గుడ్డు కాదు.. గాడిద గుడ్డూ కాదు.. ‘బంగారు గుడ్డు’ రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు..

సముద్రం.. అంతు తెలియని రహస్యాల కేంద్రం. తెలిసింది గోరంతైతే.. తెలియని సముద్రమంత. అలాస్కా సముద్ర గర్భంలో ఇలాంటి రహస్యం ఒకటి మూడేళ్ల క్రితం వెలుగు చూసింది. అదే.. బంగారు గుడ్డు. దీన్ని మూడేళ్లపాటు శోధించిన శాస్త్రవేత్తలు అది గుడ్డు కాదని, ఒక జీవి శరీర భాగమని తేల్చారు.

గుడ్డు కాదు.. గాడిద గుడ్డూ కాదు.. ‘బంగారు గుడ్డు’ రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు..

సముద్రం లోతు ఎంత ఉంటుందో అన్ని రహస్యాలు దాని గర్భంలో దాచి ఉంటాయి. వెతికిన కొద్దీ ఆ రహస్యాలు వెలుగు చూస్తూ ఉంటాయి. అదేంటో గుర్తించడానికి కొన్ని సందర్భాల్లో సంవత్సరాలు పడుతూ ఉంటుంది. ఇటువంటి ఒక రహస్యాన్ని శాస్త్రవేత్తలు మూడేళ్ల తర్వాత ఛేదించారు. అలాస్కా సముద్ర గర్భంలో లభించిన ‘బంగారు గుడ్డు’ గుట్టును రట్టు చేశారు. ఇది బంగారు గుడ్డూ కాదు.. గాడిద గుడ్డూ కాదు.. అని తేల్చారు. సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాల్లో పెరిగే ఒక సముద్రజీవికి సంబంధించిన ఒక భాగమని గుర్తించారు.

ఈ కథలోకి వెళితే.. 2023లో గల్ఫ్‌ ఆఫ్‌ అలాస్కాలో ఒక సముద్ర పరిశోధన చేపట్టారు. ఆ సమయంలో ఆ బృందంలోని శాస్త్రవేత్తలు ఒక బంగారు గోళాకారంలోని ఒక ఆబ్జెక్ట్‌ను కనుగొన్నారు. అది ఒక రాయికి అంటుకొని ఉంది. సుమారు నాలుగు అంగుళాల పరిమాణంతో.. ఒక చిన్నరంథ్రం ద్వారా లోపలిభాగం కనిపిస్తూ ఆ ఆబ్బెక్ట్‌ ఉన్నది. తొలుత ఇదొక గుర్తు తెలియని సముద్ర జీవి పెట్టిన గుడ్డు అని భావించారు. కానీ.. మూడేళ్ల పరిశోధన.. ఆ భావనను పటాపంచలు చేసింది.

ఇది ఒక భారీ సముద్ర రత్నభోగి (సముద్రం లోపల పెరిగే ఒక తరహా జాతి జీవి-sea anemone) అని అమెరికాకు చెందిన నేషనల్‌ ఓషనిక్‌ అండ్‌ అట్మాస్ఫియెరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. ముఖ్యంగా ఇది Relicanthus daphneae అనే అరుదైన జాతికి సంబంధించినదిగా ధృవీకరించారు.

మొదట కన్‌ఫ్యూజన్‌ ఇందుకే…

ఈ బంగారు గోళాన్ని సేకరించిన తర్వాత.. స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీలో దీనికి అనేక రకాల పరీక్షలు నిర్వహించారు. సాధారణ డీఎన్‌ఏ పరీక్షలు, నిర్మాణ పరీక్షల్లో ఎలాంటి ఫలితం తేలలేదు. దీంతో శాస్త్రవేత్తలు మరింత గందరగోళానికి గురయ్యారు. మూడేళ్ల పరిశోధనల్లో ఈ గోళం పొరలు పొరలుగా ఉండి, లోన ప్రత్యేకమైన ‘స్టింగ్‌ సెల్స్‌’ అంటే.. కాటు కణాలు కనిపించాయి. సాధారణంగా ఇవి పగడాలు (కోరల్స్‌), లేదా అనిమోన్లలో కనిపించే లక్షణాలుగా గుర్తించారు. అయితే.. స్పిరోస్టిన్స్‌ అనే కణాలను గుర్తించిన తర్వాత.. ఇది హెక్సాకొరాల్లియా (Hexacorallia) వర్గానికి చెందినదనే సూత్రీకరణకు శాస్త్రవేత్తలు వచ్చారు.

కనుగొన్నది ఇలా…

బంగారు గుడ్డు రహస్యం కనుగొనేందుకు తొలుత నిర్వహించిన డీఎన్‌ఏ పరీక్షలు ఫెయిల్‌ అయిన తర్వాత.. సంపూర్ణ జన్యుకణ నిర్ధారణ (whole-genome sequencing) అనే అధునాతన పద్ధతిని ఉపయోగించారు. దాని ఫలితాల ఆధారంగా చూస్తే.. ఈ గోళంలోని డీఎన్‌ఏ.. రెలికాంథస్‌ డాఫ్నియే అనే జాతి డీఎన్‌ఏతో పూర్తిగా సరిపోయింది.

మిగిలిన భాగం ఏది?

బాగానే ఉంది.. బంగారు గోళం.. గుడ్డు కాదని తేలిపోయింది సరే..! దొరికిన భాగం.. సదరు జీవి దిగువ భాగం అని కూడా తేలిపోయింది. మరి పై భాగం ఏమైంది? అది మాత్రం ఇంకా అంతుచిక్కడం లేదు. అయితే.. ఆ జీవి మరణించి ఉండొచ్చని, లేదా తన శరీరంలోని ఈ భాగాన్ని వదిలిపెట్టి.. మరో చోటుకు వెళ్లి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే.. అది ఎలా జరిగి ఉంటుందనేది పూర్తిగా ఎప్పటికీ తెలియకపోవచ్చునని NOAA పేర్కొంది. ఇదొక్కటే కాదు.. ఇలాంటి రహస్యలు సముద్ర గర్భంలో ఎన్నో ఉన్నాయి. ఇంకా ప్రపంచానికి తెలియని జీవులు, అద్భుతాలను సాగరం తన గర్భంలో దాచుకుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఇలాంటి రహస్యాలను కాలక్రమేణా ఛేదించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి బంగారు గుడ్డు అనుకున్నది కాస్తా.. ఒక అరుదైన సముద్ర జీవిలోని ఒక భాగం అని తేలింది. మనకు తెలియని ప్రపంచం ఇంకా ఎంత పెద్దదో ఈ చిన్న భాగంపై సాగిన పరిశోధన స్పష్టంచేస్తోంది.

ఇవి కూడా చదవండి..

తెలంగాణ రోడ్లకు మహర్దశ.. 98వేల కోట్లతో అభివృద్ధి పనులు.. హైదరాబాద్‌లో మరో ఎలివేటెడ్‌ కారిడార్‌
రేపే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన..పార్టీ పేరుపై సస్పెన్స్!

ఆర్టీసీ సమ్మె విషయంలో నాడు కేసీఆర్‌… నేడు రేవంత్‌ సేమ్ టూ సేమ్?