AsiaCup 2025 | పాకిస్తాన్‌తో ఫైనల్ పోరు –మూడోసారి తలపడనున్న చిరకాల ప్రత్యర్థులు
దాయాదుల పోరు మరోసారి రంగం సిద్ధమైంది. ఆసియాకప్ 2025 ఫైనల్ ప్రవేశించిన పాకిస్తాన్, భారత్‌ను మరోసారి ఢీకొనేందుకు రెడీ అయింది. సూపర్ 4 మ్యాచ్‌లో బంగ్లాను ఓడించిన పాక్ ఫైనల్లో అడుగుపెట్టింది.

దుబాయ్‌లో జరుగుతున్న ఆసియాకప్ 2025 పోటీల్లో నేడు జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో పాకిస్తాన్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్‌ను 135 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన బంగ్లా, అదే స్కోరును చేదించడంలో తడబడి ఫైనల్ అవకాశాలను చేజేతులారా చేజార్చుకుంది.
పాకిస్తాన్ విధించిన 136 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి బంగ్లా కూడా అష్టకష్టాలు పడింది. ఒకసారి గాడితప్పిన జట్టును ఎటువంటి పరిస్థితుల్లోనూ కోలుకోనివ్వకపోవడం పాకిస్తాన్‌కు బీఫ్‌తో పెట్టిన విద్య. ఆఫ్రిదీ, హరీస్ రౌఫ్‌లు నిప్పులు విసురుతూ, బంగ్లా బ్యాటర్లను వణికించారు. ఇద్దరూ చెరో 3 వికెట్లు తీసి బంగ్లా భరతం పట్టారు. చివరికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులకు పరిమితమైంది.
కాగా, టాస్ గెలిచి పాక్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన బంగ్లాదేశ్, నిప్పుల్లాంటి బంతులతో పాక్‌ను గడగడలాడించింది. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిన పాక్, కుంటుకుంటూ, దేక్కుంటూ మొత్తానికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేయగలిగింది.