IND vs ZIM | నాలుగో టీ20లోనూ భారత్ ఘన విజయం.. సిరీస్‌ను గెలుచుకున్న గిల్ సేన
IND vs ZIM | ఓటమితో జింబాబ్వే పర్యటనను ప్రారంభించిన భారత క్రికెట్ జట్టు.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. నాలుగో మ్యాచ్‌లో శుభ్‌మన్ సేన 10 వికెట్ల తేడాతో ఆతిథ్య జింబాబ్వే జట్టును చిత్తు చేసింది.

IND vs ZIM : ఓటమితో జింబాబ్వే పర్యటనను ప్రారంభించిన భారత క్రికెట్ జట్టు.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. నాలుగో మ్యాచ్‌లో శుభ్‌మన్ సేన 10 వికెట్ల తేడాతో ఆతిథ్య జింబాబ్వే జట్టును చిత్తు చేసింది. జింబాబ్వే బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ ఓపెనర్లు చెలరేగిపోయారు. మొదట భారత బౌలర్లు జింబాబ్వేను ఓ మోస్తరు స్కోరుకే కట్టడి చేయగా.. తర్వాత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఒక్క వికెట్ కూడా ఇవ్వకుండా మరో 28 బంతులుండగానే లక్ష్యాన్ని ఛేదించారు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు యశస్వి జైస్వాల్‌కు దక్కింది. జైస్వాల్ (93 నాటౌట్; 53 బంతుల్లో 13×4, 2×6), శుభ్‌మన్ గిల్ (58 నాటౌట్; 39 బంతుల్లో 6×4, 2×6) రెచ్చిపోవడంతో 153 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది. మొదట జింబాబ్వే 7 వికెట్లకు 152 పరుగులు సాధించింది. కెప్టెన్ సికందర్ రజా (46; 28 బంతుల్లో 2×4, 3×6) టాప్‌స్కోరర్. మరుమాని (32), మధెవెర్ (25) కూడా రాణించారు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ (2/32), అభిషేక్ శర్మ (1/20), శివమ్ దూబె (1/11) ఆకట్టుకున్నారు. సిరీస్‌లో చివరిదైన ఐదో మ్యాచ్ ఆదివారం జరుగుతుంది.
తొలి టీ20లో కేవలం 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఓపెనర్లు ఆచితూచి ఆడతారనే అనిపించింది. కెప్టెన్ శుభ్‌మన్ మాత్రమే అలా ఆడాడు. మరో ఎండ్‌లో యశస్వి మాత్రం ఆరంభం నుంచే చెలరేగిపోయాడు. ఎంగరవ వేసిన తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి జట్టుకు ధనాధన్ ఆరంభాన్నిచ్చిన జైస్వాల్.. తర్వాత ప్రతి బౌలర్‌కూ బౌండరీలతోనే స్వాగతం పలికాడు. 7 ఓవర్లకు భారత్ 71 పరుగులు చేస్తే అందులో 56 పరుగులు యశస్వి చేసినవే. 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన యశస్వికి సెంచరీ చేసే అవకాశం దక్కలేదు.