IND vs NZ 3rd ODI | భారత్​లో తొలి సిరీస్​ గెలిచిన కివీస్​ : ఆదుకోలేకపోయిన విరాట్​ సెంచరీ​

ఇండోర్‌లో జరిగిన నిర్ణాయక 3వ వన్డేలో న్యూజీలాండ్ 40 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. డారెల్ మిచెల్–గ్లెన్ ఫిలిప్స్ శతకాలతో 337 పరుగుల భారీ స్కోరు చేసిన కివీస్, సిరీస్‌ను 2–1తో చేజిక్కించుకుంది. విరాట్ కోహ్లీ శతకం, నితీశ్​, హర్షిత్ రాణాల హాఫ్ సెంచరీలు వృథా కాగా, భారత్ 296 పరుగులకు ఆలౌట్ అయింది. ఇది న్యూజీలాండ్‌కు భారత్​లో తొలి వన్డే సిరీస్ విజయం.

  • By: ADHARVA |    sports |    Published on : Jan 18, 2026 10:54 PM IST
IND vs NZ 3rd ODI | భారత్​లో తొలి సిరీస్​ గెలిచిన కివీస్​ : ఆదుకోలేకపోయిన విరాట్​ సెంచరీ​

IND vs NZ 3rd ODI: Virat Kohli’s century in vain as New Zealand seal historic series win in India

సారాంశం:
ఇండోర్ వన్డేలో డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ శతకాలతో న్యూజీలాండ్ చరిత్రాత్మక సిరీస్ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. భారత్ తరఫున కోహ్లీ అద్భుత శతకం, హర్షిత్ రాణా రెచ్చగొట్టే ఇన్నింగ్స్ ఉన్నా… చివరకు టీం ఇండియా 296 పరుగులకే కుప్పకూలింది. సిరీస్‌ను కివీస్ 2–1తో సొంతం చేసుకుంది.

 

విధాత క్రీడా విభాగం | 18 జనవరి 2026 | హైదరాబాద్​:

IND vs NZ 3rd ODI | భారత్​, న్యూజీలాండ్​ల మధ్య జరిగిన సిరీస్​ నిర్ణాయక 3వ వన్డేలో భారత్​ పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్​ చేసిన కివీస్​ 338 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఛేదనలో విఫలమైన భారత్​ 40 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సిరీస్​ 2 – 1 తేడాతో న్యూజీలాండ్​ చేజిక్కించుకుంది. భారత్​లో వారికేదే తొలి సిరీస్​ విజయం కాగా, ఇండోర్​లో భారత్​కిదే తొలి ఓటమి. ఛేజ్​మాస్టర్​ విరాట్​ కోహ్లీ సెంచరీ, హర్షిత్​ రాణా మెరుపు అర్థసెంచరీలు వృథా అయ్యాయి.

బ్యాట్లు వదిలేసిన భారత వీరులు

338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్​ ఆరంభంలో ఏమాత్రం పోటీనివ్వకుండా వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్​కు స్వర్గధామమైన ఇండోర్​ పిచ్​పై రోహిత్​శర్మ(11), కెప్టెన్​ శుభమన్​ గిల్​(23), శ్రేయస్​ అయ్యర్​(3), కేఎల్​ రాహుల్​(1) త్వరగానే అవుట్​ కాగా, కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేసాడు. 71 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో పడ్డ భారత్​ను నితీశ్​కుమార్​ రెడ్డి తన తొలి అర్థసెంచరీతో ఆదుకున్నాడు. నితీశ్​ (53)అవుటైన కాసేపటికే జడేజా(12) కూడా పెవిలియన్​ దారిపట్టడంతో, మళ్లీ కోహ్లీ ఒంటరివాడయ్యాడు. ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. 8వ వికెట్​గా క్రీజ్​లోకి వచ్చిన హర్షిత్​ రాణా ఊహించనివిధంగా రాణించాడు. కివీస్​ బౌలర్లను ఊచకోత కోస్తూ, గెలుపుపై మళ్లీ ఆశలు రేకెత్తించాడు. ఫోర్లు, సిక్స్​లతో బౌలర్లను దడదడలాడించిన రాణా అదే ఊపులో తన తొలి హాఫ్​ సెంచరీ కూడా చేసి, కివీస్​ ఆటగాళ్ల మొహాల్లో ఓటమి చూపించాడు. ఈలోపు తన 54వ వన్డే శతకం పూర్తి చేసుకున్న కోహ్లీ కూడా భారీ షాట్లకు దిగడంతో కావాల్సిన రన్​రేట్ మెల్లగా అదుపులోకి వస్తున్నట్లనిపించింది. కానీ, దురదృష్టవశాత్తు భారీ షాట్​ కొట్టబోయి, రాణా(52) అవుటవడంతో భారత్​ ఇక ఆశలు వదిలేసుకుంది. ఒక పక్క కోహ్లీ ఉన్నా, మరోపక్క వికెట్లు లేకపోవడంతో, ఓటమి తప్పలేదు. చివరికి 46 ఓవర్లలో 296 పరుగులకు ఇండియా అలౌట్​ అయింది. కోహ్లీ 124 పరుగులు చేసాడు.

