T20 World Cup Ind Vs USA అమెరికాపై భారత్ అలవోక విజయం
భారత్ ఒక మ్యాచ్ మిగిలుండగానే సూపర్–8(India in Super-8)లోకి ప్రవేశించింది. నేడు ఇక్కడ అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది..6 పాయింట్లతో సూపర్8లో ఎంటరయింది

న్యూయార్క్: భారత్ ఒక మ్యాచ్ మిగిలుండగానే సూపర్–8(India in Super-8)లోకి ప్రవేశించింది. నేడు ఇక్కడ అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. లో స్కోరింగ్ మ్యాచ్‌ల టోర్నీ(Low Scoring Tourney)గా మారిన ఈ ప్రపంచకప్‌లో మరో మ్యాచ్ అదే దారిలో పయనించింది. మూడు మ్యాచ్‌లో 6 పాయింట్లతో సూపర్8లో ఎంటరయింది. సూపర్8లో చేరిన తొలిజట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది.
పురుషుల టి20 ప్రపంచకప్(Mens T20 Cricket World Cup) లో భాగంగా న్యూయార్క్ నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం(Nassau County International Cricket Stadium) లో జరిగిన మ్యాచ్‌లో భారత్, అమెరికా తలపడగా, భారత్ 7 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. బౌలర్లకు స్వర్గధామంగా మారిన ఈ పిచ్‌పై టాస్ గెలిచి ఆనవాయితీ ప్రకారం, అమెరికాను బ్యాటింగ్‌కు దింపిన ఇండియా సరైన ఫలితాలను రాబట్టింది. ఇన్నింగ్స్ మొదటి బంతికి వికెట్‌ను బలి తీసుకున్న అర్షదీప్ సింగ్(Arshdeep Singh), ఇన్నింగ్స్ ఆసాంతం అదేపని మీద ఉన్నాడు. అయితే అమెరికా కూడా అంత తేలిగ్గా ఏమీ లొంగలేదు. తక్కువ స్కోరు చేసారన్న మాటే గానీ, భారత బౌలింగ్‌ను పద్ధతిగానే ఎదుర్కోగలిగారు. ఒక్క అర్షదీప్ బౌలింగ్‌లోనే కష్టపడాల్సివచ్చిందిగానీ, మిగతా బౌలర్ల బంతులను స్వేచ్ఛగా ఆడారు. భారత స్టార్ బౌలర్ బుమ్రా, సిరాజ్, అక్షర్‌లను ఓ రేంజ్లో ఆడుకున్నారు. మళ్లీ హార్థిక్ పాండ్యా బౌలింగ్ వారికి అర్థం కాకుండాపోయి, రెండు వికెట్లు సమర్పించుకున్నారు.
నితీశ్ కుమార్(27), స్టీవెన్ టేలర్(24)లే టాప్ స్కోరర్లు. నిర్ణీత 20 ఓవర్లలో యుఎస్ఏ 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగలిగింది. పవర్‌ప్లేలో అమెరికా స్కోరు 3 వికెట్లకు 18 పరుగులు. ఈ పరిస్థితి చూస్తే 50 పరుగులైనా చేస్తుందా అనే అనుమానాన్ని పటాపంచలు చేస్తూ 100 పరుగులు దాటగలిగింది. బౌలింగ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన సిరాజ్ ఓ కళ్లుచెదిరే క్యాచ్(Siraj magical catch) మాత్రం పట్టి పరువు నిలబెట్టుకున్నాడు.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ రికార్డ్ బౌలింగ్(4–0–9_4)తో 4 వికెట్లు తీసుకోగా, పాండ్యా రెండు, అక్షర్ ఒక వికెట్ తీసారు. ఈ మ్యాచ్ ద్వారా అర్షదీప్ రవిచంద్రన్ అశ్విన్ నెలకొల్పిన రికార్డు బద్దలు కొట్టాడు. టి20 ప్రపంచకప్‌లో భారత అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనగా ఇది నిలిచింది.
తదుపరి ఛేదనకు దిగిన భారత్, తొలి ఓవర్లోనే కోహ్లీ వికెట్ కోల్పోయింది. ఆనవాయితీని పాటిస్తూ, విరాట్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. జరిగిన, ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లీ వరుసగా 1, 4, 0 పరుగులు మాత్రమే చేసాడు. తనెదుర్కున్న తొలి బంతినే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనక్కి తిరిగాడు. జట్టు స్కోరు 15 పరుగులున్నప్పుడు కెప్టెన్ రోహిత్ కూడా అవుటయ్యాడు. తర్వాత పంత్, సూర్యకుమార్‌లు జాగ్రత్తగా ఆడినా, 44 పరుగుల వద్ద పంత్ పెవిలియన్ చేరాడు. సూర్యతో జతకలిసిన దూబే నిలదొక్కుకోవడానికి చాలా టైమ్ తీసుకున్నా, తరువాత జాగ్రత్తగా ఆడాడు. వీరిద్దరూ మరో వికెట్ నష్టపోకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. 4 వికెట్‌కు 67 పరుగులు జత చేసిన ఈ జంటలో సూర్యకుమార్ అర్ధసెంచరీ(50 పరుగులతో నాటౌట్: 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో రాణించగా, దూబే (35 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్: 1 ఫోర్, 1 సిక్స్) పరుగులతో మెరిసాడు. అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్ 2 వికెట్లు తీసుకోగా, ఒక వికెట్ అలీ ఖాన్ తీసాడు.