Foldable iPhone 2026: Fold It Like a Phone, Use It Like a Tablet
📱 ఫోల్డబుల్ ఐఫోన్ 2026 – సారాంశం
యాపిల్ 2026లో ఫోల్డబుల్ ఐఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ డివైస్ మడిస్తే సాధారణ స్మార్ట్‌ఫోన్‌గా, తెరిస్తే ఐప్యాడ్ తరహా అనుభవాన్ని ఇస్తుంది. సుమారు 7.8 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 5.5 అంగుళాల అవుటర్ స్క్రీన్‌తో ఒకే డివైస్‌లో రెండు అనుభవాలు అందించబోతుంది.
కీలకాంశాలు
- 📱 మడిస్తే ఫోన్… తెరిస్తే ట్యాబ్ అనుభవం
- 📏 7.8 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 5.5 అంగుళాల అవుటర్ స్క్రీన్
- 🧩 క్రీజ్ దాదాపు కనిపించకుండా కొత్త టెక్నాలజీ
- 🔐 Face ID స్థానంలో Touch ID
- ⚡ A20 (2nm) చిప్ + 12GB RAM
- 🔋 5,800mAh వరకు భారీ బ్యాటరీ
- 💰 ₹2 లక్షల వరకు ధర
విధాత టెక్ డెస్క్ | హైదరాబాద్:
Foldable iPhone 2026: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో యాపిల్ ఎప్పుడూ తొందరపడదు. కానీ ఒకసారి అడుగు వేసిందంటే ట్రెండ్‌నే మార్చేస్తుంది. ఇప్పుడు అదే తరహాలో ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్‌పై దృష్టి పెట్టిన యాపిల్, 2026లో తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకురాబోతుందనే లీకులు టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి వరకు సామ్‌సంగ్ వంటి కంపెనీలు ముందంజలో ఉన్నా, యాపిల్ మాత్రం “పర్ఫెక్ట్ ప్రొడక్ట్” సిద్ధం చేసిన తర్వాతే రంగంలోకి దిగాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది.
ఫోన్ కాదు… ట్యాబ్ అనుభవం ఇచ్చే కొత్త డిజైన్
పుస్తకం మాదిరిగా ఓపెన్ అయ్యే డిజైన్ – మల్టీటాస్కింగ్‌కు అనువైన పెద్ద స్క్రీన్
ఫోల్డబుల్ ఐఫోన్ ప్రత్యేకత దాని డిజైన్‌లోనే ఉంది. పుస్తకం లాగా మడిచే ఈ డివైస్, ఓపెన్ చేసినప్పుడు దాదాపు ఐప్యాడ్ మినీ సైజ్‌కు మారుతుంది. సుమారు 7.6 నుంచి 7.8 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 5.5 అంగుళాల అవుటర్ స్క్రీన్‌తో ఇది ఒకే డివైస్‌లో రెండు అనుభవాలను అందించబోతోంది.
ఇది సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా నిలువుగా కాకుండా, వెడల్పుగా ఉండే 4:3 ఆస్పెక్ట్ రేషియోలో రావచ్చని సమాచారం. దీని వల్ల వీడియోలు చూడటం, గేమింగ్, మల్టీటాస్కింగ్ మరింత సౌకర్యవంతంగా మారుతుంది.
క్రీజ్‌కు చెక్… హింజ్‌లో యాపిల్ మ్యాజిక్
ఓపెన్ చేసినప్పుడు ఐప్యాడ్‌లా మారే ఫోల్డబుల్ ఐఫోన్ కాన్సెప్ట్ డిజైన్
ఇప్పటివరకు ఫోల్డబుల్ ఫోన్లలో ప్రధాన సమస్య స్క్రీన్ మధ్యలో కనిపించే “క్రీజ్”. కానీ యాపిల్ దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి, దాదాపు కనిపించని స్థాయికి తగ్గించే సాంకేతికతను అభివృద్ధి చేసినట్టు సమాచారం.
