రానున్నది ‘సూపర్‌ ఎల్‌ నినో’.. మారిపోనున్న ప్రపంచ వాతావరణ పరిస్థితులు.. మనకూ ముప్పు?

రానున్న రోజుల్లో ప్రళయకాల పరిస్థితులను సృష్టించే సూపర్‌ ఎల్‌ నినో దాపురించే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రపంచ వాతావరణ మోడల్స్‌ సూచిస్తున్నాయి. అదే జరిగితే భారత్‌ వంటి దేశాల్లో క్షామ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నది. అసలు ఎల్‌ నినో అంటే ఏమిటి? సూపర్‌ ఎల్‌ నినో అంటే ఏమిటి? ఈ కథనంలో చూద్దాం..

super-el-nino-impact - image created with AI help

వేసవి కాలంలో అత్యంత కీలకమైన మే నెల ప్రవేశించడానికి ముందే దేశంలోని అనేక నగరాలు గరిష్ఠ ఉష్ట్రోగ్రతలతో తల్లడిల్లిపోతున్నాయి. వడగాడ్పులు క్రమంగా చుట్టుముడుతున్నాయి. పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఒడిశా రాష్ట్రాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ విభాగం హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఢిల్లీలో సాధారణ ఉష్ణోగ్రతలకు ఎగువన 42.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలోనే ఇది గరిష్ఠ ఉష్ణోగ్రతగా చెబుతున్నారు. ఢిల్లీ, హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సైతం ఠారెత్తిస్తున్నాయి. తూర్పు, మధ్య, వాయవ్య రాష్ట్రాల్లో సాధారణ స్థాయికి మించిన వడగాడ్పులు ఉంటాని ఐఎండీ అంచనా వేస్తున్నది.

రానున్న సూపర్‌ ఎల్‌ నినో

ఈ ఎండాకాలం చరిత్రలో నిలిచిపోయే మరో మైలురాయిగా నిలిచిపోతుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు చెబుతూ వస్తున్నారు. తాజాగా ప్రపంచ వాతావరణ సంస్థలు మరో కీలకమైన అంశాన్ని పరిశీలిస్తున్నారు. అదే సూపర్‌ ఎల్‌ నినో. ప్రపంచవ్యాప్తంగా దారుణమైన వేడి పరిస్థితులను సృష్టించి.. రుతుపవనాలను దారుణంగా దెబ్బతీసే రక్కసి. పసిఫిక్‌ మహాసముద్రంలో అభివృద్ధి చెందుతున్న పరిస్థితులను శాస్త్రవేత్తలు ట్రాక్‌ చేస్తున్నారని, ఈ పరిణామాలు రాబోయే సంవత్సరంలో ప్రపంచ ఉష్ణోగ్రతలను గణనీయంగా పెంచివేసి, ఇప్పటి వరకూ ఉన్న రికార్డులను బద్దలు కొట్టగల స్థాయిలో ఉంటాయని గార్డియన్‌ పత్రిక పేర్కొంటున్నది.

El Nino | కార్చిచ్చులు, కరువు కాటకాలు..! ఎల్‌ నిన్యో.. లా నిన్యా.. అంటే ఏమిటి?

శతాబ్దపు బలమైన ఎల్‌ నినో

ఈ శతాబ్దంలోనే అత్యంత బలమైన ఎల్‌ నినోగా అభివృద్ధి చెందే సంకేతాలు ఉన్నట్టు యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌కాస్ట్స్‌, ఇతర మాడల్స్‌ సూచిస్తున్నాయి. 2026 చివరి సంవత్సరాల్లో ఇది ఏర్పడేందుకు ఉన్న అవకాశాలు, తదుపరి బలపడే అవకాశాలను వాతావరణ నమూనాలు చూపుతున్నాయి. 1982నుంచి సూపర్‌ ఎల్‌ నినో సూచికలు పెరుగుతున్న ధోరణలనులను తాజా అధ్యయనం ఒకటి ప్రస్తావించింది. దీనికి గ్లోబల్‌ వార్మింగ్‌తో సంబంధం ఉంది.

Global Warming | ఎండల తీవ్రతను తగ్గించవచ్చా? భూమికి గొడుగు వేసేందుకు బ్రిటన్‌ చేస్తున్న ప్రయోగం ఏంటి?

సూపర్‌ ఎల్‌ నినో అంటే..

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ప్రతి 2 నుంచి 7 ఏళ్లకు ఒకసారి వచ్చే ఏర్పడే సహజ వాతావరణ మార్పు. సాధారణంగా సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు +0.5 డిగ్రీల సెల్సియస్‌ నుంచి +1.4 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పెరగడాన్నే ఎల్‌ నినో అంటారు. సూటిగా చెప్పాలంటే పసిఫిక్‌ జలాలు వేడెక్కడం అన్నమాట. అదే ఏకంగా +2 డిగ్రీల సెల్సియస్‌ దాటితే.. దాన్ని సూపర్‌ ఎల్‌ నినోగా పరిగణిస్తారు. ఎల్‌ నినో కారణంగా పసిఫిక్‌ సముద్రంలో గాలుల దిశ మారుతుంది. దాని ప్రభావం ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాల వాతావరణ పరిస్థితులపై పడుతుంది.

సాధారణంగా పగటి పూట ఉష్ణోగ్రతలే అత్యంత ప్రమాదం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ.. దానితోపాటే.. రాత్రిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా ప్రమాదకరమైనవి. పగటిపూట వేడిని అనుభవించిన మనిషి శరీరం.. రాత్రికి చల్లబడకపోతే శరీరంలో అనూహ్యమైన మార్పులు అనారోగ్యానికి దారి తీస్తాయి. ఇప్పుడు రాబోయే సూపర్‌ ఎల్‌ నినో ఈ పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

2026 ప్రారంభంలో తటస్థ పరిస్థితులు కనిపించినప్పటికీ.. ప్రస్తుత వాతావరణ నమూనాలు.. అన్నీ.. ఎల్‌ నినో దిశగానే చూపుతున్నాయి. త్వరలో ప్రారంభమయ్య ఎల్‌ నినో.. తదుపరి మాసాల్లో మరింత బలపడే అవకాశం కనిపిస్తున్నదని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) వాతావరణ అంచనాల విభాగం చీఫ్‌ విల్ఫ్రాన్ మౌఫౌమా ఓకియా చెబుతున్నారు. ఏప్రిల్‌ తర్వాత మరింత స్పష్టత వస్తుందని అంటున్నారు.

Read Also |

ఏజీఐతో కుప్పకూలనున్న ఆర్థిక వ్యవస్థ : ఓపెన్ ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌
సీఎం రేవంత్ కోసం ఔటర్ పై గంటకు పైగా ట్రాఫిక్ నిలిపివేత..జనం నిలదీత
కరువు సీమలో.. ఆపిల్ సాగు సిరులు!

Latest News