భూమికి తీవ్ర జ్వరం.. మహా సముద్రాల్లో ప్రమాద ఘంటికలు

అవును.. భూమి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నది. రానున్న రోజుల్లో ఈ జ్వరం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా మానవాళి అల్లకల్లోలానికి గురి కానుందని చెబుతున్నారు. దీనికి కారణం.. దశాబ్దాలుగా చూడని ‘సూపర్‌ ఎల్‌ నినో’!

sea temperature record 2026 Image Generated with AI Help

ఎల్‌ నినో పరిస్థితులు వస్తే తీవ్ర దుర్భిక్షం, కరువు కటకాలు, ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. కానీ.. ఇప్పుడు రాబోతున్నది కేవలం ఎల్‌ నినో కాదు.. సూపర్‌ ఎల్‌ నినో! సముద్ర జలాలు వేడెక్కడమే ఎల్‌ నినో. ఇప్పటికే మునుపెన్నడూ లేనంత స్థాయిలో సముద్ర జలాలు వేడెక్కాయి. ఇంకా ఎల్‌ నినో పూర్తిస్థాయిలో విస్తరించకముందే ఏర్పడిన పరిస్థితి.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. వాతావరణ మార్పులను కొలిచేందుకు ఇప్పటి వరకూ ముఖ్యంగా భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలను శాస్త్రవేత్తలు ప్రామాణికంగా తీసుకున్నారు. కానీ.. ఇప్పుడు వారి దృష్టి మరో చోట కేంద్రీకృతమైంది. అవే మహాసముద్రాలు. భూమికి అసలైన హీట్‌ బ్యాటరీలుగా భావించే సముద్రాలు.. ప్రమాదకర స్థాయిలో వేడెక్కుతున్నాయి. దీని ఫలితంగా రాబోయే రోజుల్లో తుఫాన్లు, భారీ వరదలు, సముద్ర మట్టాల పెరుగుదల, ఆహార సంక్షోభం వంటి పరిణామాలు తలెత్తవచ్చని ప్రపంచ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గరిష్ఠస్థాయికి సముద్రాల ఉష్ణోగ్రతలు

ధృవ ప్రాంతాలను మినహాయిస్తే.. ప్రపంచ సముద్రాల ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు ఈ కాలంలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని యూరప్‌కు చెందిన కొపెర్నికస్‌ క్లైమేట్‌ చేంజెస్‌ సర్వీస్‌ (CCCS), కొపెర్నికస్‌ మెరైన్‌ సర్వీస్‌ (CMS) అనే రెండు ఇండిపెండెంట్‌ వాతావరణ సంస్థలు 2026, జూన్‌ 21వ తేదీన నిర్ధారించాయి. వాస్తవానికి ఈ రెండు సంస్థలు వేర్వేరు పద్ధతుల్లో సముద్ర జలాల ఉష్ణోగ్రతలను పరిశీలించినప్పటికీ.. ఇంచుమించుగా ఒకే ఫలితం రావడం ఇప్పుడు శాస్త్రవేత్తలను మరింత ఆందోళనలో పడేసింది. CCCS లెక్కల ప్రకారం ఆ రోజు ప్రపంచ సముద్రాల సగటు ఉపరితల ఉష్ణోగ్రత 20.86 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయింది. అంటే.. 2023, 2024లో నమోదైన ఉష్ణోగ్రతల రికార్డును ఇది బద్దలు కొట్టింది. CMS స్వతంత్ర విశ్లేషణలో సైతం అదే రోజు 21 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. తేడా 0.03 లేదా 0.1 డిగ్రీలుగానే కనిపిస్తున్నా.. ఇది అత్యంత ప్రమాదకర సంకేతమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇదేదో ఒక ప్రత్యేక ప్రాంతంలో కాకుండా.. వేల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న అన్ని మహాసముద్రాల్లోని జలాల ఉష్ణోగ్రత. అంతటి విస్తీర్ణంలోని జలాలు ఒకేసారి వేడెక్కడమంటే.. భూమి ‘శరీరం’లో వేడి అసాధారణంగా పేరుకుపోతోందన్నమిట.

