Women Cricket World cup | శ్రీలంకలో భారత్‌ సింహగర్జన :  పాకిస్థాన్‌పై హర్మన్‌ సేన ఘనవిజయం

భారత్‌ మహిళల జట్టు పాకిస్థాన్‌పై మరోసారి విజయం సాధించింది. 247 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన పాకిస్థాన్‌ 159 పరుగులకే ఆలౌట్‌. క్రాంతి గౌడ్‌, దీప్తి శర్మ చెరో 3 వికెట్లు, రిచా ఘోష్‌ 35 పరుగులతో మెరిసారు.

Women Cricket World cup | శ్రీలంకలో భారత్‌ సింహగర్జన :  పాకిస్థాన్‌పై హర్మన్‌ సేన ఘనవిజయం

India Beat Pakistan By 88 Runs In Women’s World Cup 2025

కొలంబో, అక్టోబర్‌ 5 (విధాత‌):

పురుషులదైనా, మహిళలదైనా, భారత్‌–పాకిస్థాన్‌ క్రికెట్​ మ్యాచ్​లు ఎప్పుడూ ఉత్కంఠకు పర్యాయపదం.  అందునా ప్రపంచకప్​ అయితే ఇక సమరమే. మహిళాప్రపంచకప్​ మ్యాచ్​లో ఈసారి కూడా అదే జరిగింది. కానీ చివరికి చిరునవ్వులు ఎప్పటిలాగే భారత మహిళలవే. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన మరోసారి చరిత్రను పునరావృతం చేస్తూ పాకిస్థాన్‌ను 88 పరుగుల తేడాతో ఓడించి, మహిళల వన్డేల్లో  పాకిస్తాన్​పై 12–0తో విజయాల రికార్డును మెరుగుపరుచుకుంది.

పిచ్​ కఠినం – స్కోరు గగనం

టాస్​ ఓడి మొదట బ్యాటింగ్​ చేసిన భారత్‌ 247 పరుగుల స్కోరు సాధించి, అనంతరం క్రాంతి గౌడ్‌ బౌలింగ్‌ మాయతో పాకిస్థాన్‌ను 159 పరుగులకే కుప్పకూల్చింది. మ్యాచ్‌ మొత్తం ఉత్కంఠభరితంగా సాగినప్పటికీ, చివరి క్షణాల్లో టీమిండియా​ ఆధిపత్యం చలాయించి విజయాన్ని సొంతం చేసుకుంది.

టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ ఫాతిమా సనా బౌలింగ్‌ ఎంచుకోవడంతో భారత్‌ మొదట బ్యాటింగ్‌ చేసింది. కొలంబోలోని ఆర్‌. ప్రేమదాస స్టేడియం పిచ్‌ బ్యాటింగ్‌కి సవాలుగా ఉండగా, స్మృతి మంధానా, ప్రతీకా రావల్‌ జంట ఆరంభంలో కొంత కష్టపడింది. స్మృతి 23 పరుగులు చేసి ఎల్‌బీడబ్ల్యూ అవగా, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కూడా పెద్ద స్కోరు చేయలేకపోయింది. మధ్య ఓవర్లలో హర్లీన్‌ దియోల్‌ (46) బలమైన ఇన్నింగ్స్‌ నిర్మించి జట్టును నిలబెట్టింది. జెమిమా రోడ్రిగ్స్‌ (32) సహకారం ఇచ్చినా, పాకిస్థాన్‌ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, భారత్​ బ్యాటింగ్​ జోరుకు అడ్డుకట్ట వేసారు. ఆఖర్లో  మైదానంలోకి వచ్చిన రిచా ఘోష్‌ మ్యాచ్‌ దిశనే మార్చింది.

8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిచా ఘోష్‌ తన అద్భుత షాట్లతో ప్రేక్షకులను అలరించింది. కేవలం 20 బంతుల్లో 35 పరుగులు – రెండు సిక్సర్లు, మూడు బౌండరీలు సాధించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించింది. దాంతో భారత్‌ స్కోరు సరిగ్గా 50 ఓవర్లకు 247కి ఆలౌట్​ అయింది.

