Giant Sargassum Belt | మహా సముద్రంలో కొత్త పెను విపత్తు! సవాలు విసురుతున్న గ్రేట్ అట్లాంటిక్ సర్గాసం బెల్ట్!
ఆఫ్రికా పశ్చిమ తీరం నుంచి నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికో వరకూ సుమారు 8,500 కిలోమీటర్ల పొడవున ఏర్పడిన ‘గోధుమ రంగు రిబ్బన్’ ఇప్పుడు శాస్త్రవేత్తల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నది. సార్గాసం నాచు తో ఏర్పడిన సమూహం మితిమీరిన పెరుగుదలతో సముద్ర జీవవైవిధ్యం ప్రమాదంలో పడిందని చెబుతున్నారు.

Giant Sargassum Belt | ఏదైనా అవసరం మేరకే ఉండాలి. దానికి మించి పెరిగితే అనర్థం. సరిగ్గా ఇలాంటి పరిణామమే ఆఫ్రికా పశ్చిమ తీరం నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికో మధ్య చోటు చేసుకున్నది. సముద్రంలో కొత్త విపత్తు తలెత్తింది. అట్లాంటిక్ మహా సముద్రంలో ఆఫ్రికా పశ్చిమ తీరం నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికో వరకూ వ్యాపించిన భారీ ‘గోధుమ రంగు రిబ్బన్’ ఇప్పుడు శాస్త్రవేత్తలను కలవరపెడుతున్నది. సుమారు పదిహేనేళ్లుగా ఇది పెరుగుతూ వస్తున్నది. ఆకాశం నుంచి చూస్తే బ్రౌన్ కలర్ రిబ్బన్ మాదిరిగా ఉండే కారణంగా దీనికి ఈ పేరు స్థిరపడింది. నిజానికి సార్గాసం (sargassum) మొక్కల నాచు వంటి పదార్ధం. ఇది సముద్రంలోని జీవ వైవిధ్యానికే కాకుండా.. తీర ప్రాంతాల అభివృద్ధి, అక్కడి ప్రజల మనుగడను కూడా తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని చెబుతున్నారు. గత మే నెలలో తీసిన ఉపగ్రహ చిత్రం ఆధారంగా అది సుమారు 8,850 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉందని అంచనా వేశారు. సుమారు 3.75 లక్షల టన్నుల బరువు ఉంటుందని భావిస్తున్నారు. దీనిని గ్రేట్ అట్లాంటిక్ సర్గాసం బెల్ట్ (GASB) అని పిలుస్తున్నారు. దీనిని తొలిసారి 2011లో గుర్తించారు. అప్పటి నుంచి అది విపరీత స్థాయిలో పెరుగుతూ వస్తున్నది. ఇప్పుడు ఏకంగా అమెరికా ఖండానికి రెట్టింపు స్థాయిలో పేరుకుపోయింది.
ఏమిటిది?
ఇది సాధారణ కాలుష్యం తరహా కాదు. సముద్రంలో తేలియాడే సార్గాసం అనే మొక్కల భారీ సమూహం. నిజానికి ఇవి సముద్రంలోని జీవులకు ఆక్సిజన్ అందిస్తాయి. కానీ.. ఇది అతిగా పెరిగితే అనర్ధాలు ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటి వరకూ సముద్రంలో కనిపించిన అతిపెద్ద సార్గాసం బెల్ట్ ఇదే.
ఎందుకిలా పెరిగింది?
దీనికి కూడా మనుషులే కారణం అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. నదుల్లోకి విడుదల చేసే వ్యర్థ జలాలు, వ్యవసాయ భూములలోని ఎరువులు, ఇతర రసాయనాలను తీసుకుంటూ పారే నీటితోపాటు.. కర్బన్ ఉద్గారాలు, సముద్ర జలాల్లో నైట్రోజన్ పెరగడం వంటి కారణాలతో ఇవి మితిమీరిన స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రధానంగా అమెజాన్ నది నుంచి వచ్చే నీటిలో సర్గాసం పెరుగుదలకు కారణమైన జలాలు ఉంటున్నాయి.
నష్టాలేంటి?
ఈ గోధుమ పొర తేలుకుంటూ తేలుకుంటూ తీర ప్రాంతాలకు చేరుకుంటే ప్రమాదం భారీగానే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదుపు తప్పి పెరిగిన ఈ శైవలాలు.. వాతావరణ మార్పులకు కూడా కారణమవుతున్నాయని అంటున్నారు. ఈ మొక్కలు చనిపోయి, తీర ప్రాంతాల్లో పేరుకుపోతే భరించలేని దుర్వాసనతోపాటు.. వాటి నుంచి విషవాయువులు కూడా విడుదలవుతాయి. ఫలితంగా సముద్ర తీర పర్యాటక రంగం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. అది స్థానిక ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తుంది. మరోవైపు ఆ ప్రాంతంలోని జలాల్లో ఉండే జీవజాతులు ఊపిరి ఆడక చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కరీబియన్ దీవులు, ఫ్లారిడా తీర ప్రాంతాలతోపాటు గల్ఫ్ ఆఫ్ మెక్సికో వరకూ ఈ పొర వ్యాపించి ఉన్నది. వీటి నుంచి తీరాలకు కొట్టుకు వచ్చే వాటిని ఎప్పటికప్పుడు తొలగించేందుకు, తీర ప్రాంతాలను శుభ్రపరిచేందుకు స్థానిక ప్రభుత్వాలు ప్రత్యేక యంత్ర పరికరాలను సైతం ఉపయోగిస్తున్నా.. సమస్య అదుపులోకి రావడం లేదు. చిన్న మొత్తంలోనే కొట్టుకు వస్తున్నవాటిని శుభ్రం చేయడమే కష్టంగా మారితే.. ఒక్కసారిగా పెద్ద సమూహం తీరానికి వచ్చి.. మొక్కలు చనిపోతే.. పరిస్థితి ఊహించలేమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. సముద్రంలో ఏర్పడిన కొత్త విపత్తుగా దీనిని అభివర్ణిస్తున్నారు.