మహిళా వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్ : కొత్త ఛాంపియన్​కు సుస్వాగతం

మహిళా వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌కి రంగం సిద్ధం. భారత్, సౌతాఫ్రికా మధ్య ఆదివారం జరిగే ఈ ఫైనల్‌లో కొత్త ప్రపంచ చాంపియన్ పుట్టబోతోంది. గత 20 ఏళ్లుగా సౌతాఫ్రికాపై భారత్ గెలవలేకపోయిన నేపథ్యంలో ఈ పోరాటం చరిత్రాత్మకం కానుంది.

  • By: ADHARVA |    sports |    Published on : Nov 01, 2025 11:55 PM IST
మహిళా వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్ : కొత్త ఛాంపియన్​కు సుస్వాగతం

India and South Africa set for a historic battle — a new world champion will rise at DY Patil Stadium

నవి ముంబయి డీవై పాటిల్ స్టేడియం ఆదివారం సాయంత్రం ఒక కొత్త చరిత్ర సాక్ష్యమవబోతోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు లేకుండా మహిళా వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగడం ఇదే మొదటిసారి. భారత్​ లేదా దక్షిణాఫ్రికాఈసారి ఒక కొత్త ప్రపంచ విజేతకు మహిళా క్రికెట్​ స్వాగతం పలుకుతోంది.

🇮🇳 భారత్🇿🇦 దక్షిణాఫ్రికా: కొత్త చరిత్ర రాయాలన్న తపన

ఈ టోర్నీ ప్రారంభంలో ఎవరూ ఊహించని ఫైనల్ కాంబినేషన్ ఇది. భారత్, సౌతాఫ్రికా — రెండు దేశాలూ ఈ దశాబ్దంలో మహిళా క్రికెట్‌కి కొత్త జీవం పోశాయి. కానీ ఇప్పుడు రెండూ ఒకే లక్ష్యం కోసం పోరాడబోతున్నాయి — అదే తమ మొదటి ప్రపంచ టైటిల్ గెలవడం.

భారత్ ప్రయాణం అంత సులభం కాదు. పాయింట్స్ టేబుల్‌లో అగ్ర జట్లను ఓడించకుండానే నాకౌట్ దశకు చేరినా, ఆ తరువాత ఊహించని విధంగా జట్టు పుంజుకుంది. సెమీఫైనల్లో ఏకంగా ఏడు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఆస్ట్రేలియాను మట్టికరిపించడంతో వారి ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతమైంది. జెమిమా రోడ్రిగ్స్ 127 పరుగులతో ఆడిన అజేయ ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానుల కళ్లలో మెరుపులు మెరిపిస్తూనేఉంది. ఆ ఇన్నింగ్స్ తర్వాత సోషల్ మీడియాలో ఒకే ఫీలింగ్​  — “ఇది నవ భారత జట్టు!”

భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందాన — వరల్డ్‌కప్ ఫైనల్‌లో జట్టుకు శుభారంభం అందించాలన్న సంకల్పంతో సిద్ధంగా ఉన్నది.

హర్మన్‌ప్రీత్ కౌర్ ఆధ్వర్యంలో భారత్ మూడు వరుస విజయాలతో రేపు మళ్లీ డీవై పాటిల్ మైదానానంలో అడుగుపెడుతోంది. ఇదే మైదానం ఇప్పుడు నాలుగోసారి వారికి ఆతిథ్యం ఇస్తోంది. పిచ్ ప్రవర్తన, మంచు, తేమ పరిస్థితులు, ప్రేక్షకుల హర్షధ్వానాలు — అన్నీ భారత్‌కి మిత్రపక్షాలే.

మరోవైపు, లారా వోల్వార్ట్ సారథ్యంలో సౌతాఫ్రికా జట్టు కూడా తన చరిత్రను తిరగరాసింది. 69, 97 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత పడిలేచిన ఆ జట్టు ఇప్పుడు ఫైనల్‌లో నిలబడింది అంటే అది కేవలం ప్రతిభ కాదు — ఆత్మస్థైర్యానికి నిదర్శనం. ఇంగ్లండ్‌పై 125 పరుగుల తేడాతో సాధించిన ఘనవిజయం వారి జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

నాడిన్ డి క్లర్క్ ఈ టోర్నీలో సంచలన ప్రదర్శన కనబరుస్తోంది. భారత్‌పై లీగ్ మ్యాచ్‌లో 84 నాటౌట్, మొత్తం టోర్నీలో 10 సిక్సర్లు, 136.69 స్ట్రైక్ రేట్ — ఇవన్నీ ఒక బ్యాటర్​ దూకుడును చూపిస్తున్నాయి. ఆమెతో పాటు మరిజానే కాప్, ట్రయన్, ఖాఖా — ఈ నలుగురు సౌతాఫ్రికా ఆటగాళ్లు ఫైనల్‌కు వచ్చేదారిలో ప్రతి మ్యాచ్‌లో సత్తా చాటారు.

గణాంకాలు విసురుతున్న సవాలుభారత్‌ 20 ఏళ్ల రికార్డు దాటగలదా?

సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ — ఈ టోర్నీలో 470 పరుగులతో అగ్రస్థానంలో నిలిచిన ఫార్మ్‌లో ఉన్న బ్యాటర్

భారత్ సౌతాఫ్రికాపై చివరిసారిగా వన్డే ప్రపంచకప్‌లో విజయం సాధించింది 2005లో. అప్పటి నుంచి 2017, 2022, 2025 మూడు వరుస వరల్డ్‌కప్‌లలో సౌతాఫ్రికానే గెలిచింది. అంటే ఈ ఫైనల్ భారత్‌కు కేవలం ఒక మ్యాచ్ కాదు — 20 ఏళ్ల మరకను చెరిపేసే యుద్ధం.

హెడ్ టు హెడ్ గణాంకాలు

  • మొత్తం మ్యాచ్‌లు: 34
  • భారత్ విజయాలు: 20
  • సౌతాఫ్రికా విజయాలు: 13
  • ఫలితం తేలనివి: 1
  • వరల్డ్‌కప్ పోరాటాలు:  6 – భారత్ 3 విజయాలు, సౌతాఫ్రికా 3 విజయాలు
  • గత వరల్డ్‌కప్‌లలో సౌతాఫ్రికా వరుసగా 3 విజయాలు

వ్యక్తిగత రికార్డులు

  • స్మృతి మందాన  : 19 మ్యాచ్‌ల్లో 929 పరుగులు (సగటు 51.61)
  • హర్మన్‌ప్రీత్ కౌర్   : 27 మ్యాచ్‌ల్లో 881 పరుగులు (సగటు 50.68)
  • లారా వోల్వార్ట్      : 21 మ్యాచ్‌ల్లో 806 పరుగులు (సగటు 40.30)
  • జులన్ గోస్వామి   : 34 వికెట్లు (ఇప్పటికే రిటైర్ అయినప్పటికీ భారత్ రికార్డు హోల్డర్)
  • మారుజాన్​ కాప్    : 24 వికెట్లు (ప్రస్తుత టోర్నీలో 12 వికెట్లు)

టోర్నీలో ముఖ్య గణాంకాలు

  • సౌతాఫ్రికా ఈ టోర్నీలో 31 సిక్సర్లు బాదింది — అత్యధికం
  • భారత్ జట్టు డీవై పాటిల్‌లో వరుసగా 3 విజయాలు సాధించింది
  • వోల్వార్ట్ ఇప్పటివరకు 470 పరుగులు, స్ట్రైక్ రేట్ 97.91 తో సాధించి టాప్​ స్కోరర్లలో మొదటిస్థానంలో ఉంది
  • స్మృతి మందాన 389 పరుగులు, 102.36 స్ట్రైక్ రేట్​తో టోర్నమెంట్​లో రెండో స్థానంలో ఉంది.
  • స్మృతి మందానకు దక్షిణాఫ్రికా మీద మంచి రికార్డుంది. 19 మ్యాచ్​లాడి, 3 సెంచరీలు, 5 అర్ధసెంచరీలతో 929 పరుగులు సాధించింది.
  • జెమిమా రోడ్రిగ్స్ సగటు 67, స్ట్రైక్ రేట్ 106.3తో అద్భుత ఫామ్‌లో ఉంది
  • దీప్తి శర్మ ఈ టోర్నీలో 17 వికెట్లు + 157 పరుగులు సాధించి ఆల్‌రౌండర్‌గా మెరుస్తోంది

 వర్షం కారణంగా మ్యాచ్​ రద్దయితే ఎవరు విజేత?

వాతావరణ శాఖ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 60 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రి వరకు వర్షం కొనసాగితే సోమవారం (రిజర్వ్ డే) ఆట కొనసాగుతుంది.

అయితే రెండు రోజుల్లోనూ మ్యాచ్ పూర్తికాకపోతే — ఐసీసీ నియమాల ప్రకారం ట్రోఫీ రెండు జట్లకు పంచబడుతుంది. అంటే భారత్ మరియు సౌతాఫ్రికా సంయుక్త విజేతలుగా నిలుస్తాయి.

పిచ్ పరిస్థితులు

నవి ముంబయి డీవై పాటిల్ స్టేడియం ఈసారి బ్యాట్స్‌మన్‌కి అనుకూలంగా ఉంది. సాయంత్రం డ్యూ కారణంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలర్లకు కష్టతరం అవుతుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది.

నిపుణుల అంచనా

భారత్​కు పరోక్షంగా కొంత మొగ్గు ఉంది — హోం కండిషన్లలో, అభిమానుల మద్దతుతో. కానీ సౌతాఫ్రికాకు వేగం, డెప్త్, పవర్ హిట్టింగ్ — ఇవన్నీ సమానంగా ఉన్నాయి.
పూర్తి మ్యాచ్ జరిగితే మాత్రం అది “మహిళా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫైనల్”గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

‌‌‌‌‌‌–––––––––––––––––––

భారత జట్టు (Team India)

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందాన, హార్లీన్ దేవల్​, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్), రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ్​ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, ఉమా ఛెత్రి, షఫాలీ వర్మ.

సౌతాఫ్రికా జట్టు (Team South Africa)

లారా వోల్వార్ట్ (కెప్టెన్), అయబోంగా ఖాఖా, క్లోయ్ ట్రయన్, నాడిన్ డి క్లర్క్, మరిజానే కాప్, టాజ్మిన్ బ్రిట్స్, సినాలో జాఫ్టా (వికెట్‌ కీపర్), నోంకులులెకో మ్లాబా, అన్నెరి డెర్క్‌సెన్, అన్నెకె బోష్, మసబటా క్లాస్, సునే లూస్, కరబో మేసో, టుమీ సెకుఖునే, నొండుమిసో శాంగాసే.