Ponnam Prabhakar| అడ్లూరిపై వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా: మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పట్ల తను అనుచిత వ్యాఖ్యలు చేశానన్న వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల తాను చింతిస్తున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు.

Ponnam Prabhakar| అడ్లూరిపై వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా: మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన

విధాత, హైదరాబాద్ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar) పట్ల తను అనుచిత వ్యాఖ్యలు చేశానన్న వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) బుధవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాకు సోదరులవంటివారు. కాంగ్రెస్ పార్టీలో మాకు 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదే. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగిందని… ఎవరు విడదీయరానిదని పొన్నం స్పష్టం చేశారు.

నేను ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా, నాకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదు. అయితే, రాజకీయ దురుద్దేశంతో కొంతమంది నా వ్యాఖ్యలను వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారు. దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటివారు అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి మనసు నొచ్చుకుందని తెలిసి నేను తీవ్రంగా విచారిస్తున్నానని పొన్నం తెలిపారు.

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో,రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం సాధనలో, ప్రజల అభ్యున్నతికై మేము ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తాం అని పొన్నం స్పష్టం చేశారు.

పొరపాటు అని ఉంటే బాగుండేది: అడ్లూరి

మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేసిన లేఖలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. లేఖలో ఆయన చింతిస్తున్నాను అనడానికి బదులుగా పొరపాటు జరిగిందని చెప్పి ఉంటే బాగుండేదన్నారు. ఇంకొంత సేపట్లో ఎలాగు పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ తో తమ భేటీ ఉన్నందునా వివాదం సమసిపోతుందని భావిస్తున్నానన్నారు.