అత్యంత పలుచని గ్లాస్, ప్రత్యేక డిస్‌ప్లే నిర్మాణం, మరియు లిక్విడ్ మెటల్ హింజ్‌తో స్క్రీన్ మడిచినా గీత తక్కువగా కనిపించేలా రూపొందిస్తున్నారు. అదే సమయంలో ధృడత్వాన్ని కూడా పెంచేలా హింజ్‌ను బలంగా తయారు చేస్తున్నారు.
మరో కీలక మార్పు — ఫేస్ ఐడీకి బదులుగా టచ్ ఐడీ రీ-ఎంట్రీ. సైడ్ బటన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వడం ద్వారా యూజర్లకు కొత్త అనుభవం ఇవ్వాలని యాపిల్ చూస్తోంది. నిజానికి ఓపెన్ చేస్తే ఫోన్ చాలా సన్నగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఫేస్ ఐడీకి కెమెరా అమర్చడం సాధ్యం కాదు కాబట్టి, టచ్ ఐడీకి వెళ్తోంది.
పర్ఫార్మెన్స్, బ్యాటరీ… ప్రీమియం అనుభవానికి పూర్తి ప్యాకేజ్
ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌లో A20 లేదా A20 Pro చిప్ (2nm టెక్నాలజీ) ఉండే అవకాశం ఉంది. ఇది వేగం, పవర్ ఎఫిషియెన్సీ రెండింటిలోనూ మెరుగైన పనితీరును అందిస్తుంది. 12GB RAMతో మల్టీటాస్కింగ్ సులభంగా నిర్వహించవచ్చు. సాఫ్ట్‌వేర్ పరంగా iOSనే ఉపయోగిస్తుండగా, ఐప్యాడ్ తరహాలో స్ప్లిట్ స్క్రీన్, సైడ్‌బార్ లేఅవుట్‌లు అందించేలా మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. అంటే ఒకేసారి రెండు యాప్‌లు వాడటం సులభమవుతుంది.
బ్యాటరీ కూడా ఈ డివైస్‌లో పెద్ద ప్లస్ పాయింట్. 5,400mAh నుంచి 5,800mAh వరకు సామర్థ్యం ఉండే అవకాశం ఉంది. ఇది ఇప్పటి వరకు ఐఫోన్‌లలోనే అత్యధికం.
అందరికీ అందనిదీ ఐఫోన్ ఫోల్డ్
మూసినప్పుడు ఫోన్, ఓపెన్ చేసినప్పుడు పెద్ద స్క్రీన్ – డ్యూయల్ డిస్‌ప్లే డిజైన్ : Courtesy : CNET
ఫోల్డబుల్ ఐఫోన్ ధర సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండదు. భారత కరెన్సీలో దాదాపు 2 లక్షల రూపాయలకు పైగా ఉండే అవకాశముంది. అయినా, యాపిల్ భయపడదు. ఈ ఫోల్డబుల్ ఫోనే అత్యంత ఎక్కువగా అమ్ముడవుతుందన్న ధీమాతో ఉంది. దీంతో ఇది యాపిల్ లైనప్‌లో అత్యంత ఖరీదైన ఐఫోన్‌గా నిలుస్తుంది.
ఆనవాయితీ ప్రకారం 2026 సెప్టెంబర్‌లో ప్రకటించి, ఓ రెండు నెలల తర్వాత మార్కెట్లోకి తీసుకురావచ్చు. ప్రారంభంలో పరిమిత స్టాక్ ఉండే అవకాశం కూడా ఉంది.
ఫోల్డబుల్ ఐఫోన్ కేవలం కొత్త డివైస్ కాదు — ఇది యూజర్ అనుభవాన్ని పూర్తిగా మార్చే ప్రయత్నం. ఒకే డివైస్‌లో ఫోన్, ట్యాబ్లెట్ అనుభవం ఇవ్వడం ద్వారా వినియోగంలో కొత్త మార్పులు తీసుకురావచ్చు. అయితే దీని విజయం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది — ధర, ధృడత్వం, మరియు వినియోగదారుడి అవసరాలకు ఇది ఎంతవరకు సరిపోతుందన్నది. ఇవన్నీ సరిగ్గా కుదిరితే, ఫోల్డబుల్ ఐఫోన్ స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో కొత్త యుగానికి నాంది పలికే అవకాశం ఉంది.