ఇప్పుడే మొదలైన ఎల్‌ నినో.. ముందుంది ముసుర్ల పండుగ

ఎల్‌ నినో పరిస్థితులు ప్రారంభమైనట్టుగా అమెరికా వాతావరణ సంస్థ ఎన్‌వోఏఏ అధికారంగా జూన్‌ 11వ తేదీన ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది గత డెబ్భై ఏళ్లలోనే అత్యంత శక్తిమంతమైన ఎల్‌ నినోగా మారే అవకాశం 81శాతం ఉందని జూలై అంచనాలు పేర్కొంటున్నాయి. ఇది 2027 వసంత కాలం వరకూ కొనసాగే అవకాశాలు 97 శాతం వరకూ ఉన్నాయని ఎన్‌వోఏఏ అంచనా వేస్తున్నది.

ఎల్‌ నినో ఏర్పడితే సాధారణంగా పసిఫిక్‌ మహాసముద్రం నుంచి పెద్ద మొత్తంలో వేడి.. వాతావరణంలోకి విడుదలవుతుంది. ఫలితంగా ప్రపంచ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈసారి మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. ఎల్‌ నినోకు ముందే సముద్రాలు రికార్డు స్థాయిలో ఇప్పటికే వేడెక్కాయి. ఇది ప్రకృతి సిద్ధమైనది. అదే సమయంలో దీనికి మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడిన గ్లోబల్‌ వార్మింగ్‌ కూడా జత కలుస్తున్నది. ఈ రెండు రక్కసులు కలిసి ఒకేసారి కలిసి పనిచేయడం కారణంగా ప్రపంచ వాతావరణంపై ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఏమిటీ ప్రమాదం?

నిజానికి భూమిని చల్లబరుస్తున్నది మహాసముద్రాలే. భూమిపై పేరుకుపోయే వేడిలో 90 శాత వరకూ గ్రహిస్తున్నది సముద్రాలే. అంటే అవే భూమి పూర్తి స్థాయిలో వేడెక్కకుండా కాపాడుతూ వస్తున్నాయి. ఆ క్రమంలో తమ సామర్థ్యానికి మించిన వేడిన తమలో నిల్వ చేసుకుంటున్నాయి. ఫలితంగా సముద్ర జలాలు వేడెక్కుతున్నాయి. వేడెక్కిన జలాలు ఆవిరిని విడుదల చేస్తాయి. అవి మేఘలుగా మారుతాయి. అంటే.. ఒక్కసారి పెద్ద మొత్తంలో వేడి, ఆవిరి మళ్లీ వాతావరణంలోకి ప్రవేశిస్తే.. శక్తిమంతమైన తుఫాన్లు, అసాధారణ స్థాయిలో భారీ వర్షాలు, మెరుపు వరదలు, తీవ్ర స్థాయిలో వేడి తరంగాలు, కరువు పరిస్థితులు, హిమానీనదాల కరుగుదల.. అంతిమంగా సమద్ర మట్టం వేగంగా పెరగడం వంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి.

జీల జీవ వ్యవస్థకు మృత్యు ఘంటికలే

సముద్రాలు వేడెక్కడం వల్ల అవి వాటిలోని జీవ వ్యవస్థలను అతలాకుతలం చేసిపారేస్తాయి. సముద్రంలో పగడపు దిబ్బలు అనేవి లక్షల కొద్దీ చేపలకు ఆశ్రయం ఇచ్చేవి. నీటి ఉష్ణోగ్రత మరిన్ని రోజులు కొనసాగిన పక్షంలో.. మెరైన్‌ హీట్‌వేవ్స్‌ ఏర్పడుతాయి. అవి.. పగడపు దిబ్బలను తెల్లగా మార్చేసి.. చివరకు వాటిని అంతమొందిస్తాయి. ఫలితంగా మొత్తం సముద్ర ఫుడ్‌ చైన్‌పై ప్రభావం పడుతుంది. అనేక చేప జాతులు తమ సహజ ఆవాసాలకు దూరమవుతాయి. చేపల ఉత్పత్తి కూడా భారీ స్థాయిలో తగ్గిపోతుంది. షెల్‌ ఫిష్‌, సీ ఆల్గీ, కెల్ప్‌ అడవులు నశిస్తాయి. మత్స్యకారుల జీవనం, ఉపాధి ప్రమాదంలో పడతాయి. అంతిమంగా ప్రపంచ ఆహార భద్రత పెను ప్రమాదంలో పడుతుంది. వాస్తవానికి ప్రపంచంలో కోట్ల మంది తమ ఆహారంలో మాంసకృత్తుల కోసం సీఫుడ్‌ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీనిని అందించే సముద్ర జీవ వ్యవస్థ కుప్పకూలడమంటే.. అది మనం భోజనం చేసే ప్లేట్‌ను కూడా ప్రభావితం చేస్తుందని అర్థం.