ఇది మహిళల వన్డేల్లో 50+ భాగస్వామ్యం లేకుండా సాధించిన అత్యధిక స్కోర్‌గా రికార్డు సృష్టించింది. హర్లీన్‌–రిచా జంట ఇన్నింగ్స్‌ చివరి దశలో అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించారు.

వింత అంతరాయం – కీటకాలతో పోరాడిన ఆటగాళ్లు!

ఒకేసారి రెండు ఆటలు : అటు బ్యాట్​తో, ఇటు కీటకాలతో. భారత్​, పాక్​ మ్యాచ్​ సందర్భంగా కీటకాల దండు మైదానంలోకి దాడి చేసాయి. దాంతో కాసేపు ఆట నిలిపివేసారు

ఒకేసారి రెండు ఆటలు : అటు బ్యాట్​తో, ఇటు కీటకాలతో. భారత్​, పాక్​ మ్యాచ్​ సందర్భంగా కీటకాల దండు మైదానంలోకి దాడి చేసాయి.

మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌ మధ్యలో అకస్మాత్తుగా స్టేడియం అంతా కీటకాలు దండు దాడి చేశాయి.  దాంతో ఆడుతున్న ఆటగాళ్లు అసౌకర్యానికి గురై, మ్యాచ్‌ను 15 నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. తరువాత మైదానాన్ని పూర్తిగా ఫ్యుమిగేట్‌ చేయగా ఆట పునఃప్రారంభమైంది. ఆ అడ్డంకి తర్వాత కూడా భారత బ్యాటర్లు కూల్‌గా వ్యవహరించి ఇన్నింగ్స్‌ను 247 వద్ద ముగించారు.

క్రాంతి గౌడ్‌ మ్యాజిక్​ బౌలింగ్‌ –  కూలిన పాకిస్థాన్‌ బ్యాటింగ్‌

భారత్​ విధించిన 248 పరుగుల లక్ష్యాన్ని సాధించడానికి బరిలో దిగిన పాకిస్థాన్‌ మొదటి నుంచే ఒత్తిడిలో పడింది. ఓపెనర్‌ మునీబా అలీ ఒక వింత రన్‌ అవుట్‌లో వెనుదిరగడం మ్యాచ్‌లో వివాదానికి దారి తీసింది. తర్వాత గౌడ్‌ తన మార్మిక స్పిన్‌తో పాకిస్థాన్‌ మిడిలార్డర్​ను తీవ్రంగా దెబ్బతీసింది.  ఆమె 3 వికెట్లు తీసి మ్యాచ్‌లో భారత్‌ ఆధిపత్యానికి బాటలువేసింది. తర్వాత వంతు దీప్తి శర్మది. తనూ చివర్లో 3 వికెట్లు తీసి, పాక్​ పతనాన్ని శాసించింది. స్నేహ్‌ రాణా రెండు వికెట్లతో ఆకట్టుకుంది. ఫాతిమా సనా (25), అలియా రియాజ్‌ (33) కొంత ప్రతిఘటన ఇచ్చినా,  పాకిస్తాన్​ ఏ దశలోనూ లక్ష్యం దిశగా పయనించలేదు. మొత్తం జట్టు 159 పరుగులకే ఆల్‌ అవుట్‌ అయింది.

టాస్‌ సమయంలో హర్మన్‌ప్రీత్‌, ఫాతిమా సనా మధ్య హ్యాండ్‌షేక్‌ జరగకపోవడం ప్రారంభంలో చర్చనీయాంశమైంది. కానీ ఆట ముగిసేసరికి భారత సైన్యం దేశం ముఖంలో చిరునవ్వులు మెరిపించింది. భారత్‌ మహిళల జట్టు ఇప్పుడు పాకిస్థాన్‌పై మహిళల వన్డే విజయాల్లో  12–0 ఆధిక్యం సాధించింది — ఇది ప్రపంచకప్‌ చరిత్రలో ఏకైక రికార్డు.

సోషల్‌ మీడియా అంతా #INDvPAKW హ్యాష్‌ట్యాగ్‌లతో నిండిపోయింది. అభిమానుల ఆనందానికి అడ్డే లేకుండాపోయింది.
“12–0 is not rivalry, it’s domination!” అంటూ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయంతో రెండు విజయాలు, 4 పాయింట్లతో టీమిండియా టేబుల్ టాపర్​గా నిలిచింది.