KTR Defamation Case : కొండా సురేఖపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం
కేటీఆర్‌పై ఆరోపణలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, సమంత విడాకుల వ్యవహారంలో చేసిన వ్యాఖ్యలపై ఈ చర్య తీసుకున్నట్లు కోర్టు తెలిపింది.
KTR Defamation Case | తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు శనివారం నాడు ఆదేశించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన కేసులో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ , ప్రముఖ సినీ నటి సమంత విడాకుల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ పై ఆమె ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కేటీఆర్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది.
కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను BNS సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకుంది. మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ నెల 21 లోపు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. కొండా సురేఖ తరపు న్యాయవాది అభ్యంతరాలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
2024 అక్టోబర్ 2న బాపుఘాట్ లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలంటే కేటీఆర్ కు గౌరవం లేదన్నారు. కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణమని ఆమె ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో కొందరి హీరోయిన్ల ప్రైవేట్ సంభాషణలు విన్నారని చెప్పారు. నటుడు నాగ చైతన్య, సమంత విడాకులకు కూడా కేటీఆర్ కారణమని ఆమె అప్పట్లో చేసిన ఆరోపణలు పెద్ద సంచలనం అయ్యాయి. సినీ పరిశ్రమలో ఈ విషయం బహిరంగ రహస్యమని ఆమె అన్నారు. తనపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులకు సంబంధించి కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. మహిళలను కించపర్చేలా పోస్టులు పెట్టాలని కేటీఆర్ తన సోషల్ మీడియా టీమ్ కు చెప్పారా అని ఆమె ప్రశ్నించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram