Aman Sehrawat | భారత ఆశలు సజీవంగా నిలిపిన రెజ్లర్‌ అమన్‌ షెరావత్‌

భారత స్వర్ణ ఆశాకిరణం వినేశ్‌ ఫొగట్‌ అనర్హతకు గురై నిరాశలో ఉన్న భారతదేశానికి యువ రెజ్లర్‌ అమన్‌ షెరావత్‌ కొత్త ఆశలు కల్పించాడు.

  • By: Somu |    sports |    Published on : Aug 08, 2024 5:14 PM IST
Aman Sehrawat | భారత ఆశలు సజీవంగా నిలిపిన రెజ్లర్‌ అమన్‌ షెరావత్‌

పారిస్‌: భారత స్వర్ణ ఆశాకిరణం వినేశ్‌ ఫొగట్‌ అనర్హతకు గురై నిరాశలో ఉన్న భారతదేశానికి యువ రెజ్లర్‌ అమన్‌ షెరావత్‌ కొత్త ఆశలు కల్పించాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో 57 కిలోల ఫ్రీ స్టయిల్‌ రెజ్లింగ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్‌, అల్బేనియాకు చెందిన జెలింఖాన్‌ అవాకరోవ్‌పై గురువారం అద్భుత విజయం సాధించి సెమీస్‌కు దూసుకుపోయాడు. రెండో రౌండ్‌లో ఆటపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన 21 ఏళ్ల అమన్‌.. మొదట్లోనే ప్రత్యర్థి కాళ్లను దిగ్బంధించాడు. అతడిని అలాగే వరుసగా తిప్పుతూ ఎనిమిది వరుస పాయింట్లు సాధించాడు. దీంతో 12, 0 పాయింట్ల తేడాతో అమన్‌ గెలుపొందాడు.

తొలి రౌండ్‌లో తన ప్రత్యర్థి ఎలాంటి దాడులు చేయలేకపోవడంతో అమన్‌కు పాసివిటీ పాయింట్‌ లభించింది. కొద్ది సేపటికే ప్రత్యర్థి కుడికాలును పట్టుకోవడంతో అతడికి రెండు పాయింట్లు లభించాయి. దీంతో తొలి రౌండ్‌ ముగిసే సమయానికి 3 పాయింట్లతో అమన్‌ నిలిచాడు. ఇక రెండో రౌండ్‌లో అబాకరోవ్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఎడమకాలిని పట్టుకుని అతడిని కిందపడేశాడు. అక్కడి నుంచి ఫిట్లీని ప్రదర్శించిన అమన్‌.. అవాకరోవ్‌ను పలుమార్లు తిప్పుతూ రెండు నిమిషాల్లోనే విజయం సాధించాడు. అమన్‌కు లభించిన చివరి రెండు పాయింట్లపై అబాకరోవ్‌ అభ్యంతరం తెలిపినా.. రిఫరీ మాత్రం అమన్‌కు అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చాడు. అంతకు ముందు నార్త్‌ మాసిడోనియన్‌ ప్రత్యర్థి వ్లదీమిర్‌ ఎగోరోవ్‌పై క్వార్టర్‌ ఫైనల్‌లో సునాయాస విజయం సాధించాడు. ఏషియన్‌ చాంపియన్‌షిప్‌ స్వర్ణ పతక విజేత అయిన అమన్‌.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైక పురుష రెజ్లర్‌.