటించే ధైర్యం ఉందా? అని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేం ఇండ్లు కట్టిస్తే..మీరు కూలుస్తున్నారంటూ విమర్శించారు. దీపావళికి బాంబులు పేలుస్తామని చెప్పి తుస్సు మనిపించిన ‘తుపేల్ మినిస్టర్’, ‘మిస్టర్ బాంబులేటి’ పొంగులేటి అని ఎద్దేవా చేశారు. పొంగులేటి మాదిరి కోహినూరు హోటల్లో కాళ్లు పట్టుకొని, ఢిల్లీకి లొంగిపోయి కేసుల నుంచి తప్పించుకునే ఉపాయం తమకు తెలియదన్నారు.
రెవిన్యూ శాఖను అడ్డుపెట్టుకొని భూభారతిలో బ్లాక్ లిస్టులు, బ్లాక్ మెయిల్ దందాలు చేసి దండుకునే ల్యాండ్ గేమ్స్, గూండాలను ఉసిగొల్పి సామాన్యులపై దౌర్జన్యాలు చేసి భూములను బుక్క పట్టడం తమకు తెలియవన్న కేటీఆర్ విమర్శిచారు. అడ్డదారుల్లో కొడుకు కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు ఇప్పించుకునే అవినీతి కిటుకులు, అక్రమ క్రషర్లు నడుపుతూ అడ్డగోలుగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టే చిట్కాలు తమకు తెలియవు అన్నారు. బడుగు బలహీన వర్గాల నేతల మీద అహంకారంతో పేపర్లు విసిరికొట్టడం కూడా తమకు తెలియదన్నారు.
ప్రశ్నించకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు
ప్రభుత్వం ఎన్ని పనికిమాలిన ప్రగల్భాలు పలికినా, ఎన్ని డైవర్షన్ డ్రామాలు ఆడినా.. 420 హామీల ఎన్నికల మోసాన్ని ఎండగట్టకుండా వదిలిపెట్టబోమని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్ల ఎగవేత ద్రోహాన్ని ప్రశ్నించకుండా విడిచిపెట్టబోమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
