Abhishek Sharma Hospitalised | ఆస్పత్రిలో చేరిన అభిషేక్ శర్మ.. నమీబియా మ్యాచ్‌కు దూరం!

కడుపు ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరిన అభిషేక్ శర్మ నమీబియాతో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. శాంసన్‌కు అవకాశం, బుమ్రా రీ ఎంట్రీతో టీమిండియా బలంగా మారిన నేపథ్యంలో నమీబియాతో పోరు ఆసక్తికరంగా మారింది.

  • By: ADHARVA |    sports |    Published on : Feb 11, 2026 5:19 PM IST
Abhishek Sharma Hospitalised | ఆస్పత్రిలో చేరిన అభిషేక్ శర్మ.. నమీబియా మ్యాచ్‌కు దూరం!

Abhishek Sharma Hospitalised, Doubtful for India vs Namibia T20 World Cup Match

ముఖ్యాంశాలు

కడుపు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో నమీబియాతో జరిగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో అతని పాల్గొనడం అనుమానంగా మారింది. అభిషేక్ కోలుకోకపోతే శాంసన్‌కు అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. అదే సమయంలో బుమ్రా, సుందర్ జట్టులో చేరడంతో భారత్ బలం మరింత పెరిగింది.


విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​:

Abhishek Sharma Hospitalised | టీమిండియా ఓపెనర్ అభిషేక్​ శర్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం జట్టులో ఆందోళనకు కారణమైంది. కడుపులో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న అభిషేక్ గత రెండు రోజులుగా ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. దీంతో నమీబియాతో జరగనున్న కీలక టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో అతని పాల్గొనడం అనిశ్చితంగా మారింది.

బీసీసీఐ వర్గాలు, ప్రముఖ మీడియా కథనాల ప్రకారం ప్రస్తుతం అతనికి పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా కోలుకోకపోతే జట్టు కాంబినేషన్‌లో మార్పులు తప్పవని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత అతను ఫీల్డింగ్‌కు కూడా రాకపోవడం ఈ పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.

ఆస్పత్రిలో చికిత్స.. ఫిట్‌నెస్‌పై వైద్యుల పర్యవేక్షణ

అభిషేక్‌కు గత కొద్ది రోజులుగా కడుపు సమస్యతో పాటు జ్వరం కూడా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌కు ముందే అతనికి అస్వస్థత ఉన్నప్పటికీ జట్టులో కొనసాగాడు. కానీ మ్యాచ్ అనంతరం పరిస్థితి మరింత దిగజారడంతో ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది.

ఈ విషయాన్ని BCCIకి చెందిన వర్గాలు ధృవీకరించాయి. అభిషేక్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నామనీ, పూర్తిగా కోలుకునే వరకు అతనిపై ఒత్తిడి పెంచే ఆలోచన లేదని అధికారులు తెలిపారు. అలాగే అసిస్టెంట్ కోచ్ ర్యాన్​ టెన్​ డోషాటె(Ryan ten Doeschate) కూడా మీడియాతో మాట్లాడుతూ, అభిషేక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు కానీ అతను త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో జట్టుతో కలుస్తాడని అశిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్ అభిషేన్​ కోలుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

శాంసన్‌కు మళ్లీ అవకాశం..? ఓపెనింగ్‌ జోడీపై చర్చ

Sanju Samson likely replacement for Abhishek Sharma in India vs Namibia T20 World Cup 2026 match

అభిషేక్ శర్మ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే, ఓపెనర్‌గా సంజూ శాంసన్​ బరిలో దిగే అవకాశముంది. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్‌లో అతని ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోయినా, ప్రస్తుత పరిస్థితుల్లో అతడే ప్రధాన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. కోచింగ్ స్టాఫ్ అభిప్రాయం ప్రకారం, జట్టు సమతుల్యత దెబ్బతినకుండా సరైన కాంబినేషన్‌ను ఎంపిక చేయడమే లక్ష్యంగా ఉంది.
“మా ముందున్న ప్రతి మ్యాచ్ చాలా కీలకం. అందుకే ప్రతి ఆటగాడి ఫిట్‌నెస్, ఫామ్‌ను బట్టి నిర్ణయాలు తీసుకుంటాం” అని టెన్ డోషాటె తెలిపారు. మ్యాచ్ జరగనున్న వేదిక ఢిల్లీ అరుణ్​ జైట్లీ స్టేడియం కావడంతో అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. ఢిల్లీ ప్రేక్షకుల ముందు టీమిండియా పూర్తి స్థాయిలో బరిలోకి దిగాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.

బుమ్రా రీ ఎంట్రీ.. సుందర్ చేరికతో బలపడిన భారత జట్టు

Jasprit Bumrah and Washington Sundar return to India squad ahead of Namibia T20 World Cup clash

అభిషేక్ అనారోగ్యం ఒకవైపు నిరాశ కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు కొన్ని శుభవార్తలు టీమిండియాకు ఊరటనిస్తున్నాయి. పేస్ దళాధిపతి జస్​ప్రీత్​ బుమ్రా అనారోగ్యం నుంచి కోలుకొని నెట్స్‌లో పూర్తి స్థాయిలో సాధన చేస్తున్నాడు. అతను నమీబియా మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆల్‌రౌండర్ వాషింగ్టన్​ సుందర్​ గాయం నుంచి కోలుకుని జట్టులో చేరాడు. నెట్స్‌లో బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ పాల్గొనడంతో జట్టు సమతుల్యత మరింత మెరుగైంది.

గత మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్​ యాదవ్​ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించడంపై శిక్షణాసిబ్బంది సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఫామ్ కొనసాగితే, అభిషేక్ లేకున్నా భారత్‌కు మంచి అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

మొత్తంగా చూస్తే, అభిషేక్ శర్మ ఆరోగ్య పరిస్థితిపైనే టీమిండియా తదుపరి మ్యాచ్ భవితవ్యం ఆధారపడి ఉంది. అతను సమయానికి కోలుకుంటే జట్టుకు భారీ బలం చేకూరనుంది. లేకపోతే శాంసన్‌కు మరో అవకాశం లభించనుంది. అదే సమయంలో బుమ్రా, సుందర్ చేరికతో భారత్ బౌలింగ్, ఆల్‌రౌండింగ్ విభాగాలు బలపడటం శుభపరిణామంగా మారింది.