భారత్‌కు నాలుగో కాంస్యం అందించిన హాకీ వీరులు
ఒలింపిక్స్ హాకీలో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత హాకీ జట్టు వీరవిహారం చేసింది. విశ్వ క్రీడల్లో దేశానికి నాలుగో కాంస్య పతకం అందించింది. గురువారం స్పెయిన్‌తో హోరాహోరీగా సాగిన పోరులో భారత్ 2-1తో ఘనవిజయం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.
ప్యారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్–2024(Olympics 2024)లో భారత హాకీ జట్టు(India Hockey team) కాంస్యం కోసం జరిగిన పోరులో స్పెయిన్(Spain)పై ఘనవిజయం సాధించి, దేశానికి నాలుగో పతకాన్ని బహుకరించింది. ఒకదశలో 1-0తో వెనకబడిన భారత జట్టు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (Hamanpreet Singh) చేసిన రెండు వరుస గోల్స్‌తో స్పెయిన్‌ను వణికించింది. చివర్లో ప్రత్యర్థి రెండు గోల్ యత్నాలను అడ్డుకొని ఇండియా చిరస్మరణీయ విజయంతో కాంస్యాన్ని(Won Bronze medal) చేపట్టింది. ఆఖరి ఒలింపిక్స్ ఆడుతున్న గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్(PR Sreejesh)కు పతకంతో ఘనమైన వీడ్కోలు పలికింది.
ఈ ఒలింపిక్స్‌లో మొదటినుంచీ దూకుడుగా ఆడి గెలిచిన భారత హాకీ జట్టు , కాంస్యం కోసం కూడా అలాగే చెలరేగిపోయింది. స్పెయిన్ గోల్ ప్రయత్నాలను సమర్ధవంతంగా అడ్డుకొని, విజయ పతకాన్ని దక్కించుకున్న భారత జట్టు తన ప్రదర్శనతో యావత్ దేశాన్ని సంతోషంలో ముంచెత్తింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గురి తప్పకుండా గోల్స్ కొట్టగా, డిఫెన్స్ టీమ్ స్పెయిన్ ఆటగాళ్ల ఎత్తులను చిత్తు చేసింది. గ్రేట్ వాల్ శ్రీజేష్ షరామాములుగానే పోస్ట్‌వైపు దూసుకొస్తున్న ప్రత్యర్థి బంతులను మెరుపువేగంతో అడ్డుకొని తన జట్టు విజయంలో భాగమయి, సుదీర్ఘ కెరీర్‌ను ఒలింపిక్ విజేతగా ముగించాడు.

తొలి అర్ధ భాగంలో స్పెయిన్ ఆటగాడు మార్క్ మిరల్లెస్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి, భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే, కాసేపట్లో ఫస్ట్ హాఫ్ ముగుస్తుందనగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఓ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి స్కోరును సమం చేసాడు. అనంతరం రెండో అర్ధభాగం మొదలవ్వగానే భారత సారథి మళ్లీ మరో పెనాల్టీ కార్నర్‌ను స్పెయిన్ గోల్ కీపర్ కళ్లుగప్పి గోల్‌గా మార్చాడు. దీంతో భారత జట్టు 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత భారత రక్షణదళం స్పెయిన్ ఫార్వర్డ్స్‌ను సమర్ధంగా అడ్డుకున్నారు. మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా స్పెయిన్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. ఒక్కసారిగా భారతీయుల గుండెలు లబలబలాడాయి కానీ, భారత గోల్‌కీపర్ శ్రీజేష్ బంతి దిశను తెలివిగా అంచనా వేసి అడ్డుకున్నాడు. అంతే.. ఆనందం అంబరమైంది. నాలుగో కాంస్య పతకంతో దేశం యావత్తూ సంబరాల్లో మునిగితేలింది.
ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో భారత జట్టు అద్భుత విజయాలతో దూసుకెళ్లింది. టీం టోర్నమెంట్ ఆసాంతం ఆశావహ దృక్పథంతో ఆడింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో( Pre-quarter Final) 52 ఏండ్ల తర్వాత ఆస్ట్రేలియా(Australia)ను 3-2తో ఓడించి, ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. అనంతరం క్వార్టర్స్ ఫైనల్లో బ్రిటన్(Great Britain)తో స్కోర్లు సమం కాగా పెనాల్టీ షూటౌట్(Penalty Shootout)లో 4-2తో ఇంగ్లీష్ టీంపై సంచలన విజయం సాధించి, వారితో కన్నీళ్లు పెట్టించి మరీ సెమీఫైనల్(into the Semis)కు దూసుకెళ్లింది. అయితే, ఈసారి స్వర్ణం(Gold) ఖాయమనుకున్న భారతీయుల ఆశలకు గండికొడుతూ టీమిండియాకు జర్మనీ(Germany) చెక్ పెట్టి, టోక్యో ఒలింపిక్స్ లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. సెమీఫైనల్లో జర్మనీ చేతుల్లో 3-2తో ఓటమిపాలైన ఇండియా కాంస్యపతకం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.

భారత జట్టు విజయంపై ప్రధాని మోదీ(Prime Minister Modi) సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా భారత్‌కు మరో విజయమని ట్వీట్ చేశారు.
“భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇది మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం. ఈ విజయం వారి నైపుణ్యం, పట్టుదల, జట్టు స్ఫూర్తికి చిహ్నం. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ప్రదర్శన చేశారు. భారత హాకీ బృందం స్ఫూర్తిని చాటింది. ప్రతి భారతీయుడికి హాకీతో భావోద్వేగానుబంధం ఉంది. ఈ విజయం భారత యువతలో హాకీని మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుంది. క్రీడాకారులందరికీ అభినందనలు” అంటూ అభినందనలు తెలిపారు.
ఇంకా దేశంలోని ఇతర ప్రముఖుల నుండి జట్టుకు అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram