Droughts | ఇకపై దీర్ఘ కరువులు, వరదలు! అస్తవ్యస్తంగా ఎల్‌ నిన్యో, లా నిన్యా

Droughts | పసిఫిక్‌ వాతావరణ నమూనాల్లో మార్పు కరువు, మంటలు, వర్షాలు, వరదలు ఇకపై నిత్యకృత్యంగా మారే ప్రమాదం కొంప ముంచుతున్న కర్బన ఉద్గారాలు ముగిసిన లా నిన్యా.. ఎల్‌ నిన్యో ప్రవేశం మానవాళికి ప్రకృతి చేస్తున్న హెచ్చరిక వాషింగ్టన్‌ : మానవ తప్పిదాల వల్ల రానున్న రోజుల్లో సుదీర్ఘ కరువుకాటకాలు, వరద బీభత్సాలను ప్రపంచం ఎదుర్కొనాల్సి వస్తుందని నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తున్నది. ఎల్‌ నిన్యో, లా నిన్యా అనేవి పసిఫిక్‌ […]

  • By: Somu    latest    Aug 24, 2023 12:47 PM IST
Droughts | ఇకపై దీర్ఘ కరువులు, వరదలు! అస్తవ్యస్తంగా ఎల్‌ నిన్యో, లా నిన్యా

Droughts |

  • పసిఫిక్‌ వాతావరణ నమూనాల్లో మార్పు
  • కరువు, మంటలు, వర్షాలు, వరదలు
  • ఇకపై నిత్యకృత్యంగా మారే ప్రమాదం
  • కొంప ముంచుతున్న కర్బన ఉద్గారాలు
  • ముగిసిన లా నిన్యా.. ఎల్‌ నిన్యో ప్రవేశం
  • మానవాళికి ప్రకృతి చేస్తున్న హెచ్చరిక

వాషింగ్టన్‌ : మానవ తప్పిదాల వల్ల రానున్న రోజుల్లో సుదీర్ఘ కరువుకాటకాలు, వరద బీభత్సాలను ప్రపంచం ఎదుర్కొనాల్సి వస్తుందని నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తున్నది. ఎల్‌ నిన్యో, లా నిన్యా అనేవి పసిఫిక్‌ మహాసముద్ర జలాలు వేడెక్కే, చల్లబడే దశలు. దీనిని ఎల్‌ నిన్యో – దక్షిణ డోలాయమానం (El Nino-Southern Oscillation (ENSO) అని పిలుస్తారు. 2023లో తన మూడేళ్ల కాలాన్ని లా నిన్యా ముగించుకున్నది.

ఇక తాను రంగంలోకి వస్తున్నానని ఎల్‌ నిన్యో హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే ఆగస్ట్‌ నెల గడిచిన 123 ఏళ్లలోనే ఎన్నడూ లేనంత వర్షాభావాన్ని ఎదుర్కొన్నది. అంతకు ముందు జూలై నెల భూమి పుట్టిన తర్వాత ఎన్నడూ లేనంత వేడిని చూసింది. దేశంలో ఒకవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటే.. మరోవైపు కొన్ని రాష్ట్రాలను భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నయి. వీటన్నింటి మధ్య అంతర్లీనంగా ఉన్న అంశమే పర్యావరణ విధ్వంసం.

వాకర్‌ సర్క్యులేషన్‌ సరళిలో మార్పులు!

ఎల్‌ నిన్యో లేదా లా నిన్యా పరిస్థితులు సాధారణంగా 9 నుంచి 12 నెలల వరకూ ఉంటాయి. ఈఎన్‌ఎస్‌వోలో వాతావరణం, మహాసముద్రం రెండూ పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి. అయితే.. ఈఎన్‌ఎస్‌వోను ప్రభావితం చేసే వాతావరణ అంశం.. వాకర్‌ సర్క్యులేషన్‌ పారిశ్రామిక యుగం నుంచీ తన ధోరణిని మార్చుకుంటున్నదని కొత్త అధ్యయనంలో వెల్లడైంది.

వాకర్‌ సర్క్యులేషన్‌ బలహీనంగా ఉంటే ఎల్‌ నిన్యో, బలంగా ఉంటే లా నిన్యా పరిస్థితులు ఏర్పడుతాయనేందుకు సంకేతాలు. ‘పసిఫిక్‌ వాకర్‌ సర్క్యులేషన్‌ను గ్రీన్‌హౌస్‌ వాయువులు ప్రభావితం చేస్తున్నాయా అన్నది మనం నిర్ధారించుకోవాల్సి ఉన్నది’ అని ఈ వ్యాసం ప్రధాన రచయిత జార్జీ ఫాల్‌స్టర్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ, ఏఆర్‌సీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ క్లైమేట్‌ ఎక్స్‌ట్రీమ్స్‌ రిసెర్చ్‌ ఫెలోగా ఈయన ఉన్నారు.

వాకర్‌ సర్క్యులేషన్‌ సాధారణ బలం ఇప్పటి వరకూ మారలేదని, ఏ ఏడాదికి ఆ ఏడాది దాని ప్రవర్తనను గమనిస్తే మార్పులు కనిపిస్తున్నాయని ఆయన తన ప్రకటలో వివరించారు. 1200 సంవత్సరం నుంచి 2000 వరకు ఈ 800 ఏళ్ల కాలంలో వాకర్‌ సర్క్యులేషన్‌ వైవిధ్యాలు ఎలా ఉన్నాయనేది రీకన్‌స్ట్రక్ట్‌ చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన, ఆయన సహచరులు పేర్కొన్నారు.

ఇందుకోసం వారు మంచుగడ్డలు, చెట్లు, సరస్సులు, పగడాలు, గుహల అంతర్భాగం నుంచి వివరాలను సేకరించారు. ‘అవేమీ థర్మామీటర్‌లాగా నిర్దిష్టంగా చెప్పవు. కానీ.. వాతావరణం గురించి సమాచారాన్ని కలిగి ఉంటాయి’ అని ఈ వ్యాస సహ రచయిత, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాంతా బార్బరాకు చెందిన బ్రెన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎన్‌వైర్‌మెంటల్‌ సైన్సెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సమంతా స్టీవెన్‌సన్‌ పేర్కొన్నారు.

దీర్ఘకాలిక ఎల్‌ నిన్యో, లానిన్యాలు!

ఎల్‌ నిన్యో నుంచి లా నిన్యాకు వెళ్లే క్రమంలో వాకర్‌ సర్క్యులేషన్‌ వేగం స్వల్పంగా తగ్గి.. అధిక సమయంలో తీసుకుంటున్నదంటే అది బహుళ సంవత్సరాల నమూనాలు (దీర్ఘకాలిక) పెరుగుతున్నాయనేందుకు సంకేతమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. దీనర్థం.. ఎల్‌ నిన్యో, లా నిన్యా దశల మధ్య వేగం మరింత తగ్గిపోతుందని, ఫలితంగా సుదీర్ఘకాలం ఈ వాతావరణ నమూనాలు కొనసాగుతాయని అంటున్నారు.

ఈ మార్పుల వలన కరువుకాటకాలు, మంటలు, వర్షాలు, వరదలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నది. వాకర్‌ సర్క్యులేషన్‌ బలం తగ్గనప్పటికీ.. అధిక స్థాయిలో బొగ్గుపులుసు వాయువులు వెలువడటం వల్ల వాకర్‌ సర్క్యులేషన్‌ బలహీనపడే అవకాశం ఉన్నదని వారు ఊహిస్తున్నారు. దీనితోపాటు.. చాలా వాతావరణ నమూనాలు ఈ శతాబ్దం చివరికి వాకర్‌ సర్క్యులేషన్‌ క్షీణిస్తుందని పేర్కొంటున్నాయి.

అగ్నిపర్వతాల విస్ఫోటంతోనూ ఎల్‌ నిన్యో

అగ్నిపర్వతాల విస్ఫోటం కూడా వాకర్‌ సర్క్యులేషన్‌ బలహీన పడటానికి ఒక కారణంగా చెబుతున్నారు. అగ్నిపర్వతాల విస్ఫోటాలతో పసిఫిక్‌ వాకర్‌ సర్క్యులేషన్‌ గణనీయంగా బలహీనపడిపోవడం తరచూ గమనిస్తున్నామని సెయింట్‌ లూయీస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కొనెక్కీ పేర్కొన్నారు.

అందుకే అగ్నిపర్వతాలు బద్దలైన తర్వాత ఎల్‌ నిన్యో పరిస్థితులు నెలకొంటాయని ఆయన తెలిపారు. 20వ శతాబ్దంలో మూడు అగ్నిపర్వతాల విస్ఫోటం తర్వాత ఎల్‌ నిన్యో పరిస్థితులు నెలకొన్నాయని ఆయన తెలిపారు. ఇందులో ఆగుంగ్‌ పర్వతం 1963లో, ఎల్‌ చిచోన్‌ 1982లో, పినాటుబో పర్వతం 1991లో బద్దలయ్యాయి.

ఇదొక హెచ్చరిక

వాతావరణ మార్పులతో పసిఫిక్‌ వాకర్‌ సర్క్యులేషన్‌ ఎలా ప్రభావితం అవుతున్నదనేది అర్థం చేసుకుంటే పసిఫిక్‌ చుట్టూ ఉన్న దేశాలు, ప్రజలు అప్రమత్తమయ్యేందుకు, రాబోయే దశాబ్దాల్లో జరిగే విపరిణామాల సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.