మరింతగా పెరిగే నీటి ఆవిరి

సముద్ర జలాలు వేడెక్కితే.. ఉపరితలంలో ఆవిరి కూడా భారీ స్థాయిలో అందునా వేగంగా ఉంటుంది. అవి ఆకాశంలోకి వెళ్లి.. మేఘాలుగా రూపాంతరం చెందుతాయి. అవే భారీ వర్షాల రూపంలో మళ్లీ భూమిపై వివిధ ప్రాంతాల్లోకి వస్తాయి. ఇది కూడా విచిత్రంగా ఉంటుంది. మేఘాలు ఎక్కడ వస్తాయో.. మేఘాలు ఎక్కడ మాయమైపోతాయో చెప్పలేని స్థితి. ఫలితంగానే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తే.. మరికొన్ని ప్రాంతాలు చుక్క నీటికీ దిక్కులేక ఎండిపోతాయి.

మధ్యధరా సముద్రం 6 డిగ్రీలు ఎక్కువ..!

ప్రపంచ సగటు ఉష్ణోగ్రత కొద్దిగా మాత్రమే పెరిగినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది. మధ్యధరా సముద్రం పశ్చిమ ప్రాంతంలోని కొన్ని చోట్ల సాధారణం కంటే ఆరు డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. బాల్టిక్ సముద్రం, ఉత్తర కెనడా సమీప సముద్రాలు, పసిఫిక్‌లోని కొన్ని ప్రాంతాలు సైతం అసాధారణ వేడితో ఉన్నట్టు గమనించారు. ఈ ప్రాంతాలే రాబోయే నెలల్లో తీవ్ర వాతావరణ పరిణామాలకు కేంద్రాలుగా తయారయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

“తెలియని దశలోకి అడుగుపెడుతున్నాం”

ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు మనం ఇప్పటి వరకూ కనీవినీ ఎరుగని కొత్త దశలోకి ప్రవేశిస్తున్నామనేందుకు సంకేతాలని యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌కాస్ట్స్‌కు చెందిన కొపెర్నికస్‌ క్లైమేట్‌ చేంజ్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ కార్లో బుయోంటెంపో బాంబు పేల్చారు. అంటే.. గత రికార్డులను ఆధారం చేసుకుని భవిష్యత్తును అంచనా వేసే పరిస్థితి కూడా రానున్న రోజుల్లో క్రమంగా తగ్గిపోతుందన్నమాట.

ఇది మానవాళి భవిష్యత్తు

భూమి వేడెక్కుతున్నది.. అనేది మనం ఇప్పటి దాకా వింటూ వస్తున్న మాట. ఇప్పుడు కొత్త మాటేంటంటే.. భూమిని చల్లబరిచే సముద్రాలే వేడెక్కిపోతున్నాయి. అంటే.. ప్రకృతి తన సహజమైన సమతుల్యాలను కోల్పోతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ప్రపంచ ఆహార ఉత్పత్తి, తాగునీటి లభ్యత, తీరప్రాంత నగరాల భద్రత, జీవ వైవిధ్యం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అన్నీ కట్టకలుపుకొని ఒకే సమయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే ప్రమాదం ముంచుకొస్తున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Latest News