ఇండోర్ వన్డేలో విరాట్ కోహ్లీ, హర్షిత్ రాణా పార్ట్‌నర్‌షిప్ సందర్భంగా ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుతున్న క్షణం

న్యూజీలాండ్​ బౌలర్లలో జాక్ ఫౌక్స్​, క్రిస్టియన్​ క్లార్క్​ చెరో 3 వికెట్లు తీసుకోగా, జేడెన్​ లెనాక్స్​ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతకుముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్​మన్ గిల్ న్యూజీలాండ్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించాడు. తన నిర్ణయం నిరూపిస్తూ, కివీస్​ 5 పరుగులకే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. మొదటి ఓవర్లోనే నికోల్స్​ వికెట్లను సున్నాకే గిరాటేయగా, రెండో ఓవర్లో మరో ఓపెనర్​ డియాన్​ కాన్వే హర్షిత్​రాణా బౌలింగ్​లో స్లిప్​లో రోహిత్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఇద్దరి స్థానాలను ఆక్రమించిన డెరెల్​ మిచెల్​, విల్​ యంగ్​ కాసేపు నెమ్మదిగా ఆడి కుదురుకున్నారు. జట్టు స్కోరు 58 పరుగుల వద్ద యంగ్​ను హర్షిత్​ పెవిలియన్​కు పంపగా, వచ్చిన గ్లెన్​ ఫిలిప్స్​ మిచెల్​తో జతకలిసాడు.

ఇక అక్కన్నుంచి భారత్​కు ఏదీ కలిసిరాలేదు. గత రెండు మ్యాచ్​లలో వరుసగా 84, 131 పరుగులు చేసి మంచి ఊపు మీదున్న మిచెల్​ ఈ మ్యాచ్​లోనూ అస్సలు తగ్గలేదు. భారత్​తో ఆడిన గత 7 మ్యాచ్​లలో నాలుగు సెంచరీలు, 2 హాఫ్​ సెంచరీలు చేసిన మిచెల్​ ఈ మ్యాచ్​లోనూ అదరగొట్టాడు. హోల్కర్ స్టేడియంలోని పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై కివీస్ బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు. డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) అద్భుత శతకాలతో చెలరేగడంతో 337/8తో భారీ స్కోరు నమోదు చేసింది.

న్యూజీలాండ్ భారీ స్కోరు; మిచెల్–ఫిలిప్స్ శతకాల హోరు

డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ ఇండోర్ వన్డేలో శతకాల భాగస్వామ్యంతో మెరుస్తున్న సమయంలో తీసిన ఫోటో; న్యూజీలాండ్ బ్లాక్ జెర్సీతో బ్యాటర్లు క్రీజ్‌లో కనిపిస్తున్న దృశ్యం.

ముఖ్యంగా డారెల్​ మిచెల్​కు భారత్​ స్వర్గధామంగా మారింది. తను చేసిన రెండు శతకాలు భారత్​పైనే కావడం విశేషం. మరో వైపు గ్లెన్ ఫిలిప్స్ కూడా నెమ్మదిగా మొదలుపెట్టి తరువాత వేగంగా పెంచాడు. ఈ క్రమంతో తన రెండో వన్డే శతకాన్ని సాధించిన ఫిలిప్స్​, . తొలి బౌండరీ కోసం 37 బంతులు తీసుకున్నప్పటికీ, క్రీజులో స్థిరపడిన క్షణం నుంచి దూకుడుగా ఆడి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. మిచెల్–ఫిలిప్స్ జోడీ 219 పరుగుల భారీ భాగస్వామ్యంతో న్యూజీలాండ్‌ను కష్టస్థితి నుంచి  పటిష్టస్థితికి చేర్చారు. నాలుగో వికెట్​కు ఇదే కివీస్​కు  అత్యుత్తమ వన్డే భాగస్వామ్యం.

చివరి దశలో భారత్ వికెట్లు సాధించినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అర్షదీప్ సింగ్ 3 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండాపోయిది. స్పిన్నర్లకు పెద్దగా సహకారం దక్కకపోవడంతో కివీస్​ దూకుడును ఆపడంలో విఫలమయ్యారు. చివరికి నిర్ణీత 50 ఓవర్లలో న్యూజీలాండ్​ 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇది ఇండోర్ స్టేడియంలోనే అత్యధిక స్కోరు.

సంక్షిప్త స్కోర్లు:

న్యూజీలాండ్​: 8 వికెట్లకు 337 పరుగులు – డారెల్​ మిచెల్​ 137 పరుగులు(131  బంతులు, 3 సిక్స్​లు, 15 ఫోర్లు), గ్లెన్​ ఫిలిప్స్​ 106 పరుగులు(88 బంతులు, 3 సిక్స్​లు, 9 ఫోర్లు) – ఇండియా బౌలింగ్​ : అర్షదీప్​సింగ్​ 3 వికెట్లు, హర్షిత్​ రాణా 3 వికెట్లు

భారత్​: 46 ఓవర్లలో 296 పరుగులు – విరాట్​ కోహ్లీ 124 పరుగులు(108 బంతులు, 3 సిక్స్​లు, 10 ఫోర్లు), నితీశ్​కుమార్​ రెడ్డి 53 పరుగులు(57 బంతులు, 2 సిక్స్​లు, 2 ఫోర్లు), హర్షిత్​ రాణా 52 పరుగులు(43 బంతులు, 4 సిక్స్​లు, 4 ఫోర్లు) – న్యూజీలాండ్​ బౌలింగ్​: జాక్ ఫౌక్స్​ 3 వికెట్లు, క్రిస్టియన్​ క్లార్క్ 3 వికెట్లు.

ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​: డారెల్​ మిచెల్​ – 137 పరుగులు

ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్: డారెల్​ మిచెల్​ – 352 పరుగులు