Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరైన ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిట్ విచారణకు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోన్‌తో పాటు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం అధికారులను ఉపయోగిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు.

Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరైన ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్

Phone Tapping Case | విధాత, హైదరాబాద్ : బీఆర్ ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సోమవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు చేతగాక సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ ను వాడుకుంటుందన్నారు. అధికారులు మంచివాళ్లైనప్పటికి వారిని రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాడని సిట్ అధికారులు చెప్పానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రుల, సొంత నాయకుల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నట్లుగా తాను సిట్ కు రాత పూర్వక ఫిర్యాదు చేశానన్నారు. సౌత్ పోస్టు పత్రిక కథనం కూడా అదే పేర్కొందన్నారు. డార్క్ వెబ్ టూల్స్, పెగాసెస్ వంటి సాఫ్ట్ వేర్ సహాయంతో సొంత కాంగ్రెస్ మంత్రుల, ఎమ్మెల్యేల, పారిశ్రామిక వేత్తల ఫోన్ లను, తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని..దీనిపై కూడా విచారణ చేయాలని తాను సిట్ అధికారులను కోరడం జరిగిందన్నారు.

కాగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యూ-టర్న్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తుందంటూ అనేక సార్లు ఆరోపించి పలుమార్లు ఫిర్యాదులు చేసిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఫోన్లు, సొంత మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తోందని సిట్ అధికారులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. పార్టీల మారినట్లుగానే ఫోన్ ట్యాపింగ్ పై కూడా ప్రవీణ్ కుమార్ తన అభిప్రాయాలు మార్చుకున్నట్లుగా కనబడుతుందంటూ కాంగ్రెస్ వర్గాలు ఆయన తీరును తప్పుబడుతున్నాయి.