ముమ్మాటికి.. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్సే విలన్: మంత్రి జి.జగదీష్ రెడ్డి

విధాత: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా తెలంగాణకు ముమ్మాటికి కాంగ్రెస్సే విలన్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి పునరుద్ఘాటించారు. నల్లగొండ, సూర్యాపేట మేడే వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఉన్న తెలంగాణను గతంలో ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ అని, ఉద్యమ సమయంలో 359 మందిని కాల్చి చంపిన పాపం కాంగ్రెస్ దేనని, కేసీఆర్ దీక్ష సమయంలో విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్ కారణం కాదా అని జగదీష్ రెడ్డి విమర్శించారు. అందుకే ముమ్మాటికీ తెలంగాణకు మెయిన్ విలన్ కాంగ్రెస్సే అంటున్నామన్నారు. ఆనాడు తెలంగాణ ఇచ్చింది ప్రేమతో కాదు.. భయంతోనే అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
ఎల్కతుర్తి సభలో కేసీఆర్ నోట సీఎం రేవంత్ మాట రాలేదని ఆయనకు బాధగా ఉందని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ గురించి కామెంట్ చేసేటోళ్లకు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఒక చెంపపెట్టు అన్నారు. కాంగ్రెస్ అంటే రేవంత్ ఒక్కడేనన్న భ్రమలో ఉన్నాడని, రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ కన్నా వ్యక్తిగత ప్రచారమే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ పేరు మర్చిపోతున్నారన్నారు. ఒక్క మంచిపని చేయని రేవంత్ పేరు ప్రజలెందుకు గుర్తు పెట్టుకుంటారని, రేవంత్ వల్ల బాధించబడ్డ వారే ఆయనను ఓడించేందుకు గుర్తు పెట్టుకుంటారని చెప్పారు. పదవి రాగానే సోనియాగాంధీని బలి దేవతన్న మాటలను రేవంత్ మరిచిపోయారని విమర్శించారు.
ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉంటే వారికెందుకు భయం
తెలంగాణ ద్రోహుల కొమ్ముకాసేటోళ్లకు మన అభివృద్ధి కూడా భ్రమగానే ఉంటుందన్నారు. అధికారం కోసం దిగజారే నైజం రేవంత్ రెడ్డిదన్నారు. పదేండ్లు మాదే అధికారమన్న వాళ్లకి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే భయమెందుకన్నారు. ఎన్ని రోజులు పదవిలో ఉంటాడో గ్యారెంటీ లేని సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా హామీలిచ్చి అమలు చేయలేకే విమర్శల పాలవుతున్నాడన్నారు. ఇకనైనా కేసీఆర్ పై చిల్లర మాటలు మాని హామీల అమలుపై దృష్టి పెట్టండని జగదీష్ రెడ్డి హితవు పలికారు. పరిపాలన అనుభవంలేని కొత్త బిచ్చగాళ్ళని కేసీఆర్ కాంగ్రెస్ పాలకులకు ఏడాదిన్నర సమయం ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీల అమలులో వైపల్యం చెంది.. ప్రజల్లో కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు.
శాసనసభ నిబంధనలను గాలికొదిలేసి.. బూతులు మాట్లాడిన చరిత్ర కాంగ్రెస్ పాలకులకే దక్కిందన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు దమ్ముంటే గత పది ఏళ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిపై ప్రజల్లో చర్చకు ముందుకు రావాలని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణను ఎడారి చేసి, ఫ్లోరైడ్ మహమ్మారిని పోషించి, సూర్యాపేటకు మూసి నీళ్లు తాగించినది మీరు కదా..? అని మండిపడ్డారు. మా హయంలో 3.5 లక్షల నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి పెంచామని, ఆరేళ్లలో ఫ్లోరైడ్ పీడ తొలగించామని, 3 జిల్లాలు చేసి, మూడు మెడికల్ కాలేజీలు తెచ్చామని గుర్తు చేశారు.