KTR Fires at CM Revanth | ఇందిరమ్మ రాజ్యంలో “బిందె” సేద్యమా? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు

  • By: ysk |    politics |    Published on : Jul 14, 2025 7:42 PM IST
KTR Fires at CM Revanth | ఇందిరమ్మ రాజ్యంలో “బిందె” సేద్యమా? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు

KTR Fires at CM Revanth | మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని అడుగు బయటపెట్టొద్దని కేసీఆర్ సంకల్పిస్తే.. చివరికి మహిళలు బిందెలతో నీరు తెచ్చుకుని.. వరి నారు కాపాడుకునే పరిస్థితి కల్పిస్తావా ? అంటూ బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్(‘X’) లో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై(CM.Revanth reddy) తీవ్ర స్థాయిలో కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు. ఇప్పటికే తాగునీటి కోసం తండ్లాడుతున్న అక్కాచెల్లెళ్లకు ఈ కొత్త కష్టాలేంటి ? అని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా(Jagityala District) గొల్లపల్లిలో(Gollapalli)ని రంగధామునిపల్లిలో ట్రాన్స్ ఫార్మర్ చెడిపోయి 15 రోజులైనా మరమ్మత్తు చేయించే తీరిక లేదా అని ప్రశ్నించారు.

ఏడాదిన్నరగా మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు మరమ్మత్తు చేయడం మీకు చేతకావడం లేదని.. చివరికి ట్రాన్స్ ఫార్మర్లు కూడా రిపేర్ చేయించే సత్తా లేదా అని నిలదీశారు. సాగునీటి వసతి కల్పించకుండా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తాశాడని ఆరోపించారు. కనీసం కరెంట్ మోటర్లతో పంట కాపాడుకుందామంటే కూడా ఇన్ని కష్టాలా అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో పెరిగిన భూగర్భజలాలను వాడుకునే అవకాశం లేకుండా చేయడం దుర్మార్గం అని ద్వజమెత్తారు. కళ్ల ముందే వరినారు ఎండిపోతుంటే తట్టుకోలేక.. బిందెలతో ఆడబిడ్డలు పడుతున్న అగచాట్లు ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం దేవుడెరుగునని.. తాగునీటితో పాటు సాగునీటికి కూడా బిందెలు మోస్తున్న ఈ ఆడబిడ్డల బాధలు తీర్చే సోయి ముఖ్యమంత్రికి ఎప్పుడొస్తుందోనని తీవ్ర స్థాయిలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు.