రైతు బంధు లేదు…రాహుల్ బంధు కొనసాగుతుంది : కేటీఆర్

రైతు బంధు ఇవ్వకుండా రాహుల్ బంధు కొనసాగుతోందని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శించారు. రైతులు, విద్యార్థులు, ప్రజలు మోసపోయారని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇవ్వడం లేదని..రాహుల్ బంధు మాత్రం జోరుగా కొనసాగిస్తున్నాడని, భారీగా ఢిల్లీకి మూటలు పంపిస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్బంగా కేటీఆర్ మాట్లాడారు. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో మోసపోయిన ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాల వలన అన్యాయానికి గురవుతున్న వర్గాలు ప్రభుత్వాన్ని నిందిస్తుంటే తనకు సంతోషం కలుగుతుందంటూ రేవంత్ రెడ్డి సంబరపడుతున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన ప్రభుత్వానికి సమస్యలు తెలియజేస్తుంటే రేవంత్ రెడ్డి తనకు పైశాచిక ఆనందం వస్తుందని ప్రతిపక్షాల గురించి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు 140 మంది చనిపోయినా రేవంత్ రెడ్డికి సిగ్గు అనిపించడం లేదన్నారు.

రేవంత్ పాలనలో గోస పడుతున్న రైతులు

కనీసం కోతలు లేకుండా కరెంట్ ఇవ్వలేకపోతున్నందుకు, రైతుబంధు రైతుల ఖాతాల్లో వేయలేకపోతున్నందుకు సిగ్గు అనిపిస్తుందా లేదా? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. రైతుల ధాన్యం రోడ్ల మీద తడిసి రైతులు ఏడుస్తుంటే కనీసం బాధ కూడా అనిపిస్తుందా లేదా? అని కేటీఆర్ విమర్శించారు. ప్రతిసారి “నేను మారిన మనిషిని” అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి యథావిధిగా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారన్నారు.రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకుండా వారి భవిష్యత్తును గందరగోళంలోకి నెడుతున్నారన్నారు. మూడు లక్షల 80 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుని ఒక్క రూపాయి పనీ చేయలేదన్నారు. అడ్డగోలుగా అప్పులు తెచ్చి రైతుబంధు వంటి పథకాలను పక్కనపెట్టి ‘రాహుల్ బంధు’ను మాత్రం జోరుగా నడిపిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

మార్పు పేరుతో డైలాగ్ లు కాదు…మార్పు తెచ్చే దమ్ము ఉండాలి

మార్పు మార్పు అని డైలాగులు కొట్టుడు కాదు అని రేవంత్ పై సెటైర్లు వేశారు మార్పు తెచ్చే దమ్ము కూడా ఉండాలని..ఆ దమ్మున్నోడు కేసీఆర్ అని, దళిత బంధు, రైతుబంధు లాంటి పథకాలను పెట్టాలంటే..నాయకుడికి ఖలేజా ఉండాలి, గుండెలో ధైర్యం ఉండాలని, చరిత్రలో ఒక మార్పు తేవాలనే దమ్ము ఉండాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు దాన వీర శూర కర్ణ.. ఇప్పుడేమో కుంభకర్ణ అని, ప్రజల తరఫున మేము తిడుతుంటే, విమర్శ చేస్తుంటే.. రేవంత్ రెడ్డికి పైశాచికానందం వస్తుందంట.. ఆయనను ఏమనాలి? అని కేటీఆర్ దుయ్యబట్టారు. ప్రజలు తిడితే పైశాచికానందమా.. సీఎం సిగ్గుపడాలని అన్నారు.

30 నెలలైనా హామీలు అమలు చేయకపోతే ఏమనాలి?

రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడు నెలల్లో అమలు చేస్తానని చెప్పి, 30 నెలల తర్వాత కూడా అవి అమలు చేయకుండా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. మూడు నెలలు కాదు, 30 నెలలైనా పథకాలు అమలు కాలేదంటే ఆ పథకాలను గాని, ఆ వ్యక్తిని గాని ఏమనాలి అని ప్రశ్నించారు. రేవంత్ అన్నట్లు మూడు నెలలకు పిల్లలు పుట్టరు సరే.. కానీ 30 నెలలకు కూడా పుట్టకపోతే ఏమనాలి? అని ఎద్దేవా చేశారు.

పాలమూరు-రంగారెడ్డి అసంపూర్తి పనులు చేయని అసమర్థ సర్కార్

పెండింగ్ ప్రాజెక్టుల్లో కనీసం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తి చేయడం లేదని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టు కావడంతో దాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మామ పేరు పెట్టుకున్నాడు కానీ పనులు అయితే చేస్తలేడు అని, జైపాల్ రెడ్డి మీద ఏమన్న కోపం ఉంది కావొచ్చు అందుకే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేస్తలేడు అని విమర్శించారు. ఎన్నికల ముందు పనులు చేసి నేనే చేసినా అని చెప్పుకుందామని చూస్తున్నాడన్నారు. కేసీఆర్ పూర్తి చేసిన ఏదుల, నార్లాపూర్, కరివెన రిజర్వాయర్లు, 90% పూర్తయిన పనులు ప్రజలు చూడలేదా? అని గుర్తు చేశారు. ప్రతిసారి అప్పుల కారణంగా అభివృద్ధి చేయలేమని సాకులు చెబుతున్నారని, కానీ గత ప్రభుత్వం తెచ్చిన ప్రతి అప్పు ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం మూడు లక్షల 80 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుని ఒక్క రూపాయి పనీ చేయలేదన్నారు.

పడిపోయిన భూముల ధరలు

కల్వకుర్తి నియోజకవర్గం ఒకప్పుడు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండగా, ఈరోజు రియల్ ఎస్టేట్ భూముల ధరలు పడిపోయి రైతులు, ప్లాట్లు కొనుగోలు చేసిన మధ్యతరగతి ప్రజలకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం భూములు కొనుగోలు చేసిన మధ్యతరగతి వర్గాలు కూడా ఈరోజు ఆందోళనలో కూరుకుపోయాయని అన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా 25 సంవత్సరాల పాటు ప్రజలతో, వారి ఆకాంక్షలతో నిలబడి తెలంగాణ సాధించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ అన్నారు. అధికారం ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిసారి ప్రజల పక్షంగానే ఉంటామని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల
తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల

Latest News